Home Tips: పాత చీపురును పడేస్తున్నారా? ఇంటి కోసం ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు
Old Broom Uses: చీపుర్లను తరచూ మార్చాల్సి వస్తుంది. అయితే పాత చీపుర్లను పడేయకుండా ఇంటి కోసం కొన్ని రకాలుగా వాడుకోవచ్చు. పాత చీపుర్లను ఎలా వినియోగించుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
దుమ్మును ఊడ్చేందుకు దాదాపు అన్ని ఇళ్లలో చీపుర్లను వాడుతుంటారు. చీపురు లేకుండా ఇంటి ఫ్లోరింగ్‍ను శుభ్రంగా ఉంచుకోలేం. అయితే, ఇటీవలి కాలంలో సుమారు నెలరోజుల్లోనే చీపుర్లు పాతవైపోతున్నాయి. సరిగా ఊడ్చేందుకు వీలుకాకుండా పోతున్నాయి. దీంతో కొత్త చీపుర్లను కొనేస్తుంటారు. అప్పుడు పాత చీపుర్లను చాలా మంది పారవేస్తారు. అయితే, పాత చీపురును కూడా ఇంట్లో వివిధ పనులకు వాడుకోవచ్చు. వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. పాత చీపురును ఎన్ని విధాలుగా వాడొచ్చంటే..
ఫ్యాన్లు, సీలింగ్ క్లీన్ చేసుకునేందుకు..
చీపురును కొంతకాలం వాడాక సన్నగా మారిపోతుంది. సరిగా ఊడ్చేందుకు రాదు. ఇలా సన్నగా మారిన చీపురుతో ఫ్యాన్లు, పైకప్పు (సీలింగ్)ను క్లీన్ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. పాత చీపురుకు ఓ కర్రను కట్టి క్లీనింగ్ టూల్‍లా చేసుకోవచ్చు. దీంతో ఫ్యాన్లు, సీలింగ్‍కు పట్టిన దుమ్మును కర్ర కట్టిన పాత చీపురుతో దులిపేయవచ్చు. సపరేట్‍గా మరో వస్తువు కొనాల్సిన అవసరం ఉండదు.
కొన్ని పాతవి కలిపి ఒక్కటిగా..
వాడిన తర్వాత సన్నగా అయినపోయిన కొన్ని చీపుర్లను కలిపి ఓ చీపురుగా చేయవచ్చు. చీపురు సన్నగా అయిపోతే క్లీన్ చేసేందుకు అనుకూలంగా ఉండదు. అయితే, సన్నగా అయిన కొన్ని పాత చీపుర్లను కలిపి ఓ చీపురుగా తయారు చేయవచ్చు. ఇలా కొన్నిపాత వాటితో చేసిన చీపురు లావుగా, బలంగా ఉంటుంది. దాన్ని ఇల్లు శుభ్రం చేసేందుకు వాడుకోవచ్చు.
మొక్కలకు రక్షణగా..
పాత చీపుర్లను మీ గార్డెన్‍లో మొక్కల కోసం కూడా వాడుకోవచ్చు. గార్డెన్‍లోకి చిన్న పశువులు వచ్చే రిస్క్ ఎప్పుడైనా ఉంటుంది. అలాంటి సమయంలో మొక్కలను అవి పాడు చేసే అవకాశం ఉంటుంది. అయితే, పాత చీపురుకు ఉండే బ్రిస్టిల్స్ (పుల్లలు) విడదీసి చిన్న మొక్కలకు చుట్టూ పాతి రక్షణగా పెట్టవచ్చు. ఇలా చేస్తే పశువులు గార్డెన్‍లోకి వచ్చినా వాటికి చిన్న మొక్కలు కనిపించవు. తినేందుకు ప్రయత్నించవు.
డెకరేషన్‍గానూ..
ఒకవేళ మీకు ఆర్ట్‌పై ఆసక్తి ఉంటే.. క్రియేటివ్‍గా చేయాలనుకుంటే పాత చీపుర్లను కూడా ఆకర్షణీయంగా చేసేయవచ్చు. చీపురు పుల్లలను డెకరేషన్ వస్తువుల కోసం వినియోగించుకోవచ్చు. పాత చీపురుకు విభిన్నమైన కలర్స్ వేసి కొత్త లుక్ తీసుకురావొచ్చు. దాన్ని అట్రాక్టివ్‍గా మార్చొచ్చు.
ఈ పనులకు కూడా..
ఇవే కాకుండా కొన్ని చిన్నచిన్న పనులకు కూడా పాత చీపుర్లను వాడుకోవచ్చు. ఇళ్లు శుభ్రం చేస్తున్నప్పుడు కిటీకీల సందుల్లో, తలపుల మధ్య ఉండే దుమ్మును క్లీన్ చేసేందుకు కాస్త కష్టంగా ఉంది. సన్నగా ఉండటంతో పాత చీపురుతో కిటికీ సందుల్లోని దుమ్మును సులువుగా దులేపేయవచ్చు. సింక్ రంధ్రాలను క్లియర్ చేసేందుకు కూడా పాత చీపురు పుల్లలు ఉపయోగపడతాయి.
టాపిక్