Pesarapappu charu: నోటి రుచి పాడైతే.. ఇలా పెసరపప్పు చారు చేసుకోండి, తృప్తిగా తింటారు-how to make pesarapappu charu recipe for plain rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pesarapappu Charu: నోటి రుచి పాడైతే.. ఇలా పెసరపప్పు చారు చేసుకోండి, తృప్తిగా తింటారు

Pesarapappu charu: నోటి రుచి పాడైతే.. ఇలా పెసరపప్పు చారు చేసుకోండి, తృప్తిగా తింటారు

Pesarapappu charu: పెసరపప్పుతో పుల్లగా, కారంగా ఉండే చారు పెట్టి చూడండి. నోటికి ఏమీ రుచించనప్పుడు దీంతో తింటే కడుపు నిండుతుంది. పెసరపపప్పు చారు రెసిపీ చూసేయండి.

పెసరపప్పు చారు

చారు అంటే చింతపండుతో చేసుకునే పచ్చిపులుసు గుర్తొస్తుంది. కానీ ఒకసారి కాస్త పెసరపప్పు కలిపి చేసుకునే ఈ పెసరపప్పు చారు చేసి చూడండి. చాలా చోట్ల కందిపప్పుతో చేసుకునే పప్పుచారు లాగానే ఉంటుంది .కానీ మరింత రుచిగా రావాలంటే ఈ పద్ధతిలో చేసి చూడండి. రోజటి కన్నా ఒక ముద్ద ఎక్కువే తింటారు.

పెసరపప్పు చారు తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు పెసరపప్పు

పావు చెంచా పసుపు

1 చెంచా నూనె

1 టమాటా సన్నటి ముక్కలు

1 ఉల్లిపాయ సన్నటి ముక్కలు

3 పచ్చిమిర్చి ముక్కలు

అంగుళం అల్లం ముక్క

1 చెంచా ఉప్పు

కరివేపాకు రెబ్బ

పావు కప్పు చింతపండు రసం

కొద్దిగా కొత్తిమీర తరుగు

నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు

పావు చెంచా ఆవాలు

పావు చెంచా జీలకర్ర

చిటికెడు ఇంగువ

రెండు ఎండు మిర్చి

కరివేపాకు రెబ్బ

పెసరపప్పు చారు తయారీ విధానం:

1. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఒక కప్పు పప్పుకు 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి.

2. పసుపు, చెంచా నూనె కూడా వేసి ఉడికించుకోవాలిా. 3 విజిల్స్ వచ్చేదాకా పప్పు ఉడకనివ్వాలి.

3. ఇప్పుడు కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో కాస్త మెత్తగా మెదుపుకోవాలి. పప్పు క్రీమీగా వెన్నలాగా అయిపోవాలి.

4. ఇప్పుడు అదే కుక్కర్లో పప్పులోనే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, కరివేపాకు రెబ్బ, చింతపండు రసం కూడా వేసుకోవాలి.

5. ఇవన్నీ కనీసం పదినిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు టమాటా ముక్కలు మెత్తబడిపోతాయి.

6. పప్పు బాగా గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకుని పలుచగా చేసుకోవచ్చు. నీళ్లు పోస్తే మరి కాసేపు పప్పును ఉడకనివ్వాలి.

7. ఈలోపు మరో గిన్నె పెట్టుకుని పప్పుకు తాలింపు పెట్టుకోవాలి. నూనె పోసుకుని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపును ఉడుకుతున్న పప్పులో కలిపేసుకోవాలి.

8. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకుని దించేసుకుంటే పెసరపప్పు చారు రెడీ అయినట్లే. దీన్ని వేడి అన్నంతో సర్వ్ చేయండి. కడుపునిండా తింటారు. పక్కన వడియాలు పెట్టుకుని తింటే ఎంత అన్నమైనా తినేయొచ్చు.