Hydroponic Garden: నీటితో తోట! హైడ్రోపోనిక్స్‌తో మొక్కలను సులభంగా పెంచొచ్చిలా..
Hydroponic Garden: మేడమీద, బాల్కనీల్లో మట్టి అవసరం లేకుండా హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కలు, ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఈ పద్ధతి గురించి, ఖర్చు గురించి వివరంగా తెలుసుకోండి.
‘మేం సిటీలో ఉంటాం. ఇంటి చుట్టూ ఎక్కడా మట్టే లేదు. కొన్ని మొక్కలు పెంచుకుందాం అంటే స్థలమే లేదు. బయట పురుగుల మందులు కొట్టిన ఆకు కూరలు, కూరగాయలు తినాలంటే భయమేస్తోంది.’ ఇలాంటి ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ దాటుకుని అసలు మట్టే లేకుండా హైడ్రోపోనిక్స్‌తో ఎలా ఆకుకూరలు, కూరగాయల్ని పెంచుకోవచ్చో ఇక్కడ చూసేద్దాం. అసలు హైడ్రోపోనిక్స్ సిస్టంని ఇంటి దగ్గర ఎలా పెట్టుకోవచ్చు? అన్నదగ్గర నుంచి దాన్ని ఎలా మెయింటెన్ చేయాలనే దాని వరకూ అన్నీ తెలుసుకుందాం.
హైడ్రోపోనిక్స్ ఎలా పని చేస్తుంది?
ఇందులో మట్టి అవసరం సున్నా. ఎండ తగిలే చోటు కొంచెమున్నా చాలు. అవసరం అయితే నిటారుగా గార్డెన్‌ని పెంచుకోవచ్చు. కాస్త చోటున్న వారు వెడల్పుగా ఉండే సిస్టంని ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకు నీటి గొట్టాలు అవసరం. వాటిలో ఎప్పుడూ నీరు పారేలా చూసుకోవాలి. అందుకు చిన్న హైడ్రోపోనిక్స్ సిస్టం పరికరాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. గొట్టాలకు చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. అందులో చిన్నచిన్న కుండీను అమరుస్తారు. మొక్క వేళ్లను నేరుగా అందులో పెడతారు. లేకపోతే గ్రోయింగ్ మీడియంగా రాళ్లు, పెర్లైట్, కోకోపీట్లను వాడతారు. అలా మొక్క వేళ్లకు ఎప్పుడూ నీరు తగులుతూ పారేలా ఈ సిస్టం ఉంటుంది. ఇందులో మొక్క ఎదుగుదలకు అవసరమైన పోషకాలు, సూక్ష్మ పోషకాలను నేరుగా పారే నీటిలో కలుపుతారు. అందువల్ల మొక్కలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి.
వేటికి ఇవి బాగా పనికి వస్తుంది?
మైక్రో గ్రీన్స్, ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలకు హైడ్రోపోనికి్స్ సిస్టం బాగా పని చేస్తుంది. ఆరోగ్యకరంగా ఉండే, పురుగు మందులు లేని ఆకు కూరలు తినాలనుకున్న వారికి మాత్రం ఇది మంచి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. ఆలూ, క్యారెట్, బీట్ రూట్ లాంటి దుంప జాతి మొక్కలకు ఇది పనికి రాదు. ఎందుకంటే అవి ఎదగాలంటే కచ్చితంగా నేల కావాలి. అలాగే మామిడి, అరటి, సపోటా లాంటి పెద్ద పెద్ద చెట్లనూ మనం వీటిలో పెంచలేం. ఆకుకూరలు, చిన్న చిన్న కూరగాయల మొక్కలకు మాత్రమే ఇది బాగా నప్పుతుంది.
ఎంత ఖర్చవుతుంది ?
దీన్ని చిన్నగా మొదలు పెట్టాలంటే రెండు నుంచి మూడు వేల వరకు ఖర్చవుతుంది. వీటికి సంబంధించిన ట్రేలు, ఎయిర్ పంప్‌లు, నీటి రిజర్వాయర్, ఎక్విప్‌మెంట్ అంతా ఆన్‌లైన్ సైట్లలో అందుబాటులో ఉంది. మొక్క ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించే లిక్విడ్ సీసాలూ వీటిలోనే కొనుక్కోవచ్చు. ఎలా పెంచాలనే దానిపై స్పష్టమైన అవగాహన కోసం చాలా సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. వాటిని బాగా స్డడీ చేసి వెంటనే దీన్ని ప్రారంభించేయవచ్చు.
టాపిక్