Avoid Nonstickware: నాన్ స్టిక్ వంట సామాను చూసేందుకు స్టైల్‌గా ఉంటాయి, కానీ మీ ఆరోగ్యాన్ని తినేస్తాయి-nonstick cookware looks stylish but can harm your health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Avoid Nonstickware: నాన్ స్టిక్ వంట సామాను చూసేందుకు స్టైల్‌గా ఉంటాయి, కానీ మీ ఆరోగ్యాన్ని తినేస్తాయి

Avoid Nonstickware: నాన్ స్టిక్ వంట సామాను చూసేందుకు స్టైల్‌గా ఉంటాయి, కానీ మీ ఆరోగ్యాన్ని తినేస్తాయి

Haritha Chappa HT Telugu
May 13, 2024 07:00 AM IST

Avoid Nonstickware: నాన్ స్టిక్ వంట సామాను ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. ఇవి చూసేందుకు అందంగా ఉంటాయి. స్టైల్ గా ఉంటాయి. అందుకే వీటిని కొనేవారి సంఖ్య పెరిగిపోయింది. కానీ వీటితో ఎన్నో ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి.

నాన్ స్టిక్ కుక్‌వేర్
నాన్ స్టిక్ కుక్‌వేర్ (pixabay)

Avoid Nonsticks: ఇప్పుడు ప్రతి వంటింట్లో నాన్ స్టిక్ వంట సామాను కనిపిస్తోంది. ఇవి చూసేందుకు స్టైల్ గా ఉండడం వల్ల కిచెన్‌కు అందాన్ని తెచ్చి పెడతాయని ఎంతోమంది వీటిని కొంటున్నారు. అలాగే వేపుళ్ళు, కూరలు అడుగంటకుండా, మాడిపోకుండా వీటిలో ఉండవచ్చు. అందుకే వీటి అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. నిజానికి నాన్ స్టిక్ కుక్‌వేర్‌లో వండడం వల్ల మన ఆరోగ్యానికి ప్రమాదం.

టెఫ్లాన్ అంటే...

నాన్ స్టిక్ కుక్‌వేర్‌లు అయిన ఫ్రైయింగ్ పాన్లు, కళాయిలు వంటివి పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ అనే పదార్థంతో తయారుచేస్తారు. ఈ పదార్థాన్ని అడుగు భాగాన పోతగా వేస్తారు. దీన్నే టెఫ్లాన్ అని కూడా అంటారు. ఇది కార్బన్, ఫ్లోరిన్ పరమాణువులతో తయారైన సింథటిక్ రసాయనం. మొదటిసారి ఈ టెఫ్లాన్ ను 1930లో సృష్టించారు.

వంట సామానుకు ఈ టెఫ్లాన్ పూత పూయడం సురక్షితమని ఎంతోమంది భావన. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఈ టెఫ్లాన్ పూత పూసిన వంట సామానుపై వండితే పరవాలేదు, కానీ అధిక ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువ సమయం పాటు వండితే ఈ టెఫ్లాన్ పూతలు విరిగి, పెళుసులుగా మారి ఊడిపోతాయి. అవన్నీ కూడా ఆహారంలోనే కలిసిపోతాయి. ఆ రసాయనాలన్నీ విషపూరిత రసాయనాలు. అవి గాలిలోకి విడుదలవుతాయి. అలాగే ఆహారంలో కలిసి శరీరంలో చేరుతాయి. వీటివల్ల జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తూ ఉంటాయి.

ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

నాన్ స్టిక్ వంట సామానును వాడుతున్నప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాలి. ఖాళీ కళాయిని స్టవ్ మీద పెట్టి ముందుగానే వేడి చేయవద్దు. ఎందుకంటే అవి నిమిషాల్లో అధిక ఉష్ణోగ్రతకు చేరుకుంటాయి. అప్పుడు ఈ రసాయనాలు పొగల రూపంలో విడుదలవుతాయి. అలాగే అధికమంట వద్ద ఈ నాన్ స్టిక్ కుక్ వేర్‌లో ఏదీ వండకండి. మీడియం మంట మీదే వండాలి. అలాగే బాగా వెంటిలేషన్ ఉన్నప్పుడే ఈ నాన్ స్టిక్ కుక్‌వేర్‌ను వాడాలి. నాన్ స్టిక్ వేరు పై వంట చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసి ఉంచడం మంచిది. ఈ నాన్ స్టిక్ వంటసామానును గోరువెచ్చని నీటితో సున్నితమైన వస్త్రంతో రుద్దడం మంచిది. లేకుంటే టెఫ్లాన్ పూత రాలిపోతాయి.

నాన్‌స్టిక్ కుక్‌వేర్ కన్నా స్టీల్ సామాన్లు వాడడం ఉత్తమం. అలాగే క్యాస్ట్ ఐరన్ వాడడం మంచిది. కాస్ట్ ఐరన్‌తో చేసిన వంట సామాన్లు సాధారణంగానే నాన్ స్టిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.

టాపిక్