Peanut Butter: పీనట్ బటర్ కొంటున్నారా? ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
Peanut Butter: పిల్లలకు పీనట్ బటర్ అంటే ఎంతో ఇష్టం బ్రెడ్ కు జతగా వారు తినేది ఇదే
Peanut Butter: పీనట్ బటర్ అనగానే అదేదో ప్రత్యేకమైన పదార్థంగా చూస్తారు. దాన్ని వండడం చాలా కష్టం అనుకుంటారు. నిజానికి దీన్ని తయారు చేయడం చాలా సులువు. ఇంట్లోనే దీన్ని తయారు చేసి వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారుచేసి తాజాగా తినవచ్చు. లేదా ఒకసారి చేసి నిల్వ చేసుకోవచ్చు. పిల్లలకు పీనట్ బటర్, బ్రెడ్ కాంబినేషన్ ఎంతో నచ్చుతుంది. మీరు ఇంట్లోనే పీనట్ బటర్ తయారు చేస్తే ఎలాంటి రసాయనాలు కలపని స్వచ్ఛమైనది పిల్లలకు తినిపించవచ్చు.
పీనట్ బటర్ రెసిపీకి కావలసిన పదార్థాలు
వేరుశనగ పలుకులు - ఒక కప్పు
వేరుశనగ నూనె - మూడు స్పూన్లు
తేనె - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పీనట్ బటర్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశెనగ పలుకులు వేసి వేయించాలి.
2. బాగా వేయించాక పైన ఉన్న పొట్టును తీసేయాలి.
3. ఇప్పుడు ఆ పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
4. వాటిని ఎంతగా రుబ్బితే అది అంత మెత్తగా అవుతుంది. మొదట పొడిలా కనిపించినా... అలా మిక్సీ పడుతున్న కొద్దీ ముద్దలా తయారవుతుంది. అది ముద్దలా మారాలంటే కాస్త ఓపికగా మిక్సీ పట్టాల్సిందే.
5. ఇప్పుడు మూడు స్పూన్లు పల్లీల నూనె, ఒక స్పూన్ తేనె, అర స్పూను ఉప్పు వేసి మిక్సీ పట్టాలి.
6. అంతే పీనట్ బటర్ రెడీ అయినట్టే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి.
7. దీన్ని చపాతీ తో తిన్న టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్ తో కూడా రుచిగా ఉంటుంది
పీనట్ బటర్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా దీన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి ఇలాంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ కలపకుండా ఉంటుంది. దీంట్లో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది గుండెకు మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. బాడీ బిల్డింగ్ చేయాలనుకునేవారు రోజూ పీనట్ బటర్ తింటే మంచిది. దీన్ని తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. బరువు తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. గుండె జబ్బులు, మధుమేహంతో పోరాడేవారు ప్రతిరోజూ పీనట్ బటర్ తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో స్మూతీలు వంటివి తయారు చేసుకుని తినడం వల్ల టేస్టీగా ఉంటుంది.
టాపిక్