Mosquito Repellent Plants: ఈ మొక్కలకు దోమలు పారిపోతాయ్‌ !-mosquito repellent plants that should be grown at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mosquito Repellent Plants: ఈ మొక్కలకు దోమలు పారిపోతాయ్‌ !

Mosquito Repellent Plants: ఈ మొక్కలకు దోమలు పారిపోతాయ్‌ !

HT Telugu Desk HT Telugu

Mosquito Repellent Plants: ఇంట్లో దోమల బెడద తగ్గించుకోడానికి చాలా ప్రయత్నిస్తాం. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉంటే అసలు దోమలు ఇంట్లోకి రావట. అవేంటో చూసేయండి.

దోమల్ని తరిమేసే మొక్కలు (pexels)

అసలే వర్షాకాలం. ఎక్కడ చూసినా దోమలు, పురుగుల బెడద ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే కాలంతో సంబంధం లేకుండా దోమలు మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి మనం బోలెడు పద్ధతుల్ని పాటిస్తుంటాం. మస్కిటో కాయిల్స్‌, లిక్విడ్లు, అగరబత్తులు ఇలా ఒకటేమిటి.. ఏది వీలైతే అది వాడేస్తుంటాం. అయినా దోమల నుంచి పూర్తిగా మనల్ని మనం రక్షించుకోలేం. అంతే కాకుండా దీర్ఘకాలం పాటు ఈ మస్కిటో రిపల్లెంట్‌ లిక్విడ్లు వాడటం వల్ల వచ్చే దుష్రభావాలు చాలా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటి వల్ల పిల్లలు, పెద్దల్లో శ్వాసకోస సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతాయని తేలింది. మరి ఇలాంటి రసాయనాలకు దూరంగా ఉండి సహజంగా వీటి బెడద నుంచి బయట పడాలనుకుంటున్నారా? కొన్ని మొక్కల్ని మన ఇంటి పరిసరాల్లో పెంచుకోవడం వల్ల అవి సహజంగానే అటు వైపుగా రావు. ఎందుకంటే ఈ మొక్కలన్నీ దోమల్ని దూరం చేసే బెస్ట్‌ మస్కిటో రిపల్లెంట్‌లు. అవేంటో చూసేయండి.

బంతి మొక్క:

భారత దేశంలో బంతి మొక్కలను అంతా సీజనల్‌గా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఆఫ్రికన్‌ బంతితో పాటు, ముదురు ఎరుపు రంగులో ఉండే కృష్ణ బంతి మొక్కల్ని కిటికీలు, గుమ్మాల దగ్గరలో వేసుకోవాలి. వీటికి ఉండే వాసన వల్ల సహజంగానే పురుగులు, దోమలు పారిపోతాయి. అటు వైపుగా రావు.

నిమ్మ గడ్డి:

ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్ల దగ్గర లెమన్‌ గ్రాస్‌ని బాగా పెంచుకుంటున్నారు. ఇది ఉష్ణ మండల ప్రాంతాల్లోనే ఎక్కువగా పెరుగుతుంది. ఓ అధ్యయనంలో నిమ్మగడ్డి అద్భుతమైన దోమల నివారిణి మొక్క అని తేలింది. నిమ్మ గడ్డి నూనెను స్ప్రే చేయడం వల్ల పరిసరాల్లో ఉన్న దాదాపు అన్ని రకాల దోమలూ చనిపోవడాన్ని పరిశీలకులు గుర్తించారు. 95 శాతం దోమలు చనిపోయినట్లు గుర్తించారు. నిమ్మ గడ్డి నూనె సహజమైన ఉత్తమ దోమల నివారిణి అని తేల్చారు.

లావెండర్‌:

ఆహ్లాదకరమైన సువాసన కోసం లావెండర్‌ నూనెను చాలా మంది వాడుతుంటారు. అయితే ఈ మొక్క, నూనె కూడా దోమలను దరి చేరనివ్వవు. పురుగులనూ పారిపోయేలా చేస్తాయి. ఈగల్లాంటి వాటినీ ఇంట్లోకి రానియ్యవు.

తులసి:

తులసి జాతిలో చాలా రకాల మొక్కలు ఉంటాయి. వాటి ఆకుల ఆకారం, రంగుల్లో కొద్ది కొద్ది తేడాలుంటాయి. ఇలా తులసి జాతి మొక్కల్ని ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా పెంచుకోవడం వల్ల దోమలు దరి చేరవు.

పుదీనా:

కిటికీలు, గుమ్మాల దగ్గర్లో పుదీనా మొక్కల్ని పెంచుకోవడం వల్ల దోమలు, పురుగులు దగ్గరకు రావు. ఎక్కడైనా దోమలు, ఈగలు, పురుగులు ఎక్కువగా చేరుతున్నట్లు కనిపిస్తే దీని రసం తీసి వాటి మీద స్ప్రే చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.