Pesarattu sandwich: పెసరట్టుతో శ్యాండ్‌విచ్.. లంచ్ బాక్స్, స్నాక్ రెసిపీ-pesarattu sandwich recipe for lunch box and snack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pesarattu Sandwich: పెసరట్టుతో శ్యాండ్‌విచ్.. లంచ్ బాక్స్, స్నాక్ రెసిపీ

Pesarattu sandwich: పెసరట్టుతో శ్యాండ్‌విచ్.. లంచ్ బాక్స్, స్నాక్ రెసిపీ

Koutik Pranaya Sree HT Telugu
Sep 30, 2024 03:30 PM IST

Pesarattu sandwich: పిల్లలకు స్నాక్స్ కోసం రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలనుకుంటే ఒకసారి పచ్చి పెసరపప్పుతో చేసిన శాండ్విచ్ ట్రై చేయండి. ప్రోటీన్, పిండి పదార్థాలు అధికంగా ఉండే ఈ స్నాక్ తయారు చేయడం కూడా సులభం.

పెసరట్టు శ్యాండ్‌విచ్
పెసరట్టు శ్యాండ్‌విచ్ (shutterstock)

రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్ కాావాలంటే పొట్టు పెసరపప్పుతో శ్యాండ్‌విచ్ చేసి పెట్టండి. హై ప్రొటీన్ స్నాక్ కూడా. సాధారణంగా శ్యాండ్ విచ్ అంటే ఫ్యాన్సీ పదార్థాలతోనే చేస్తుంటాం. ఈసారి మనింట్లో ఉండే పొట్టు పెసరపప్పుతో చేసి చూడండి. రుచి కూడా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్ లోకి పెట్టిచ్చినా కడుపు నిండిపోతుంది. 

పెసరట్టు శ్యాండ్విచ్ కోసం కావలసిన పదార్థాలు:

ఒక కప్పు పచ్చి పెసరపప్పు

4 బ్రెడ్ స్లైసులు

1 టమాటా

రెండు టీస్పూన్ల శనగపిండి

రుచికి సరిపడా ఉప్పు

అర టీస్పూన్ జీలకర్ర

చిటికెడు ఇంగువ

అర చెంచా పసుపు

అర చెంచా గరం మసాలా

చెంచాడు మయోనైజ్

2 స్లైసుల చీజ్

2 చెంచాల టమాటా సాస్

2 చెంచాల దేశీ నెయ్యి

పెసరట్టు శాండ్విచ్ రెసిపీ:

- ముందుగా ఒక కప్పు పెసరపప్పును రాత్రంతా నీటిలో నానబెట్టు కోవాలి.

- మరుసటి రోజు ఉదయం పెసరపప్పును కడిగి నీళ్లు లేకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలి.

- ఇప్పుడు ఈ పెసరపప్పు ముద్దలో ఉప్పు, రెండు చెంచాల శనగపిండి కలపండి. శనగపిండి వల్ల పెసరట్టు కాస్త క్రిస్పీగా వస్తుంది.

- పెసరట్టు పిండిలోనే ఇంగువ, జీలకర్ర కూడా వేయాలి. నీళ్లు పోసి చిక్కటి పిండిలా తయారు చేసుకోవాలి.

- ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ ను మీడియం మంట మీద వేడి చేసి, కొద్దిగా నెయ్యి వేసి, తయారు చేసిన పెసరపప్పు మిశ్రమంతో కాస్త మందంగా ప్యాన్ కేక్ లాగా వేసుకోవాలి.

- స్పూన్ సాయంతో వీలైతే దీనికి చతురస్రాకారం తీసుకురండి. అలా చేస్తే బ్రెడ్ లో పెట్టడానికి బాగుంటుంది.

- దీన్ని రెండు వైపుల నుండి కాల్చుకోండి.

- ఇప్పుడు బ్రెడ్ మీద టమాటా సాస్, మయోనైజ్ రాసుకోండి.ఒక చీజ్ స్లైస్ పెట్టి కాస్త మసాలా చల్లండి. టమాటాని చక్రాల్లా కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ బ్రెడ్ స్లైస్ అర నిమిషం తావా మీద ఉంచితే చీజ్ కరుగుతుంది ఇప్పుడు మీద ముందుగా రెడీ చేసుకున్న పెసరట్టు పెట్టుకోవాలి.

- మీద మరో బ్రెడ్ పెట్టుకుని దాన్ని కూడా కాస్త బటర్ లేదా నెయ్యి వేసి కాల్చుకోండి. అంతే పెసరట్టు శ్యాండ్ విచ్ రెడీ అయినట్లే.