Black Neck In Winter: శీతాకాలంలో మెడ నల్లగా మారుతోందా.. కారణాలు, ఇంటి చికిత్సలివే..
Black Neck In Winter: శీతాకాలంలో కొందమందికి మెడ దగ్గర చర్మం నల్లగా మారిపోతుంటుంది. దాని కారణాలు, ఇంట్లోనే చేసుకోదగ్గ చికిత్సలేంటో చూసేయండి.
కొంత మందికి మెడ దగ్గర చర్మం నల్లగా మారి చూసేందుకు ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వల్ల వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఇది ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి మెడ నలుపుకు కారణాలు ఏమిటి? ఎలా దీన్ని పోగొట్టుకోవచ్చు? తెలుసుకుందాం రండి.
మెడ నలుపుకు కారణాలు :
కొంత మంది ఎక్కువగా ఎండలో ఉండి పని చేస్తూ ఉంటారు. అలా ఎక్కువగా ఎండకు ప్రభావితం కావడం వల్ల ఇలా మెడ దగ్గర నలుపు రావొచ్చు. అలాగే మెడ ప్రాంతంలో ఎక్కువగా మృత కణాలు పేరుకుపోవడం వల్ల కూడా అక్కడ నలుపుగా మారవచ్చు. మరి కొందరు చర్మాన్ని శుభ్రం చేసుకునే విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టరు. అలాంటి వారికీ ఇది ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువ కావడం వల్ల కూడా శరీరం ఇలా దాన్ని సూచిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, మధుమేహం రావడానికి సిద్ధంగా ఉన్న ప్రీ డయాబెటిక్‌లకు ఈ సూచనలు కనిపించవచ్చు.
మెడ నలుపుకు చికిత్సలు :
మెడ దగ్గర మృత కణాలు పేరుకుపోతే వాటిని ముందుగా మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం పాలల్లో కాస్త ఓట్ మీల్ కలిపి స్క్రబ్ చేసుకోవాలి. లేదంటే పెరుగులో కాస్త శెనగ పిండి వేసి స్క్రబ్బింగ్ చేసుకుని చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి కనీసం రెండు సార్లైనా వీటిలో ఏదో ఒక దాన్ని ప్రయత్నించాలి. మెడ మంచిగా ఉన్న వారైనా సరే దీన్ని నిరభ్యంతరంగా ప్రయత్నించవచ్చు. అందువల్ల అన్ని చోట్లా ఒకే రకమైన చర్మపు ఛాయ కలుగుతుంది.
లేదా రెండు చెంచాల శెనగ పిండిలో ఒక టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ నిమ్మరసం, కాస్త రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని మెడకు రాసుకుని 15 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేయడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.
మెడ నలుపును తగ్గించడానికి రకరకాల చికిత్సలు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని ఇంటి చికిత్సలను చేసుకుని కూడా మనం దీని నుంచి బయట పడొచ్చు. ముఖం పిగ్మంటేషన్, టానింగ్ కోసం వాడే మంచి క్లెన్సర్లను మనం వాడుతుంటాం కదా. దాన్నే మెడకు కూడా రాసుకుని క్లెన్స్ చేసుకోవచ్చు. ఇది చేసుకున్న తర్వాత ఒక వేళ మీ చర్మం పొడిగా అయిపోతున్నట్లు అనిపిస్తే వెంటనే మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి. అందువల్ల మెడ దగ్గర చర్మం మరింత బిరుసుగా మారకుండా మృదువుగా అవుతుంది.