Morning Mood । ఉదయం పూట మీ మూడ్ బాగోలేదా? ఈ చిట్కాలతో అంతా సెట్!
Morning Mood: ఉదయం మూడ్ బాగోలేకపోతే ఆ రోజంతా మీరు ఏ పనిని చురుకుగా చేయలేరు. కొన్ని సులభమైన చిట్కాలను ఇక్కడ అందిస్తున్నాం. ఇవి మీ ప్రతికూల ఆలోచనలకు దూరం చేసి, మీకు మంచి మూడ్ అందించడంలో సహాయపడతాయి.
Morning Mood: కొన్నిసార్లు ఉదయం శుభోదయం లాగా అస్సలు ఉండదు. గుడ్ మార్నింగ్ అని చెప్పాలనిపించదు, వినాలనిపించదు. చిరాకుగా ఉంటుంది, ఎవరైనా మీతో జోక్స్ వేసిన నవ్వు రావటానికి బదులు కోపం వస్తుంది. రోజూవారీ ఒత్తిళ్లు, ఆందోళనలతో రాత్రి సరిగ్గా నిద్రలేకపోవడం, ఒకేరకమైన పని లేదా పనిచేసే చోట సరైన వాతావరణం లేకపోవడం, మీ దైనందిన దినచర్యపై మీకే విసుగు పుట్టడం లేదా ఏవైనా సంఘటనలు మీ మూడ్ చెడగొట్టవచ్చు. ఉదయం మూడ్ బాగోలేకపోతే ఆ రోజంతా మీరు ఏ పనిని చురుకుగా చేయలేరు. ప్రశాంతంగా ఉండలేరు, మనసు కలతగా ఉంటుంది. కాబట్టి మీరు రోజంతా హుషారుగా ఉండాలంటే ఉదయం పూట మీ మైండ్‌సెట్ సానుకూలంగా ఉండాలి.
మీ మానసిక స్థితిని పెంపొందించడానికి. ప్రతి ఉదయం అనవసరమైన టెన్షన్ల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన చిట్కాలను ఇక్కడ అందిస్తున్నాం. ఇవి మీ ప్రతికూల ఆలోచనలకు దూరం చేసి, మీకు మంచి మూడ్ అందించడంలో సహాయపడతాయి.
1. కొంత సూర్యరశ్మిని పొందండి
మన శరీరం సూర్యరశ్మికి గురైనప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది డిప్రెషన్‌ను నివారించడంలో సహాయపడే హార్మోన్. అయితే ఎక్కువసేపు కఠినమైన ఎండలో ఉండకండి. ఎండ తక్కువగా ఉన్నప్పుడు, వెచ్చని లేత సూర్య కిరణాలు మీ శరీరాన్ని తాకేలా ఒక 10-15 నిమిషాల పాటు ఎండలో ఉండండి. అంతకంటే ముందు చర్మానికి సన్ స్క్రీన్ రాసుకోండి. ఇలా కొంత సూర్యరశ్మిని గ్రహించడం వల్ల మీ మూడ్ మారుతుంది.
2. వాకింగ్ చేయండి.
తేలికపాటి శారీరక శ్రమ కూడా మీకు ఒక మూడ్ బూస్టర్ లాంటిదే. మార్నింగ్ వాక్ వెళ్లండి. లేదా మీ ఆఫీసులోనే కొద్దిసేపు అటూఇటూ నడవండి. ఒక్క నడవడమనే కాదు, సైక్లింగ్ చేయవచ్చు, లేదా మీ శరీరాన్ని కదిలించే ఏదైనా గేమ్ ఆడవచ్చు, ఏదీ సాధ్యంకాకపోతే ఉన్నచోటనే కొన్ని స్ట్రెచింగ్ చేయవచ్చు.
3. ప్రకృతిని గమనించండి
ప్రకృతి ఎంతో అందమైనది, ఇది మిమ్మల్ని ఎంతో తేలికపరుస్తుంది. మీరు వెళ్లే దారిలో ఆకుపచ్చని చెట్లు, రంగురంగుల పూలు, పూల సువాసనలు ఆస్వాదించండి. ఆకాశంలో మేఘాల ఆకృతిని చూడండి. వర్షం పడుతుంటే వర్షాల చినుకులు చూడండి. పక్షుల కదలికలు చూడండి. ఇలా ప్రకృలో ఎన్నో ఉంటాయి, కాసేపు ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తే చాలు మీ మూడ్ సెట్.
4. మనసులో ప్రేమను ఆస్వాదించండి
ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రెస్ బస్టర్ ఉంటుంది. కొందరికి ఆఫీసులో అందమైన కొలీగ్ ను చూడటం, మాట్లాడటం, మనసులో ప్రేమను ఆస్వాదించడం కూడా ఒక స్ట్రెస్ బస్టర్. లేదా మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలను, మీ ప్రియమైన వ్యక్తులను ముద్దు పెట్టుకోండి, కౌగిలించుకోండి. మీ స్నేహితులు లేదా మీ తోటి వారితో కాసేపు మాట్లాడండి, మ్యూజిక్ వినండి, మీ మూడ్ మారుతుంది.
5. పోషకాహారం
ఆహారం కూడా మీ మూడ్ పై ప్రభావం చూపుతుంది. విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ కలిగిన ఆహారాలు తింటే, అవి మనసుకు ప్రశాంతత ప్రభావాన్ని కలిగిస్తాయి. మెగ్నీషియం మానసిక స్థితిని స్థిరీకరించే సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ పోషకం ఎక్కువగా చేపలు, అరటిపండు, డ్రై ఫ్రూట్స్, ముల్లంగి వంటి కూరగాయలలో లభిస్తుంది. సాల్మన్, సార్డినెస్ వంటి చేపల్లో అలాగే వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మానసిక స్థితిని పెంచడంలో సహాయపడతాయి. అయితే మూడ్ బాగుండాలంటే వేపుళ్ల జోలికి వెళ్ళవద్దు. ఆల్కహాల్ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది, నిరాశకు కారణమవుతుంది. మద్యం మానేయటమే మంచిది.
సంబంధిత కథనం