Bread masala: స్పైసీగా కరకరలాడే బ్రెడ్ మసాలా, బెస్ట్ స్నాక్ తయారీ ఇలాగే-how to make snack item spicy bread masala recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bread Masala: స్పైసీగా కరకరలాడే బ్రెడ్ మసాలా, బెస్ట్ స్నాక్ తయారీ ఇలాగే

Bread masala: స్పైసీగా కరకరలాడే బ్రెడ్ మసాలా, బెస్ట్ స్నాక్ తయారీ ఇలాగే

Koutik Pranaya Sree HT Telugu
Aug 30, 2024 03:30 PM IST

Bread masala: కారంగా, కరకరలాడుతూ ఉండే బ్రెడ్ మసాలా ఎప్పుడైనా తిన్నారా? పది నిమిషాల్లో మీకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే చేసే బెస్ట్ స్నాక్ ఇది. దీని తయారీ విధానం వివరంగా చూసేయండి.

బ్రెడ్ మసాలా
బ్రెడ్ మసాలా

దాదాపు అందరిళ్లలోనూ బ్రెడ్ ఉంటుంది. సాయంత్రం పూట ఏదైనా తినాలనిపిస్తే దాంతోనే స్పైసీగా బ్రెడ్ మసాలా రెసిపీ చేసేయొచ్చు. పిల్లలు, పెద్దలకు ఏదో ఫాస్ట్ ఫుడ్ తిన్నట్లూ అనిపిస్తుంది. ఈ రెసిపీ చేయడం కూడా చాలా సులువు.

బ్రెడ్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు:

5 కప్పుల బ్రెడ్ ముక్కలు లేదా 6 బ్రెడ్ స్లైసులు

2 చెంచాల నూనె లేదా బటర్

అరచెంచా అల్లు వెల్లుల్లి ముద్ద

రెండు పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు

1 పెద్ద ఉల్లిపాయ, సన్నటి తరుగు

2 టమాటాలు, సన్నటి ముక్కలు

అరచెంచా పసుపు

అరచెంచా కారం

అరచెంచా కసూరీ మేతీ

అరచెంచా జీలకర్ర పొడి

అరచెంచా జీలకర్ర పొడి

అరచెంచా గరం మసాలా

అరచెంచా ఉప్పు

గుప్పెడు కొత్తిమీర తరుగు

1 నిమ్మకాయ

బ్రెడ్ మసాలా తయారీ విధానం:

  1. ముందుగా బ్రెడ్ అంచులు కట్ చేసి బ్రెడ్ ను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నూనె లేదా బటర్ వేసుకోవాలి. వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాస్త రంగు మారాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.
  3. టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. మీకిష్టం ఉంటే సన్నగా తరిగిన క్యారట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవచ్చు.
  4. టమాటాలు మగ్గిపోయాక కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి.
  5. కాసేపటికి నూనె అన్ని వైపులా తేలుతుంది. ఇప్పుడు కొత్తిమీర, కసూరీ మేతీ కూడా వేసుకొని కలుపుకోవాలి.
  6. దీంట్లో ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. మీకు బ్రెడ్ మసాలా కాస్త క్రిస్పీగా కావాలనుకుంటే.. మరో ప్యాన్ పెట్టి నూనెలో బ్రెడ్ ముక్కల్ని కాసేపు వేయించాలి. దాంతో అవి కాస్త కరకరలాడుతూ రుచి బాగుంటాయి. వాటిని మసాలాలో కలిపి వెంటనే స్టవ్ కట్టేయాలి.
  7. అంతే.. స్టవ్ కట్టేసి కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే. మీద కాస్త నిమ్మరసం చల్లితే రుచి బాగుంటుంది.

దీనికి మరింత రుచి, స్ట్రీట్ స్టైల్ లో చేయాలనుకుంటే ఈ మసాలాలోనే టమాటా సాస్, సోయాసాస్ కాస్త కలుపుకోవచ్చు. మీకు నచ్చితే మరిన్ని కూరగాయ ముక్కలూ వేసుకోవచ్చు. బ్రెడ్ బదులుగా టోస్ట్ కూడా వాడుకోవచ్చు. టోస్ట్ వాడితే కొన్ని నీళ్లు చిలకరించి మగ్గించుకుంటే మెత్తబడతాయి.

టాపిక్