Nani on Allu Arjun: ఒక్కరిని బాధ్యుడిని చేయడం సరికాదు: అల్లు అర్జున్ అరెస్టుపై నాని ట్వీట్
Nani on Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై టాలీవుడ్ హీరో నాని స్పందించాడు. ఈ ఘటనలో ఒక్కరినే బాధ్యుల్ని చేయడం సరికాదంటూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు ఈ కేసులో బన్నీకి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Nani on Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించిన తొలి నటుడయ్యాడు నాని. బాలీవుడ్ నుంచి వరుణ్ ధావన్ పబ్లిగ్గా బన్నీకి మద్దతుగా మాట్లాడగా.. ఇప్పుడు నాని కూడా ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదంటూ అతనికి అండగా నిలిచాడు. సంధ్య థియేటర్లో జరిగిన ఘటనకు అందరూ బాధ్యులే అని అతడు అన్నాడు.
అల్లు అర్జున్‌పై నాని ట్వీట్
నాని తన ఎక్స్ అకౌంట్ ద్వారా అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించాడు. "సినిమా వాళ్లనగానే ప్రభుత్వ అధికారులు, మీడియా వాళ్లు చూపించే ఉత్సాహం సాధారణ ప్రజల విషయంలోనూ ఉండాలని అనుకుంటున్నాను. అలా అయితే మనది మరింత మెరుగైన సమాజం అయ్యేది.
అది ఓ దురదృష్ట సంఘటన. నా గుండె తరుక్కుపోతోంది. ఈ ఘటన నుంచి మనమందరం పాఠాలు నేర్చుకొని ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మన అందరి తప్పూ ఉంది. ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదు" అని నాని ఆ ట్వీట్ లో స్పష్టం చేశాడు.
అల్లు అర్జున్ అరెస్ట్.. బెయిల్
అంతకుముందు శుక్రవారం (డిసెంబర్ 13) ఉదయం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని అతని ఇంట్లో బెడ్ రూమ్ లోకి వెళ్లి మరీ కనీసం బట్టలు మార్చుకునేందుకు కూడా టైమ్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినట్లు బన్నీయే ఆరోపించాడు. అతన్ని అరెస్టు చేసిన నాంపల్లి కోర్టుకు తరలించగా.. 14 రోజుల రిమాండ్ విధించారు.
అతన్ని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే అప్పటికే హైకోర్టులో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరగగా.. కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పుష్ప 2 స్టార్ ఊపిరి పీల్చుకున్నాడు.
అతన్ని అరెస్ట్ చేశారని తెలియగానే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, అతని భార్య సురేఖ, తమ్ముడు నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. సోషల్ మీడియాలోనూ బన్నీకి మద్దతుగా చాలా మంది పోస్టులు చేశారు.
కేసు విత్‌డ్రా చేసుకుంటా: మృతురాలి భర్త
మరోవైపు అల్లు అర్జున్ కేసుకు పెద్ద ట్విస్ట్ ఇస్తూ సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త తాను అవసరమైతే కేసును ఉపసంహరించుకుంటానని చెప్పడం విశేషం. ఇందులో అల్లు అర్జున్ తప్పేమీ లేదని కూడా అతడు అన్నాడు. అతన్ని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు చెప్పలేదని, తాను కూడా మొబైల్లో చూసి తెలుసుకున్నానని అతడు చెప్పాడు.