Monday Motivation: ఓటమిని ముందే ఒప్పుకోకండి, విజయం సాధించే వరకు కష్టమైనా ప్రయాణాన్ని సాగించండి
Monday Motivation: కొంతమంది చిన్న కష్టమొస్తేనే జీవితాన్ని ముగించేసుకుంటారు. తానేమీ సాధించలేం అనుకుంటారు. ఎంతోమంది స్ఫూర్తి నింపే జీవితాలు ఉన్నాయి. వారి జీవితాలను తెలుసుకుంటే మీలో కూడా జీవించాలన్న కోరిక పుడుతుంది.
Monday Motivation: మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి జీవితాన్ని ఎంతో కష్టంగా బతికింది. ఆమె జీవితం ఎన్నో ఏళ్ల పాటు గందరగోళంగానే ఉంది. యుక్త వయసులోనే తల్లి చనిపోయింది. తండ్రి కూతురితో మంచి సంబంధాలను కొనసాగించలేదు. దీంతో తండ్రితో కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఆమెకు స్నేహితులంటే పుస్తకాలే. పుస్తకాలను చదువుతూనే పెరిగింది. కుటుంబ జీవితంలో కష్టాలు, ఆర్థిక సమస్యలు రావడంతో ఆమెకు డిప్రెషన్ బారిన పడింది. క్లినికల్ డిప్రెషన్ తో బాధపడుతూ ఆత్మహత్య ఆలోచనలు ఆమెకు ఎక్కువగా వచ్చేవి.
పాతికేళ్ల వయసులో చిన్న ఉద్యోగంలో చేరింది. అదే సంస్థలో చేస్తున్నా ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్ళికి ముందే తల్లి అయింది. ఆ తర్వాత ఆ వ్యక్తినే పెళ్లి చేసుకున్నా కూడా గృహహింస ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఆమెకు కూతురు పుట్టింది. భర్త పెట్టే బాధలు భరించలేక ఆమెకు డిప్రెషన్ మరింతగా పెరిగిపోయింది. చిన్న కూతురుతో కలిసి ఒంటరిగా వేరే దేశానికి వెళ్లిపోయింది. తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనలు ఆమెను కలిచి వేసాయి. జీవితంలో తాను ఓడిపోయానని భావించింది. ఆత్మహత్య చేసుకోవాలన్న కోరికలు వచ్చినా ఆ చిన్న పాప కోసం ఆలోచనలను అదిమి పెట్టేది. కనీసం బిడ్డకు అన్నం పెట్టలేని పరిస్థితికి చేరుకుంది. చిన్న బిడ్డ ఉండడం వల్ల మంచి ఉద్యోగం కూడా దొరకలేదు. దీంతో ప్రభుత్వ సహాయం కోసం చూసింది. తన బిడ్డకు, తనకు ఆశ్రయం కల్పించి ఆహారం పెట్టమని కోరింది.
దొరికిన చిన్న చిన్న ఉద్యోగాలే చేస్తూ మెల్లగా తన బిడ్డను బతికించుకుంది. 1990లో ఆమె మాంచెస్టర్ నుండి లండన్ కు రైలులో ప్రయాణం చేస్తోంది. ఆ సమయంలోనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. కథలు పుస్తకాలు రాసి సంపాదించాలనుకుంది. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్.టం కాబట్టి ఆమెకు ఒక అందమైన కథా స్పురణకు వచ్చింది. కొన్ని నెలలపాటు కథ రాసేందుకే ప్రయత్నించింది.
అలా కథలు రాయడం వెనక డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉందని ఆలోచన ఆమెకు వచ్చింది. ఎందుకంటే తాను తన బిడ్డను కాపాడుకోవాలి. పిల్లల పుస్తకాలు రాయడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉందని తెలిసి ఆమె ఆ ప్రయత్నం చేసింది. అలా 1995లో ఆమె ఒక పుస్తకాన్ని చేత్తోనే రాసింది. తర్వాత పాత మాన్యువల్ టైప్ రైటర్ లో టైప్ చేసింది. ఆ పుస్తకాన్ని పట్టుకొని 12 పబ్లిషింగ్ హౌసులకు తిరిగింది. ఒక్కరు కూడా ఆ పుస్తకాన్ని అచ్చు వేసేందుకు ముందుకు రాలేదు. అయినా కూడా ఆమె పట్టు విడవకుండా తిరిగింది. చివరికి ఒక ఎడిటర్ ఆమె పుస్తకాన్ని పబ్లిష్ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఆ పుస్తకం పబ్లిష్ అయ్యాక ఆమె పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె ఇంకెవరో కాదు జెకే. రౌలింగ్. పన్నెండు సార్లు పబ్లిష్ చేయడానికి రిజెక్ట్ అయిన పుస్తకం తొలి హ్యారీ పోటర్ సిరీస్ పుస్తకం.
ఆమె తన కష్టానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నా లేక గృహహింస భరిస్తూ భర్తతోనే జీవించినా ఇంత పెద్ద రచయిత్రి కాలేదేమో. కేవలం హ్యారీపోటర్‌ను తన కూతుర్ని బతికించుకోవడం కోసమే ఆమె రాసింది. కానీ ఇప్పుడు ఆమె ఒక పెద్ద రోల్ మోడల్ గా మారిపోయింది. బ్రిటన్ లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో హ్యారీ పాటర్ ఒకటి. కేవలం పుస్తకాలు రాయడం ద్వారా ధనిక మహిళగా మారిన వ్యక్తి జే కే రౌలింగ్. ఆమె బ్రిటన్లో 12వ ధనిక మహిళ ఆమె ఆస్తి కొన్ని వేల కోట్ల రూపాయలు.
విజయం సాధించిన ప్రతి వ్యక్తి వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. వారి జీవిత చరిత్రలు చదువుతూ ఉండండి. మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు మీకు చిన్నవిగా అనిపిస్తాయి. విజయం ఎవరికి పుట్టుకతో రాదు, వారు పెరిగే క్రమంలో వచ్చే కష్టాలే వారిని రాటు దేలేలా చేస్తాయి. ఏదో ఒక రోజు కష్టపడితే విజయం దక్కి తీరుతుంది.