Rava Punugulu: రవ్వ పునుగులు ఇలా అప్పటికప్పుడు పావుగంటలో చేసేయండి, రెసిపీ ఇదిగో
Rava Punugulu: తెలుగువారికి పునుగులు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వీటిని తినే వారి సంఖ్య ఎక్కువే. ఇక్కడ మేము అప్పటికప్పుడు చేసుకునే రవ్వ పునుగుల రెసిపీ ఇచ్చాము.
పునుగులు చేయాలంటే ముందుగానే మినప్పప్పును రుబ్బి పెట్టుకోవాలని అనుకుంటారు. అంత అవసరం లేదు. అప్పటికప్పుడు పావుగంటలో రవ్వ పునుగులను వండేసుకోవచ్చు. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. దీన్ని బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా కూడా ఉపయోగించుకోవచ్చు లేదా సాయంత్రం పూట స్నాక్స్ గా తినవచ్చు. ఎలా తిన్నా ఇవి చాలా రుచిగా ఉంటాయి. దీనిలో ఇతర పదార్థాలను కూడా కలుపుతాం కాబట్టి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇక రవ్వ పునుగులు ఎలా చేయాలో తెలుసుకోండి.
రవ్వ పునుగులు రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ - ఒక కప్పు
బియ్యప్పిండి - అరకప్పు
మైదా - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
వంటసోడా - అర స్పూను
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - మూడు
అల్లం - చిన్న ముక్క
కరివేపాకులు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
పెరుగు - అరకప్పు
నీళ్లు - సరిపడినంత
నూనె - వేయించడానికి సరిపడా
రవ్వ పునుగులు రెసిపీ
1. ఒక గిన్నెలో ఉప్మా రవ్వ, బియ్యప్పిండి, మైదా వేసి బాగా కలుపుకోవాలి.
2. అందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకుల తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.
4. అలాగే వంట సోడా అని కూడా వేసి కలుపుకోవాలి.
5. ఇప్పుడు అందులో పెరుగు, నీళ్లు వేసి పునుగులు వేయడానికి ఎంత మందంగా కావాలో అంత మందంగా వచ్చేవరకు కలుపుకోవాలి
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
7. ఆ నూనె వేడెక్కాక రవ్వ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా వేసి వేయించుకోవాలి.
8. అవి ముదురు బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
9. అంతే టేస్టీ రవ్వ పునుగులు రెడీ అయినట్టే.
10. దీన్ని పుదీనా చట్నీతో తిన్నా, కొబ్బరి చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి.
11. ఒక్కసారి వీటిని తిని చూడండి. మీకు అందరికీ నచ్చడం ఖాయం.
పిల్లలకు ఇలాంటి పునుగులు ఎక్కువగా నచ్చుతాయి. వారికి బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ రవ్వ పునుగులను పెడితే పొట్ట నిండా తింటారు. లేదా స్కూల్ నుంచి వచ్చాక సాయంత్రం వేళల్లో ఇలా పునుగులు చేసి పెడితే వారు ఇష్టంగా తినే అవకాశం ఉంది. వీటిని ఆయిల్ డీప్ ఫ్రై చేశాము కాబట్టి తరచూ చేసుకునే కన్నా నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే చేసుకొని తింటే మంచిది. ఎందుకంటే నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు అధికంగా తినకూడదని వైద్యులు చెబుతూ ఉంటారు.