Scorpio Horoscope | వృశ్చిక రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే
వృశ్చిక రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం.
Ugadi Panchangam | విశాఖ - 4వ పాదము, అనూరాధ - 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ- 1,2 పాదములు
* ఆదాయం - 14
* వ్యయం - 14
* రాజ్యపూజ్యం - 3
* అవమానం - 1
శ్రీ శుభకృత్ నామసంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి పంచమ స్థానమందు సంచరించుట, శని 4వ స్థానము, వక్రియై 3వ స్థానమునందు సంచరించుట, రాహువు శత్రు స్థానమగు 6వ స్థానమునందు సంచరించుట, కేతువు 12వ స్థానమునందు సంచరించుట చేత వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితములు ఉన్నవి. వృశ్చికరాశి వారికి రాహువు కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. 6వ ఇంట రాహువు ప్రభావముచేత శత్రు నాశనం జరిగి విజయం పొందుదురు.
ఏప్రిల్ నుంచి డిసెంబర్ సమయంలో శని వక్రియై 3వ స్థానమందు సంచరించుట చేత కుటుంబపరంగా, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితములు ఉండును. బృహస్పతి పంచమ స్థానములో సంచరించుట చేత కుటుంబమునందు అనుకూల ఫలితములు. పంచమ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యము, కుటుంబవిషయములు అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వృశ్చికరాశి వారికి ఉద్యోగ, వ్యాపారములలో శుభ ఫలితాలు కుటుంబమునందు అనుకూల ఫలితములు. వృశ్చికరాశికి అర్థాష్టము శని ప్రభావం చేత ఆరోగ్య, కుటుంబపరమైన విషయములయందు జాగ్రత్త వహించవలెను.
వృశ్చిక రాశివారికి ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు అనుకూల ఫలితములు. జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య మధ్యస్థ పరిస్థితులుగాను ఉన్నవి. వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభములు కలుగును. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితములు ఉన్నవి. విద్యార్థులకు అనుకూల సమయం. స్త్రీలకు మధ్యస్థ నుంచి అనుకూల సమయం. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయములందు జాగ్రత్త వహించవలెను. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు, సినీరంగం వారికి మధ్యస్థముగా ఉంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండును. వృశ్చికరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలి అనుకుంటే.. ఆదివారం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. మంగళవారం విఘ్నేశ్వరుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి.
మాసవారి ఫలితములు
ఏప్రిల్ - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సంతోషము పనుల యందు విజయము వృత్తి ఉద్యోగ వ్యాపారము నందు అభివృద్ధి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుట, స్వర్ణాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగం వంటివి కలిసివచ్చును.
మే - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. విందు భోజనములు చేయుదురు. సుఖము, శాంతి, రోగనివృత్తి, ధనలాభము, మిత్రలాభము. శత్రువులపై జయము కలుగును.
జూన్ - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. వృథా ప్రయాణములు, అకాల భోజనము, అనవసర ప్రయాణపు ఖర్చులు, మానసిక ఆందోళన, సంతానమునకు అనారోగ్య సమస్యలు. శుభకార్యములలో పాల్గొందురు.
జూలై - శత్రు బాధ అధికము ఈ మాసం అంత అనుకూలంగా లేదు. శత్రు బాధలు, దుఖ వార్తలు వింటారు. వస్తు, ధన, ధాన్య ఆభరణ లాభములు. ధన వ్యయము కలుగును. అవమానములకు గురుగుదురు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి కలుగును.
ఆగస్టు - ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉన్నది. పెద్దలతో గొడవలు, బంధు వియోగము, ధన నష్టము, అవమానము, ఆందోళన కలుగుతాయి. అపాయములు కలుగుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
సెప్టెంబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ధనము వలన లాభములు. సోదరులు, కుమారుల కారణంగా చికాకులు కలుగును. అపవాదులు ఎదుర్కొంటారు. బంధుమిత్రుల రాక శుభఫలితాన్నిస్తాయి.
అక్టోబర్ - ఈ మాసంలో మీకు మధ్యస్థ నుంచి అనుకూలంగా ఉన్నది. ఇంటినందు విందులు, శుభకార్యములు, కుటుంబమునందు శాంతి కలుగును. సంతానం కారణంగా సంతోషము. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములలో అభివృద్ధి కలుగును.
నవంబర్ - ఈ మాసం అంత అనుకూలంగా లేదు. రక్త సంబంధీకుల అనారోగ్యం, ధన వ్యయం, కుటుంబంలో భిన్నాభిప్రాయములు, అకాల భోజనములు కలుగును.
డిసెంబర్ - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టము, చికాకులు, కంటి వ్యాధులు ఇబ్బంది పెడతాయి. విద్య, అధికార లాభములు కలుగును.
జనవరి - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వంచించబడతారు. నీచులు, దుర్మార్గులతో స్నేహం చేస్తారు. అనవసర ప్రయాణములుండును.
ఫిబ్రవరి - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో సంతోషం, వ్యాపారములయందు ధననష్టుము, సంతానం వలన సౌఖ్యం, సంఘము నందు గౌరవం ఉండును.
మార్చి - ఈ మాసం అంత అనుకూలంగా లేదు. చేయు పనులు అనుకూలించును. బంధువర్గమందు శుభకార్యములు. మిత్రుల సహకారము, ప్రయాణములందు విఘ్నములు, అప్పుల వారి నుంచి ఒత్తిళ్లు కలుగును.
సంబంధిత కథనం