Pregnancy test mistakes: ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేటపుడు.. ఈ తప్పులు చేయొద్దు..-know mistakes to avoid while doing pregnancy test at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know Mistakes To Avoid While Doing Pregnancy Test At Home

Pregnancy test mistakes: ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేటపుడు.. ఈ తప్పులు చేయొద్దు..

HT Telugu Desk HT Telugu
May 24, 2023 06:16 PM IST

Pregnancy test mistakes: ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నపుడు ఈ తప్పులు చేయకండి. వాటివల్ల ఫలితాలు తప్పుగా రావచ్చు.

ప్రెగ్నెన్సీ టెస్ట్ మిస్టేక్స్
ప్రెగ్నెన్సీ టెస్ట్ మిస్టేక్స్ (pexesl)

ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం సర్వసాధారణం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందా లేదా అని తెలుసుకోడానికి సులభమైన కిట్స్ ఎంతో ఉపయోగకరం. దాదాపు 99 శాతం ఈ కిట్స్ ద్వారా సరైన ఫలితాలే వస్తాయని నిపుణుల మాట. కానీ కిట్ మీద చెప్పినట్లుగా కొన్ని గమనికలు పాటించాలి.

హెచ్‌సీజీ హార్మోన్:

మూత్రంలో hCG హార్మోన్ ఆధారంగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ పనిచేస్తాయి. అండం ఫలదీకరణ చెందితే ఈ హార్మోన్ విడుదలవుతుంది. అపుడు మూత్రాన్ని కిట్ లో సూచించిన విధంగా వేస్తే ఫలితాలు వస్తాయి. కొన్ని సార్లు మరీ తొందరగా టెస్ట్ చేసుకుంటే ఈ హార్మోన్ స్థాయులు తక్కువుండటం వల్ల ఫలితాలు సరిగ్గా రావు. ఇంట్లో ఈ కిట్స్ ద్వారా టెస్ట్ చేసుకునేటపుడు కొన్ని తప్పులు చేయొద్దు. దానివల్ల రిజల్ట్స్ తప్పుగా వచ్చే అవకాశం ఉంది. అవేంటో చూడండి.

మొదటి తప్పు: గమనిక చదవకపోవడం

చక్కగా కిట్ ను ఎలా వాడాలో ఒక కాగితం ఉంటుంది. అది చదవకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ప్రతి కిట్ hCG హార్మోన్ ఆధారంగానే పనిచేస్తుంది. కానీ ప్రతి కిట్ ఫలితాలు చదవడానికి వేరే విధానం ఉండొచ్చు.

కొన్ని కిట్స్ లో మూత్రం ఎన్ని చుక్కలు వేయాలో మార్పు ఉండొచ్చు. కొన్ని కిట్స్ మూత్రం సేకరించే పద్ధతిలో కూడా వేరేగా ఉంటాయి. అటాగే కిట్ ఎక్స్పైరీ డేట్ చూడటం మర్చిపోవద్దు.

రెండోది: సరైన సమయంలో ప్రెగ్నెన్సీ టెస్ట్

మీకు కాస్త వింతగా అనిపించినా చాలా మంది సెక్స్ చేసిన తరువాతి రోజే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని చూస్తారట. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీకు ఉదాహరణకు ఈ నెల 5 న పీరియడ్ రావాల్సి ఉండి, రాకపోతే తరువాతి రోజు టెస్ట్ చేసుకోవచ్చు. దాదాపుగా ఫలితం సరిగ్గానే వస్తుంది.

కానీ ఇది క్రమం తప్పకుండా ఒకే రకంగా పీరియడ్స్ వచ్చేవాళ్లకి. ప్రతి నెలా ఒకే తేదీన పీరియడ్ రాని వాళ్లు పీరియడ్ మిస్ అయిన వారానికి ఈ టెస్ట్ చేసుకుంటే మంచిది. లేదంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యే చాన్స్ ఉన్నా కూడా రిజల్ట్ నెగటివ్ రావొచ్చు. అలా అనిపిస్తే కొన్ని రోజులాగి మళ్లీ టెస్ట్ చేసుకోండి.

మూడో తప్పు: నీళ్లు తాగడం

ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోబోయే ముందు ఎక్కువగా నీళ్లు తాగకూడదు. దీనివల్ల మూత్రంలో ఉన్న hCG స్థాయుల గాఢత తగ్గిపోతుంది. అలాగే ఉదయాన్నే మొదటిసారి మూత్రం వెళ్లేటపుడు ఈ టెస్ట్ చేసుకుంటే సరైన ఫలితాలు వస్తాయి.

నాలుగో తప్పు: టైమర్ లేకపోవడం

టెస్ట్ చేసుకున్న వెంటనే ఫలితం గురించి ఆసక్తి ఉంటుంది. కానీ తప్పకుండా టైమర్ వాడండి. ఈ వివరాలు కూడా కిట్ మీదే రాసుంటారు. టైం కన్నా ముందుగా చూసినా, ఆలస్యంగా చూసినా ఫలితం సరిగ్గా తెలుసుకోలేరు. అలాగే ఫలితం ఎలా తెలుసుకోవాలనే విషయంలో స్పష్టత తెచ్చుకోండి.

WhatsApp channel

టాపిక్