Leo Horoscope | సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..-results are from 2022 april to 2023 march for leo horoscope ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Results Are From 2022 April To 2023 March For Leo Horoscope

Leo Horoscope | సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

HT Telugu Desk HT Telugu
Apr 01, 2022 12:34 PM IST

సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్​ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా సింహ రాశి గురించి తెలుసుకుందాం.

సింహ రాశి ఫలితములు
సింహ రాశి ఫలితములు

Ugadi Panchangam | మఖ - 1, 2, 3 , 4 పాదములు, పుబ్బ - 1, 2, 3, 4 పాదములు, ఉత్తర - 1 పాదము

* ఆదాయం - 8

* వ్యయం - 14

* రాజ్యపూజ్యం - 1

* అవమానం - 4

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి అష్టమ స్థానమునందు సంచరించుట, శని సప్తమ స్థానము, వక్రియై 6వ స్థానమునందు సంచరించుట, రాహువు భాగ్యస్థానమగు 9వ స్థానమందు సంచరించుట, కేతువు 3వ స్థానమునందు సంచరించుటచేత సింహరాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితములు ఉన్నవి. సింహరాశి వారికి రాహువు కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ఉద్యోగములో అభివృద్ధి, ధనలాభము, కుటుంబము నందు సౌఖ్యము కలుగును. ప్రయాణములు లాభించును.

<p>చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ</p>
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సమయంలో శని వక్రియై 6వ స్థానమునందు సంచరించుటచేత కుటుంబపరంగా, ఉద్యోగ, వ్యాపారపరంగా శుభ ఫలితములు ఉండును. బృహస్పతి అష్టములలో సంచరించుట చేత ప్రతికూల ఫలితములు ఉండును. అష్టమ బృహస్పతి ప్రభావం చేత సింహరాశివారికి ఈ సంవత్సరం అనారోగ్య సూచనలు, కుటుంబ సమస్యలు అధికముగా ఉండును. ఉద్యోగ వ్యాపారములందు శుభ ఫలితములు, కుటుంబమునందు మధ్యస్థ ఫలితములు. సింహరాశివారికి అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్యమునకు సంబంధించిన విషయమందు, ఆర్థిక విషయములకు సంబంధించినటువంటి విషయములందు, కుటుంబ విషయములందు జాగ్రత్త వహించవలెను.

సింహరాశివారికి ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు మధ్యస్థ ఫలితములు జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య అనుకూల ఫలితములుగాను ఉన్నవి. సింహరాశివారికి ఈ సంవత్సరం ఆదాయం అధికంగా ఉండును. వ్యాపారస్తులకు లాభములు కలుగును. సింహరాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ నుంచి శుభ ఫలితములు ఉన్నవి. విద్యార్థులకు అనుకూల సమయం. స్త్రీలకు అనారోగ్య సూచనలు, మానసిక ఆందోళనలు అధికముగా ఉన్నవి. ఆరోగ్య విషయములమందు జాగ్రత్త వహించవలెను. వ్యాపారస్తులకు, రైతులు, సినీరంగం వారికి, రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. సింహ రాశివారు మరింత శుభఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలతో శనిని పూజించడం, గురువారం దత్తాత్రేయుని పూజించటం శుభకరం.

మాసవారి ఫలితములు

ఏప్రిల్ - ఈ మాసం అనుకూలంగా లేదు. ఇతరులకు బాధలు కలిగించే పనులు చేస్తారు. దూరప్రయాణముల వలన నీరసము, చెడు వార్తలు వింటారు. వస్తు, వస్త్ర ధాన్య లాభములు కలుగును.

మే - ఈ మాసం అనుకూలంగా లేదు. పెద్దలతో గొడవలు, బంధు వియోగము, మానసిక అశాంతి. సంతానము, సోదరులు మీపై కోపగిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో వృద్ధి కలుగును.

జూన్ - ఈ మాసం మీకు మధ్యస్థ ఫలిమతముగా ఉన్నది. అనారోగ్యము. బంధుమిత్రుల కలయిక. ఆర్థిక అభివృద్ధి కలుగును. వృత్తి, వ్యాపార ఉద్యోగాదుల్లో వృద్ధి కలుగును.

జూలై - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. సంసార సౌఖ్యము కలుగును. బంధుమిత్రుల సహకారం, ధన లాభము కలుగును. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారములందు అభివృద్ధి కలుగును.

ఆగస్టు - ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. బంధుమిత్రులతో విరోధములు, ధన నష్టము కలుగును. అకాల భోజనము, అనారోగ్యము కలుగును. అవమానము, అనవసర ప్రయాణమలు కలుగును.

సెప్టెంబర్ - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. మిత్రులు శత్రువులుగా మారతారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసిరావు.

అక్టోబర్ - ఈమాసం మీకు మధ్యస్థ ఫలితములున్నవి. బంధుమిత్రులతో గొడవలు, అనవసర ప్రయాణాలు, ధనము, కీర్తి నష్టములు కలుగును. మోసపోతారు.

నవంబర్ - ఈ మాసం మీకు అంతా అనుకూలంగా ఉన్నది. సంపద తిరిగి వస్తుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం ఉండును.

డిసెంబర్ - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. ఇంటిలో సుఖశాంతులు ఉండవు. అప్పులు ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో గొడవలు, ధనధాన్యాభివృద్ధి కలుగును.

జనవరి - ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. సంతానము అనారోగ్య సూచనలు, బంధువర్గంలో మరణం, సోమరితనం పెరుగుతుంది.

ఫిబ్రవరి - ఈ మాసం మీకు అంతా అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యము బాగుంటుంది. ప్రతి పని సకాలంలో పూర్తిచేస్తారు. ప్రయాణములు అధికముగా ఉండును. మానసిక ప్రశాంతత ఉంటుంది.

మార్చి - ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. అనవసర ప్రయాణాలు, మానసిక అశాంతి. అనారోగ్యముగా ఉండును. కోపము అధికముగా ఉండును. ఎక్కువగా ధనం ఖర్చు అయ్యే అవకాశముంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్