జననాంగాల చుట్టూ దురద పెట్టడం అపరిశుభ్రతకు సూచన. జననేంద్రియాల దగ్గరుండే వెంట్రుకల్లో దురద అనేక కారణాలను సూచిస్తుంది. కాంటాక్ట్ డెర్మటైటిస్ నుంచి రేజర్ వల్ల వచ్చిన గాయం దాకా దీనికి అనేక కారణాలే ఉండొచ్చు. దానివల్ల అక్కడ దురద పెడుతుంది. మీకు తెలీకుండానే మీ చేయి అక్కడికి వెళ్లిపోతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని సహజ మార్గాలున్నాయి. అవేంటో తెల్సుకోండి. దీనికి కారణాలేమై ఉంటాయో కూడా చూడండి.
దురదతో పాటే చర్మం ఎరుపెక్కడం, చిన్న గీతలు కనిపిస్తుంటే బ్లేడ్ వాడకం వల్ల ఈ సమస్య వచ్చి ఉండొచ్చు. ఈ మధ్యే గనక రేజర్ వాడి ఉంటే అదే ఒక కారణం కావచ్చు.
కొత్తగా ఏదైనా ఉత్పత్తి వాడటం మొదలు పెట్టినా కూడా దురద రావచ్చు. కొత్తగా సబ్బులు, లోషన్లు ఇంకేవైనా శుభ్రత కోసం ఉత్పత్తులు వాడితే వాటివల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ రావచ్చు. లేదా చర్మం మీద ర్యాషెస్ రావచ్చు.
గాలి తగలని, తేమ భాగాల్లో యీస్ట్ అభివృద్ధి చెందుతుంది. చర్మం మడతల్లో, యోని దగ్గర ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. బిగుతుగా ఉన్న ఇన్నర్స్, అపరిశుభ్రత, స్నానం తర్వాత ఆరనివ్వకుండానే బట్టలు వేసుకోవడం లాంటి వాటి వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు.
ఎరుపు రంగు ర్యాషెస్ రావడం, దద్దుర్లు రావడం, గోకినప్పుడు ఏవైనా ద్రావం లాంటివి విడుదలవ్వడం దీని సంకేతాలు. ఇది సాధారణంగా మోచేతులు, మోకాళ్లలో కనిపిస్తుంది. కానీ జననాంగాల దగ్గర కూడా ఈ సమస్య రావచ్చు.
కలబందకు చర్మాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది దురద, ర్యాషెస్ తగ్గిస్తుంది. చర్మానికి తేమ అందిస్తుంది. దీంట్లో అమైనో యాసిడ్లు కూడా ఎక్కువే ఉంటాయి. కాబట్టి దురద ఉన్న ప్రాంతంలో కలబందను నేరుగా రాసుకోవచ్చు. పావుగంట ఆగి కడిగేసుకుంటే సరిపోతుంది.
కొబ్బరి నూనెలో ఎన్నో మెడిసినల్ లక్షణాలున్నాయి. చర్మాన్ని తేమగా ఉంచుతుందిది. అలాగే దీంట్లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలున్నాయి. ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. చర్మం దురద పెట్టకుండా, ఎలాంటి ర్యాషెస్ రాకుండా చూస్తుంది. దురద పెడుతున్న చోట స్వచ్ఛమైన కొబ్బరి నూనెను రాసుకోవాలి. పావుగంట నుంచి ఇరవై నిమిషాలుంచి కడిగేసుకుంటే సరిపోతుంది.
జననాంగాల్లో వచ్చే దురద గ్రీక్ యోగర్ట్ తగ్గిస్తుంది. ఇది యీస్ట్ ఇన్ఫెక్షన్లకు మంచి చిట్కా. యోగర్ట్, తేనె మిశ్రమాన్ని దురద పెడుతున్న ప్రాంతంలో రాసుకుంటే ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గిపోతుంది.
చర్మం దురద, యీస్ట్ ఇన్ఫెక్షన్లను బేకింగ్ సోడా తగ్గిస్తుంది. దీనికి యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. పావు కప్పు బేకింగ్ సోడాను మీరు స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేయొచ్చు లేదంటే పేస్ట్ లాగా చేసి సమస్య ఉన్న చోట రాసుకోవచ్చు.
దురద ఆపుకోలేనంతగా పెడుతుంటే తడి కాపడం పెట్టుకోవచ్చు. ఐస్ ప్యాక్ ఏదైనా వస్త్రంలో చుట్టి కాసేపు పెట్టుకుంటే ఫలితం ఉంటుంది.
ఇవన్నీ దురద తక్కువగా ఉన్నప్పుడు తగ్గించే చిట్కాలు. వీటితో దురద అదుపులోకి రాకపోతే, సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.