NASA | మన సౌర కుటుంబం వెలుపల మరో 5 వేల ప్రపంచాలు.. నాసా ధృవీకరణ!
సూర్యుడి చుట్టూ భూమితో కలిపి మొత్తం తొమ్మిది గ్రహాలు తిరుగుతాయని తెలుసు. ఇది మన సౌర కుటుంబం. కానీ మన సౌర కుటుంబం దాటి చూస్తే కొత్తగా మరో 65 కొత్త గ్రహాలను నాసా కనుగొంది. వీటిలో కొన్ని గ్రహాలు భూమిని పోలి ఉన్నాయని తెలిపింది. ఇలా మొత్తం 5000కు పైగా ప్రపంచాలు ఉండొచ్చని నాసా అంచనా వేస్తుంది.
Washington DC | మీకు ఎప్పుడైనా ఆకాశంలో చుక్కల్ని చూస్తే అనిపించిందా? ఈ అనంతమైన విశ్వంలో మనం ఎక్కడున్నాం అని? ఈ సందేహం ఇక్కడితో కూడా ఆగదు మన భూమి లాంటి గ్రహాలు ఇంకా ఉన్నాయా? అక్కడ కూడా మనలా మనుషులు ఉంటారా? ఏలియన్స్ నిజమేనా? ఇలా వరుసపెట్టి సందేహాలు వస్తాయి. ఇంతపెద్ద విశ్వంలో మన భూమి ఒంటరిదా? అంటే కచ్చితంగా కాదని నాసా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తాజాగా మన సౌర కుటుంబం వెలుపల 65 కొత్త గ్రహాలను గుర్తించింది. ఇందులో అచ్ఛం మన భూమిని పోలిన గ్రహాలు కూడా ఉండటం విశేషం. అంటే ఆ గ్రహాల ఉపరితలంపైనా నీరు, సూక్ష్మజీవులు, వాయువులు లేదా జీవం ఉనికిని బలపరిచే కూర్పులను కలిగి ఉన్నాయి. అంతేకాదు మన సౌరకుటుంబం వెలుపల చూస్తే నక్షత్రాల చుట్టూ మనలాంటి 5000 ప్రపంచాల ఉనికిని నాసా నిర్ధారించింది. వాస్తవానికి అంతకు మించి లెక్కలేనన్ని ప్రపంచాలు కూడా ఉండొచ్చు.
ఎన్నో ఏళ్లుగా అంతరిక్షంపై పరిశోధనలు చేస్తున్న నాసా ఎన్నో ఖగోళ రహస్యాలను బయటపెట్టింది. తాజాగా కనిపెట్టిన కొత్త గ్రహాలు కూడా వివిధ రకాల కచ్చితమైన పద్ధతులను ఉపయోగించి ధృవీకరించింది. పీర్-రివ్యూడ్ సైంటిఫిక్ పేపర్లలో కనిపించే ఎక్స్‌ప్లానెట్ ఆవిష్కరణలను రికార్డ్ చేసింది. వివిధ విశ్లేషణాత్మక పద్ధతుల ద్వారా అవి మనలాంటి సౌర కుటుంబాలేనని నాసా ధృవీకరించింది. వాటిలో ప్రతి ఒక్కటి ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త గ్రహం అని నాసా పేర్కొంది.
Watch Video Here:
కొన్ని గ్రహాలు భూమిని పోలినట్లుగా చిన్నవిగా ఉండగా, మరికొన్ని పూర్తిగా రాతి శిలలతో గురుగ్రహం కంటే పెద్దగా ఉన్నాయి. ఇంకా కొన్ని గ్రహాల్లో పూర్తిగా గ్యాస్ నిండిపోయి ఉన్నాయి. కక్ష్యలో కొన్ని 'సూపర్-ఎర్త్స్' కూడా ఉన్నాయి. అవి భూమిలాగే ఉండి మనకంటే ఎన్నో రేట్లు పెద్దగా ఉన్నాయి. మన నెప్ట్యూన్ గ్రహాన్ని పోలి అతిచిన్నగా మినీ-నెప్ట్యూన్స్ గ్రహాలు కూడా ఉన్నట్లు నాసా వెల్లడించింది.
ఇదిలా ఉంటే నాసా మరొక ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా గుర్తించింది. కొన్ని గ్రహాలు ఒకేసారి రెండు సౌర కుటుంబాలలో అంటే సూర్యుడి లాంటి రెండు నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తుండటం గమనించింది. అలాగే కొన్ని గ్రహాలు నిప్పు చల్లారిపోయిన 'మృత నక్షత్రాల' చుట్టూ మొండిగా తిరుగుతుండటం గమనించింది.
కాగా, తాజాగా కనుగొన్న కొత్త గ్రహాలలో ఏముంది అనేది ఇంకా తమకు తెలియరాలేదని, అయితే మన భూమి లాంటి గ్రహాలు ఉండటం తమను మరింత ఉత్సాహానికి గురిచేస్తుందని నాసా ఎక్సోప్లానెట్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనా శాస్త్రవేత్తగా ఉన్న జెస్సీ క్రిస్టియన్‌సెన్ అన్నారు.