Health insurance | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేస్తున్నారా? -mistakes to avoid while buying health insurance policy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేస్తున్నారా?

Health insurance | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేస్తున్నారా?

Praveen Kumar Lenkala HT Telugu
Feb 06, 2022 03:22 PM IST

Health insurance |హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకప్పటిలా ధనవంతులకే పరిమితం కాదు. కోవిడ్ మహమ్మారి ప్రతి ఒక్క కుటుంబం ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాల్సిన పరిస్థితిని సూచించింది. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అంత చవకైన పాలసీలేం కాదు. ఈ పాలసీ తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.

అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి
అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి (unsplash)

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో సాధారణంగా చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్లు ఇప్పుడు చర్చిద్దాం..

సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోకపోడం:

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకునే ముందు తగినంత పరిశీలన జరపకుండా కేవలం మిత్రులు, ఏజెంట్ల సలహా ఆధారంగా తీసుకుంటే మీకు సరైన పాలసీ దక్కకపోవచ్చు. అందువల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేముందు ఆయా పాలసీల నియమ నిబంధనలు, అందిస్తున్న సౌకర్యాలు, అవి మీ అవసరాలను ఎలా తీర్చగలవు వంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. 

వివాహితులు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు ఎంచుకోవడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. మీపై ఆధారపడి ఉన్న తల్లిదండ్రులను, అత్తామామలను కూడా ఈ పాలసీలో చేర్చగలిగే వీలుందా పరిశీలించండి. ఒకవేళ వీరికి వేర్వేరుగా తీసుకోవాలనుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఉమ్మడిగా తీసుకోవడం వల్ల ఎక్కువ బీమా సొమ్ము లభిస్తుంది. టాక్స్ మినహాయింపులు కూడా లభిస్తాయి.

హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత మొత్తానికి తీసుకుంటున్నారు?

గతంలో రూ. లక్ష, రూ. 2 లక్షలకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సరిపోతుందనుకునేవాళ్లం. ఇప్పుడు ఆసుపత్రుల్లో బిల్లులు వింటేనే హార్ట్ ఎటాక్ వచ్చే పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా వేతన జీవులు ఆయా యాజమాన్యాలు హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేసినప్పుడు అందరికీ ఒకే మొత్తంలో పాలసీ ఆఫర్ చేస్తాయి. కొన్ని యాజమాన్యాలు అవే ప్రీమియం చెల్లిస్తుంటాయి. మరికొన్ని యాజమాన్యాలు కొంత భాగానికే ప్రీమియం చెల్లిస్తుంటాయి. 

ఇలాంటి సందర్భాల్లో మీ కుటుంబ అవసరాలకు తగిన రీతలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఎంచుకోవాలి. మీ ఉద్యోగ యాజమాన్యం కల్పించనప్పుడు బయట ప్రయివేటుగా తీసుకోవాలి. ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు ఇది ఉపయోగపడవచ్చు. పాలసీ తీసుకునేముందు మీ మీ ఆరోగ్య చరిత్రను కూడా ఒకసారి బేరీజే వేసుకోవడం మంచిది. మీ యాజమాన్యం సమకూర్చే పాలసీ మీ ఉద్యోగం పోయినప్పుడు ముగిసిపోతుంది. అందువల్ల ఎల్లవేళలా ఒక ప్రయివేటు పాలసీ ఉండేలా చూసుకోవడం మంచిది.

అన్ని అనారోగ్యాలకు వర్తిస్తుందా?

మీరు తీసుకునే పాలసీ ఒకవేళ అన్ని అనారోగ్యాలకు వర్తించనిపక్షంలో ఉండీ ఉపయోగం లేకుండా పోతుంది. అందువల్ల మీరు ఎదుర్కొనే అనారోగ్యానికి కవర్ కానిపక్షంలో అది చేర్చుకుని దానికి తగిన ప్రీమియం చెల్లించడం మేలు. వీటినే యాడ్ ఆన్ అని పిలుస్తారు. పాలసీ కొనుగోలు సమయంలో నిబంధనలు అన్నీ చదివితేనే ఇది అవగతమవుతుంది. వేటికి మినహాయింపులు ఉంటాయి? వేటికి షరతులతో కూడిన మినహాయింపులు ఉంటాయి.. వంటి అన్ని అంశాలను క్షుణ్నంగా చదివి మాత్రమే పాలసీ ఎంచుకోవాలి. లేదంటే మీ జేబుకు చిల్లుపడుతుంది.

మెడికల్ హిస్టరీ దాచిపెడుతున్నారా?

ప్రీమియం ఎక్కువ పడుతుందని, లేదా పాలసీ ఇస్తారో లేదోనని తమకు ఉన్న వ్యాధులను, గత చరిత్రను దాచిపెడుతుంటారు. అలాగే కొందరు డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లను కూడా దాచిపెడుతుంటారు. ఇలా దాచిపెట్టడం వల్ల భవిష్యత్తులో మీ పాలసీ ద్వారా మీరు చేసే క్లెయిం రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ అనారోగ్య చరిత్ర తెలియడం వల్ల మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించినప్పటికీ.. అది భవిష్యత్తులో మీ చికిత్సకు అయ్యే వ్యయం కంటే చాలా తక్కువే అవుతుంది. అందువల్ల మెడికల్ హిస్టరీ దాచిపెట్టొద్దు.

మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకోకపోవడం..

హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ఇప్పుడు పోటీ వాతావరణం పెరిగింది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అనేక సంస్థలు కొత్తకొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. వేర్వేరు వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. అందువల్ల వేర్వేరు కంపెనీల పాలసీలను సరిపోల్చుకుంటూ అవి ఇచ్చే వెసులుబాట్లు, మీ అవసరాల ఆధారంగా పాలసీలు ఎంచుకోవాలి.

WhatsApp channel

సంబంధిత కథనం