Pregnancy Test: యూరిన్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ ఎలా తెలుస్తుంది? మూత్రంలో ఎలాంటి మార్పులు వస్తాయి?
Pregnancy Test: పెళ్లయిన ప్రతి స్త్రీ గర్భం ధరించాలని ఆశపడుతుంది. యూరిన్ టెస్ట్ ద్వారా గర్భం వచ్చిందో లేదో ఇప్పుడు తెలుసుకుంటున్నాం. యూరిన్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ ఎలా తెలుస్తుందో వివరంగా చెబుతున్నారు వైద్యులు.
Pregnancy Test: పెళ్లయిన ప్రతి జంట తమ జీవితంలోకి పాపనో, బాబును ఆహ్వానించాలని ఆశపడుతుంది. ఒకప్పుడు గర్భం ధరించారా లేదో తెలుసుకోవడానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు అంత సమయం అవసరం లేదు, పీరియడ్స్ రావాల్సిన సమయానికి రాకపోతే చాలు ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకొని యూరిన్ టెస్ట్ చేసి గర్భం ధరించారో లేదో ఇంటి దగ్గరే తెలుసుకుంటున్నారు. ఈ ప్రెగ్నెన్సీ కిట్లు అన్ని మందుల షాపుల్లో విరివిగా దొరుకుతున్నాయి. యూరిన్ టెస్ట్ ద్వారా గర్భం ధరించారో లేదో ఎలా తెలుస్తుంది? అనే సందేహం ఎక్కువ మందికి ఉంటుంది. కేవలం యూరిన్ టెస్ట్ ద్వారానే కాదు, రక్త పరీక్ష ద్వారా కూడా గర్భం ఉందో లేదో తెలుసుకోవచ్చు. కానీ అన్నింట్లోనే సులువైన పద్ధతి యూరిన్ టెస్ట్.
ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా?
ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకున్నాక అందులో ఉన్న స్టిక్ పై మూత్రం రెండు చుక్కలు వేయాలి. అది కాసేపటికి రెండు గీతలను చూపిస్తే గర్భం ధరించినట్టు అర్థం. ఒక గీత చూపిస్తే గర్భం ధరించలేదని అర్థం చేసుకోవాలి. గర్భం ధరించాక శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అలాగే హ్యూమన్ కోరియానిక్ గొనడోట్రోపిన్ (హెచ్‌సీజీ) అనే సమ్మేళనం ఉత్పత్తి అవుతుంది. ఇది కేవలం గర్భిణీలోని మూత్రంలో కనిపిస్తుంది. మూత్రపరీక్ష చేసినప్పుడు ఈ హెచ్‌సీజీ ఉనికి కనిపిస్తే గర్భం ధరించినట్లు లెక్క. ఈ హెచ్‌సీజీ ఉంటేనే ప్రెగ్నెన్సీ స్టిక్ పై రెండు గీతలు కనిపిస్తాయి. అలా యూరిన్ టెస్ట్ ద్వారా గర్భం ధరించారో లేదో తెలుసుకుంటారు.
ఇలా ప్రెగ్నెన్సీ కిట్ల ద్వారా యూరిన్ పరీక్ష చేశాక గర్భం ధరించారో లేదో తెలుసుకోవడం అనేది తొలిసారి 1960లో మొదలుపెట్టారు. అయితే దీని గురించి ప్రజల్లో అవగాహన పెరగడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు అందరూ కూడా ఇదే పరీక్ష పై ఆధారపడుతున్నారు.
ఈ మూత్ర పరీక్ష అనేది ఇప్పుడు మొదలైంది కాదు, ఈజిప్షియన్లు 4,500 కిందటే గర్భం వచ్చిందో లేదో తెలుసుకునేందుకు యూరిన్ టెస్టులు చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక మహిళ గర్భవతో కాదో తెలుసుకునేందుకు ఆమె మూత్రాన్ని సేకరించేవారు. ఆ మూత్రంలో గోధుమలు, బార్లీ గింజలు ఉంచేవారు. అవి మొలకెత్తితే ఆమె గర్భవతి అని నమ్మేవారు. అవి మొలకెత్తకపోతే ఆమెకు గర్భం లేదని తేల్చేవారు. ప్రాచీన కాలంలో ఇలాంటి మూత్ర పరీక్ష ఉండేదని, ఇప్పటికీ ఎంతోమంది నమ్ముతారు. ఈజిప్షియన్లు చేసిన ఈ మూత్ర పరీక్ష ద్వారా గర్భం వచ్చిందా? లేదా అనేది తెలుసుకోవడం సరైనదేనని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భిణిగా ఉన్న మహిళల మూత్రంలో గింజలు మొలకెత్తుతాయని ఎన్నో అధ్యయనాలు నిర్ధారించాయి. డబ్బై శాతం వరకు ఈ ఫలితాలు సరైనవే అవుతాయని అవి చెబుతున్నాయి. అయితే గర్భంలో లోపల ఉన్నది బాబా, పాప అని తెలుసుకోవడానికి మాత్రం ఏ పరీక్షలు పనిచేయవు. కేవలం స్కానింగ్ ద్వారా మాత్రమే గర్భంలో ఉన్నది ఎవరో తెలుసుకోవచ్చు. అలా ముందుగా తెలుసుకోవడం ఇప్పుడు మన దేశంలో చట్టవిరుద్ధం.
టాపిక్