Munakkaya Fish Pulusu: మునక్కాయ చేపల పులుసు ఇలా చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, అంత రుచి-munakkaya fish pulusu recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Munakkaya Fish Pulusu: మునక్కాయ చేపల పులుసు ఇలా చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, అంత రుచి

Munakkaya Fish Pulusu: మునక్కాయ చేపల పులుసు ఇలా చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, అంత రుచి

Haritha Chappa HT Telugu
Sep 03, 2024 05:30 PM IST

Munakkaya Fish Pulusu: చేపల పులుసు ఒకేలా చేయకుండా ఒక్కోసారి కొత్తగా ప్రయత్నించండి. ఇక్కడ మేము మునక్కాయ చేపల పులుసు రెసిపీ ఇచ్చాము. ఇది తిన్నారంటే మర్చిపోలేరు. దీన్ని వండడం చాలా సులువు.

మునక్కాయ చేపల పులుసు రెసిపీ
మునక్కాయ చేపల పులుసు రెసిపీ

Munakkaya Fish Pulusu: చేపల పులుసు అనగానే టమోటో గుజ్జు, చింతపండు రసంతో చేసేదే గుర్తుకొస్తుంది. కేవలం ఈ రెండింటిని కాదు, మునక్కాడను కూడా జత చేసి వండితే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి వండి చూడండి, ఎంత రుచిగా ఉంటుందో. మునక్కాయ చేపల పులుసును ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వండి పెడితే ఆ రుచికి వారు దాసోహం అయిపోతారు. ఇక్కడ మేము ప్రత్యేక పద్ధతిలో టేస్టీగా మునక్కాయ చేపల పులుసు ఎలా చేయాలో ఇచ్చాము. ఈ రెసిపీని ఫాలో అవ్వండి. కచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది.

మునక్కాయ చేపల పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు

చేప ముక్కలు - కిలో

ఉప్పు - రుచికి సరిపడా

కొబ్బరి తురుము - పావు కప్పు

వెల్లుల్లి తరుగు - రెండు స్పూన్లు

కారం - ఒక స్పూను

చింతపండు - నిమ్మకాయ సైజులో

పసుపు - అర స్పూను

నూనె - సరిపడినంత

మెంతులు - పావు స్పూను

ఉల్లిపాయ - ఒకటి

అల్లం తరుగు - ఒక స్పూను

పచ్చిమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

నీళ్లు - తగినన్ని

మునక్కాయలు - ఆరు ముక్కలు

మునక్కాయ చేపల పులుసు రెసిపీ

1. చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు వేసి అరగంట పాటు పక్కన పెట్టాలి.

2. ఈలోపు కొబ్బరి తురుము, వెల్లుల్లి, కారం, చింతపండు వేసి మెత్తగా రుబ్బి పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మెంతులు వేసి వేయించాలి.

4. ఆ మెంతుల్లోనే ఉల్లిపాయల తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు వేసి బాగా వేయించుకోవాలి.

5. ఉల్లిపాయల రంగు మారేవరకు ఉంచాలి.

6. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ను వేసుకోవాలి.

7. ఇది బాగా ఉడికాక తగినంత నీరు వేసి, ముందుగా కోసి పెట్టుకున్న మునక్కాయలను వేసి బాగా ఉడికించాలి.

8. రుచికి సరిపడా ఉప్పును కలుపుకోవాలి.

9. ఇది మరుగుతున్నప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి చిన్న మంట మీద పది నిమిషాల పాటు వేయించాలి.

10. అవసరమైతే కారం వేసుకోవచ్చు. కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.

11. అంతే టేస్టీగా మునక్కాయ చేపల పులుసు రెడీ అయినట్టే.

12. ఇది చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్ది మరింతగా తినాలనిపిస్తుంది.

మునక్కాయల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే చేపల్లో కూడా మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడే న్యూట్రిషన్స్ నిండి ఉంటాయి. ఈ రెండూ కలిపి వండడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మునక్కాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఆస్తమా, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు మునక్కాయను తరచుగా తింటే మంచిది. అలాగే శ్వాసకోశ సమస్యల బారిన పడకుండా కూడా మునక్కాయలోని సమ్మేళనాలు కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో చేపలు, మునక్కాయలు ఈ రెండూ ముందుంటాయి. కాబట్టి వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారైనా మునక్కాయ చేపల పులుసును వండుకొని చూడండి. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది.

Whats_app_banner