Mamidi Kobbari Laddu : మామిడి కొబ్బరి లడ్డూ ఇలా చేయండి.. భలే ఉంటుంది టేస్ట్-mamidi kobbari laddu how to prepare mango coconut laddu in 20 minutes nutritional laddu preparation ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mamidi Kobbari Laddu : మామిడి కొబ్బరి లడ్డూ ఇలా చేయండి.. భలే ఉంటుంది టేస్ట్

Mamidi Kobbari Laddu : మామిడి కొబ్బరి లడ్డూ ఇలా చేయండి.. భలే ఉంటుంది టేస్ట్

Anand Sai HT Telugu
Jun 11, 2024 03:30 PM IST

Mamidi Kobbari Laddu In Telugu : మామిడి కొబ్బరి లడ్డూ ఒక్కసారైనా ట్రై చేయండి. ఇది రుచిలో సూపర్‌గా ఉంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఈ లడ్డూ చేసేందుకు సమయం కూడా ఎక్కువగా అవసరం లేదు.

మామిడి కొబ్బరి లడ్డూ
మామిడి కొబ్బరి లడ్డూ

సాయంత్రంపూట ఇంట్లో ఏదైనా స్నాక్స్‌లాగా తినాలి అనిపిస్తుంది కదా. పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా ఈ అలవాటు ఉంటుంది. అలాంటివారు ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేయండి. అందులో భాగంగా జ్యూసి.. జ్యూసిగా ఉంటే కొబ్బరి లడ్డూను ప్రయత్నించండి.

పిల్లలు ఆకలితో ఉంటే తల్లి వైపు చూస్తారు. ఎందుకంటే అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది.. ఏదైనా చేసి పెడుతుందని ఆశగా చూస్తారు. అమ్మ చేతితో చేసే చిరుతిండికి వంక పెట్టకుండా ఉంటాం. ఆమె ఏం చేసినా అద్భుతంగానే ఉంటుంది. అయితే ఈసారి మీ పిల్లల కోసం కొత్తగా మామిడి కొబ్బరి లడ్డూను తయారు చేసి పెట్టండి. మామిడి పండ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని తీసుకొచ్చి 20 నిమిషాలు కష్టపడితే చాలు లడ్డూలు తయారవుతాయి.

వేసవి అంటే వేడి వాతావరణం మాత్రమే కాదు. రుచికరమైన, జ్యూసి పండ్ల సీజన్ కూడా. ముఖ్యంగా పండ్లలో రారాజు అయిన మామిడి తరచుగా దొరుకుతుంది. ఈ జ్యూసి మామిడి నుండి ఊరగాయలు, రసం, మిల్క్ షేక్, ఐస్ క్రీంలాంటివి తయారు చేస్తుంటాం. ఈ రుచికరమైన పండు నుండి తీపి లడ్డులను కూడా తయారు చేయవచ్చు.

ఈ మామిడి కొబ్బరి లడ్డూ పదార్థాలను సిద్ధం చేయడానికి 15 నిమిషాలు చాలు. లడ్డూ చేయడం 20 నిమిషాల్లో అయిపోతుంది. ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన మ్యాంగో లడ్డూను ఎలా చేయాలో తెలుసుకుందాం..

మామిడి కొబ్బరి లడ్డూకు కావాల్సిన పదార్థాలు

మామిడికాయ గుజ్జు- 1/2 కప్పు, మిల్క్ - 1/2 కప్పు, ఎండు కొబ్బరి తురుము - 1 కప్పు, యాలకుల పొడి - 1/4 టీస్పూన్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం) , పిస్తా) - 1/2 కప్పు

తయారీ విధానం

ముందుగా ఒక మందపాటి అడుగు పాత్రను తీసుకుని తురిమిని ఎండు కొబ్బరిని వేయించండి. సువాసన వచ్చేవరకు వేయించాలి. బాగా బ్రౌన్ అయ్యే వరకు వేయించవద్దు.

తర్వాత మామిడికాయ గుజ్జును ఇందులో వేసి కలపాలి.

ఇప్పుడు పాలు, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

ఇలా చేస్తే చిక్కటి పిండిలా తయారవుతుంది. తర్వాత స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి.

తగినంత వేడిగా ఉన్నప్పుడు చిన్న బాల్స్ చేయండి. అయితే మీరు కావాలి అనుకుంటే చేతికి నెయ్యి కూడా రాసుకోవచ్చు. నెయ్యితో టేస్ట్ మరింత పెరుగుతుంది. లడ్డూలు చేసుకున్న తర్వాత పైన కొంచెం తురిమిన కొబ్బరిని చల్లండి.

ఈ రెసిపీని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఇది రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మామిడి, కొబ్బరి, డ్రైఫ్రూట్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఈ లడ్డూలు చేసేందుకు సమయం ఎక్కువగా తీసుకోదు.

Whats_app_banner

టాపిక్