Mosquito Plants: దోమలు ఎక్కువైపోతున్నాయా? ఈ మొక్కల్ని ఇంట్లో పెంచండి, దోమలు పారిపోతాయి-mosquito plants are there more mosquitoes grow these plants at home and mosquitoes will run away ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mosquito Plants: దోమలు ఎక్కువైపోతున్నాయా? ఈ మొక్కల్ని ఇంట్లో పెంచండి, దోమలు పారిపోతాయి

Mosquito Plants: దోమలు ఎక్కువైపోతున్నాయా? ఈ మొక్కల్ని ఇంట్లో పెంచండి, దోమలు పారిపోతాయి

Haritha Chappa HT Telugu
Feb 14, 2024 07:00 PM IST

Mosquito Plants: దోమల బెడద పెరిగితే రోగాల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే సగం వ్యాధులను మోసుకొచ్చేది దోమలే. దోమలను తరిమే కొన్ని మొక్కలు ఉన్నాయి. వాటిని ఇంట్లోనే పెంచుకుంటే మంచిది.

దోమలను తరిమే మొక్కలు
దోమలను తరిమే మొక్కలు (pixabay)

Mosquito Plants: దోమల వల్ల ప్రాణాంతకమైన రోగాలు వ్యాప్తి చెందుతాయి. అందుకే దోమలు ఇంట్లో చేరకుండా చూసుకోమని చెబుతూ ఉంటారు వైద్యులు. ప్రపంచంలో సగం వ్యాధులు రావడానికి దోమలే కారణం. వైరల్ ఇన్ఫెక్షన్లు, ప్రమాదకరమైన రోగాలను ఇవి మోసుకుని తిరుగుతాయి. అందుకే ఇంట్లో దోమలు చేరకుండా కాపాడుకోవాలి. దోమల సంఖ్య ఇంట్లో చేరితే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో పాటు అనేక విష రోగాలు వచ్చే అవకాశం ఉంది. సహజంగానే వాటిని బయటికి పంపాలంటే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి.

ఇంటి చుట్టూ ఎక్కడా నీరు నిలవ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దోమల నివాసాలు ఆ నీళ్లే. ఆ నీళ్ల మీదే దోమలు గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి అలా నీళ్లు నిలవ లేకుండా చూసుకోండి. ఇక ఇంటి బాల్కనీలో, కిటికీల దగ్గర కొన్ని రకాల మొక్కలు పెంచడం ద్వారా దోమలను సహజంగానే తరిమేయొచ్చు.

వేప మొక్క

చిన్న వేప మొక్కను తెచ్చి కుండీలో వేసుకోండి. వేప మొక్క ఉన్నచోట దోమలు రావు. చిన్న కుండీలో పెంచడం వల్ల వేప మొక్క చెట్టుగా మారకుండా అలా చిన్నగానే పెరుగుతుంది. రెండు మూడు కుండీల్లో వేప మొక్కలను వేసి పెట్టుకుంటే దోమలను ఈజీగా తరిమేయొచ్చు.

తులసి మొక్క

తులసి మొక్కలను మూడు, నాలుగు కుండీల్లో వేసి పెంచుకోండి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి మొక్క నుంచి వచ్చే వాసన దోమలకు ఇష్టం ఉండదు. అవి ఆ వాసనకి చాలా దూరంగా వెళ్లిపోతాయి. అలాగే దోమ కరిచిన చోట తులసి రసాన్ని రాసుకుంటే ఎంతో మంచిది.

నిమ్మ మొక్కలు

నిమ్మ మొక్కలు దోమల్ని దూరంగా ఉంచుతాయి. వీటిని కూడా చిన్న కుండీల్లో వేసుకొని ద్వారం దగ్గర, కిటికీల దగ్గర పెట్టుకుంటే మంచిది. నిమ్మ ఆకుల్లో ఉండే ఆ వాసనకి దోమలు ఆ వైపుగా రావు. దోమలను తరిమికొట్టే మందుల్లో కూడా నిమ్మ ఆకులను వినియోగిస్తారు.

బంతి మొక్కలు

బంతి మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అలాగే దోమలను దూరంగా పెడతాయి. నాలుగైదు కుండీల్లో బంతి మొక్కలను వేసి ఇంటి చుట్టూ పెట్టుకోండి. ఆ వాసనకు దోమలు పారిపోతాయి. ఈ మొక్కలను బాల్కనీల్లో పెంచుకున్నా చాలు... గాలి ద్వారా ఆ వాసన ఇంట్లోకి చేరి దోమలను తరిమేస్తాయి. నీళ్లల్లో బంతి ఆకుల రసాన్ని కలిపి ఇంట్లో స్ప్రే చేయండి. అప్పుడు దోమలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాయి.

లావెండర్ మొక్కలు

లావెండర్ మొక్కలు నర్సరీలో ఎక్కువగానే దొరుకుతాయి. వీటిని చిన్న కుండీల్లో వేసుకొని ఇంటి దగ్గర పెంచుకుంటే దోమలను సులువుగా తరిమి కొట్టొచ్చు. లావెండర్ మొక్కల నుంచి వచ్చే వాసన దోమలకి యావగింపుగా ఉంటుంది. అది ఆ వాసనను ఏ మాత్రం ఇష్టపడవు.

రోజ్ మేరీ మొక్క

నర్సరీలో దొరికే మరో మొక్క రోజ్ మేరీ. ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి. ఇంట్లో పెంచుకోవడం చాలా సులువు. ఈ రోజ్ మేరీ మొక్కల నుంచి వచ్చే వాసన దోమలకు పడదు. కాబట్టి వీటిని కిటికీల దగ్గర వేలాడదీసినట్టు పెట్టుకుంటే ఆ కిటికీల గుండా దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ఈ రోజ్ మేరీ మొక్కలకు చిన్న పువ్వులు పూస్తాయి. ఆ పువ్వులను నీళ్ళల్లో వేసి నానబెట్టి, ఆ నీటిని ఇంట్లో స్ప్రే చేస్తూ ఉండండి ఇలా చేస్తే దోమల్ని తరిమికొట్టొచ్చు.

WhatsApp channel