Cooling plants: ఉక్కపోత తగ్గించి గదిని చల్లబరిచే మొక్కలు.. ఇంట్లో పెంచుకుంటే కూల్ కూల్
Cooling plants: వర్షాకాలంలో ఇంట్లో తేమ పెరిగి ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ వాతావరణం తగ్గించుకోవాలంటే ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలి. ఇవి గదిని చల్లబరుస్తాయి. అవేంటో చూడండి.
మండే ఎండల్లో చెమటల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. వర్షాలతో కాస్త ఉపశమనం దొరకుతుంది అనుకుంటే.. గాల్లో ఉండే విపరీతమైన తేమ వల్ల ఉక్కపోతగా ఉంటోంది. తేమ వాతావరణాన్ని భరించడం చాలా చికాకుగా ఉంటుంది. తేమ ఉన్నప్పుడు కూలర్లు పెట్టినా ఏ ఫలితం ఉండదు. కూలర్ల వల్ల తేమ మరింత ఎక్కువవుతుంది.
అలాంటప్పుడు గాల్లో తేమ తగ్గించి గదిని సహజంగా చల్లబరిచే మొక్కలు కొన్ని ఇంటి లోపల పెట్టుకుంటే సరిపోతుంది. వీటివల్ల గదిని అలంకరించినట్లూ ఉంటుంది. అన్ని రకాల మొక్కలు ఇంటిని చల్లబరుస్తాయి కానీ కొన్ని మొక్కల వల్ల ఇంట్లో తేమ శాతం మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ వాతావరణానికి నప్పే మొక్కల్ని సరిగ్గా ఎంచుకోవాలి. అవేంటో తెల్సుకోండి.
స్నేక్ ప్లాంట్:
ఎక్కువగా నిర్వహణ అవసరం లేని స్నేక్ ప్లాంట్ ఇంట్లో సులభంగా పెరుగుతుంది. గాలిని తాజాగా ఉంచుతుంది. ఆక్సీజన్ శాతాన్ని పెంచుతుంది. చుట్టూ ఉన్న వాతావరణం చల్లబరుస్తుంది. ఈ మొక్క రాత్రి కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. కాబట్టి రోజంతా గదిని తాజాగా ఉంచేలా చూస్తుందీ మొక్క.
కలబంద:
చాలా మంది ఇళ్లలో ఉండే మొక్క కలబంద. అయితే దీన్ని ఇంటి లోపల పెంచుకుంటే గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. గాలిని శుద్ది చేస్తుంది. ఆక్సిజన్ స్థాయుల్ని పెంచుతుంది. దాంతో గది చల్లగా ఉంటుంది. దీనికి నిర్వహణ కూడా పెద్దగా అవసరం లేదు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ మొక్కను ఆరుబయట కాకుండా ఇంట్లోకి తెచ్చి పెట్టేసుకోండి.
చైనీస్ ఎవర్ గ్రీన్:
వెడల్పాటి ఆకులతో ఆకర్షణీయంగా ఉండే ఇన్‌డూర్ మొక్క ఇది. తక్కువ వెలుతురు, తక్కువ నీటిలో కూడా బాగా పెరుగుతుంది. ఈ మొక్కకున్న అందం కారణంగా చాలా మంది ఆర్టిఫిషియల్ చైనీస్ ఎవర్ గ్రీన్ మొక్కల్ని అలంకరణ కోసం పెట్టుకుంటారు. ఇది గాలిని శుద్ది చేస్తుంది. అలాగే ఇంటిని చల్లగానూ ఉంచుతుంది. మార్కెట్లో చాలా రకాల చైనీస్ ఎవర్ గ్రీన్ మొక్కలు అందుబాటులో ఉంటాయి. రకరకాల రంగుల్లో దొరుకుతాయివి. కానీ ఇంటిని చల్లబర్చడం కోసం అయితే ఆకుపచ్చ ఆకులున్న వాటిని ఎంచుకోవాలి.
పీస్ లిల్లీ:
తెల్లటి పువ్వులతో ఉన్న ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. వేడి నుండి ఉపశమనం పొందడంలో కూడా అంతే బాగా పనిచేస్తుంది. ఈ మొక్కని చూస్తే కచ్చితంగా దీనికి చాలా మెయింటెనెన్స్ అవసరమని అనిపిస్తుంది, కానీ ఏ అవసరం లేదు. ఇది తక్కువ వెలుతురులో పెరుగుతుంది. కాబట్టి మీరు దీనిని ఇంట్లో ఏ మూలనైనా పెట్టేయొచ్చు. ఇది ఇంట్లో ఉండే గాలిలోని టాక్సిన్స్ ను తొలగించడంతో పాటు గదిని తాజాగా ఉంచడంలో సాయపడుతుంది.