Drinking Water | ఏ పాత్రలో నీరు త్రాగితే మంచిది? ఇది తప్పక తెలుసుకోవాలి!-know which vessel is the best for drinking water ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know Which Vessel Is The Best For Drinking Water

Drinking Water | ఏ పాత్రలో నీరు త్రాగితే మంచిది? ఇది తప్పక తెలుసుకోవాలి!

HT Telugu Desk HT Telugu
Jun 28, 2022 07:33 PM IST

మీరు నీటిని ఏ పాత్రలో తాగుతారు? ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి రాగిపాత్రల వరకు ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఏ పాత్రలో నీరు తాగితే మంచిదో ఇక్కడ తెలుసుకోండి.

Drinking Water
Drinking Water (Pixabay)

మనకు తినడానికి తిండి ఎలాగో తాగటానికి నీరు కూడా అవసరమే. మన శరీరంలో జరిగే ప్రతి జీవక్రియకు నీరు అవసరం. సరిపడా నీరు తాగకపోతే దాని ప్రభావం మొదట కిడ్నీలపై పడుతుంది. ఆ తర్వాత మిగతా అన్ని అవయవాలు చెడిపోతాయి. మనిషి నీరు లేకుండా 3 రోజులకు మించి బ్రతకలేడు అని సైన్స్ చెబుతుంది. అయితే మనం తాగే నీరు కూడా శుద్ధమైనది అయి ఉండాలి. కలుషిత నీరు తాగితే అది కూడా అస్వస్తతకు దారితీస్తుంది. అలాగే సరైన పాత్రలో నీరు తాగటం కూడా మన ఆరోగ్యంతో ముడిపడి ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని పాత్రల్లో నీరు తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది. మరికొన్ని పాత్రల్లో తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. మరి ఎలాంటి పాత్రలో నీరు తాగితే మంచిదో ఇక్కడ తెలుసుకోండి.

1) గాజుపాత్ర

గాజుగ్లాసులో నీరు తాగితే అది మంచి ఛాయిసే అవుతుంది. ఎందుకంటే గాజు ఒక జడ పదార్థం. నీటిని గాజు సీసాలో నిల్వ చేసినప్పుడు, అది నీటి నాణ్యతను ఏ విధంగానూ ప్రభావితం చేయదు. అలాగే గాజుపాత్ర పారదర్శకంగా ఉంటుంది కాబట్టి నీరు ఎంత శుద్ధంగా ఉందో తెలిసిపోతుంది. అయితే కాడ్మియం, లెడ్ వంటి సమ్మేళనాలు లేని గాజుపాత్రను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

2) రాగి పాత్ర

పురాతన కాలం నుంచే మనకు రాగిపాత్రలు వినియోగంలో ఉన్నాయి. రాగిపాత్రలో భోజనం చేసినా, నీరు తాగినా అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు వివిధ రకాల వాటర్ ప్యూరీఫైయర్లు కూడా తమ నీటిలో రాగి ఉంటుందని ప్రచారం చేసుకుంటున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. రాగి మూలకాలు కలిగిన నీరు తాగితే జీర్ణక్రియ బాగుంటుంది, హైపర్ టెన్షన్, థైరాయిడ్, రక్తహీనత, కీళ్లనొప్పులను నివారించవచ్చు. క్యాన్సర్‌తో పోరాడటానికి, హృదయనాళ వ్యవస్థను మెరుగుపరచటానికి కాపర్ వాటర్ ఉపయోగపడుతుంది. అయితే మోతాదు మించకూడదు.

3) స్టెయిన్లెస్ స్టీల్

సాధారణంగా అందరి ఇళ్లలో స్టెయిన్‌లెస్ స్టీల్‌ గ్లాసులు వాడతారు. ఈ గ్లాసులు దీర్ఘకాలం మన్నుతాయి. నీటి స్వచ్ఛతను ప్రభావితం చేయవు కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ గ్లాసుల్లో నీరు త్రాగటం వలన ఆరోగ్యానికి వచ్చే నష్టం ఏం లేదు.

4) మట్టి కుండ

మట్టికుండలో, మట్టితో చేసిన పాత్రల్లో నీరు తాగటం ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉండవు. నీటిని శుద్ధి చేస్తుంది. ఈ నీరు తాగడం వల్ల మీ జీవక్రియ మెరుగుపడుతుంది. అసిడిటీ, ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. వేసవిలో అయితే ఇవి సహజమైన రీప్రిజరేటర్ల లాగా నీటిని చల్లగా ఉంచుతాయి.

5) ప్లాస్టిక్ బాటిళ్లు

ప్లాస్టిక్ బాటిళ్లు నీటిని సరఫరా చేయటానికి తక్కువ ఖర్చుతో కూడిన ఒక ఆప్షన్. ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వచేసి వచ్చిన నీరు ఒకసారి మాత్రమే వినియోగించటానికి తగినది. దీర్ఘకాలం పాటు ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగితే అది ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో చాలా రకాల రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాలు నీటిలో కలుస్తాయి. కాబట్టి దీనికి దూరంగా ఉంటేనే మంచిది.

చివరగా.. మీరు ఆరోగ్యంపై స్పృహ కలిగిన వారైతే రాగి, మట్టి, గాజు పాత్రల్లో నీరు తాగటం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్