TG HC On Allu Arjun Petition : అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ - హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ మంజూరు-telangana high court granted interim bail to allu arjun ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Hc On Allu Arjun Petition : అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ - హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ మంజూరు

TG HC On Allu Arjun Petition : అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ - హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ మంజూరు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 13, 2024 06:14 PM IST

అల్లు అర్జున్ కేసులో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. నిర్ణీత కాలపరిమితితో(4 వారాలు) బెయిల్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ అల్లు అర్జున్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి… అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్(నాలుగు వారాలు) ను మంజూరు చేశారు.

విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిమాండ్‌ చేసిన ఖైదీకి బెయిల్‌ మంజూరు చేయడం తగదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ రిమాండ్‌ పూర్తైందని, రెగ్యులర్ కోర్టులో మాత్రమే బెయిల్ పిటిషన్‌ వేసుకోవాలని అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్ణీత కాల వ్యవధితో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.

వాదోపవాదనలు…

అల్లు అర్జున్‌ కేసులో హైకోర్టులో వాదోపవాదనలు కొనసాగాయి. సినిమా చూసేందుకు అల్లు అర్జున్‌కు ఎవరి అనుమతి అవసరం లేదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. సాధారణ ప్రేక్షకుడిగానే అల్లు అర్జున్‌ వెళ్లారని… ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్‌ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల అరెస్ట్ అక్రమం అని… తిరస్కరించాలని కోరారు.

కేసు విచారణ క్రమంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. గతంలో ఏపీలో జరిగిన పుష్కరాల కేసును ప్రస్తావించారు. పుష్కరాల సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్ర బాబు అక్కడే ఉన్నారని… తొక్కిసలాట కారణంగా 35 మంది మరణించారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా లో అక్కడ ఉన్న వారిని అరెస్ట్ చేయలేదు కదా అని పేర్కొన్నారు.

టికెట్ రేట్లు పెంచి 28 శాతం జీఎస్టీని ప్రభుత్వం తీసుకుంటోందని న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఏదైనా జరిగినప్పుడు తమ బాధ్యత కాదంటోందని వాదనలు వినిపించారు. "ప్రీమియర్‌ షోలకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే. బెనిఫిట్‌ షోలతో నిర్మాతకు 10కోట్ల లాభం వస్తుందనుకుంటే, ప్రభుత్వం జిఎస్టీ ద్వారా 3కోట్లు ఆదాయం వస్తుంది. ప్రభుత్వమే పర్మిషన్‌ ఇచ్చి షోలు వేయించి నటుల్ని ఎలా బాధ్యుల్ని చేస్తుంది" అని న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు.

“బెనిఫిట్‌ షోలపై ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. ఈ షోలతో నిర్మాతకు మాత్రమే లాభం రావట్లేదు. ఈ షోలకు సినిమా నిర్మాతలను మాత్రమే బాధ్యులను చేయలేం. అల్లు అర్జున్‌ షో చూడ్డానికి వస్తున్నాడని రెండు వేర్వేరు అభ్యర్థనలను సంధ్యా థియేటర్‌ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు సమర్పించింది. అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కేసులో బయటకు కనిపించని విషయం ఇంకేదో ఉంది. అది దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. నా క్లయింట్‌ ఎక్కడకు పారిపోడు. దర్యాప్తుకు సహకరిస్తాడు. నిజానిజాలు దర్యాప్తులో బయటపడతాయి. మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి” అని న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అర్ణబ్ గోస్వామి, బండి సంజయ్ కేసు తీర్పులను ప్రస్తావించారు.

విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. థియేటర్‌కు వెళ్లొద్దని అల్లు అర్జున్‌కు పోలీసులు ముందుగానే సమాచారం ఇచ్చారని కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్‌లో ఎక్కడా కోరలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్వాష్‌ పిటిషన్‌పై అత్యవసర విచారణ అవసరం లేదని…. సోమవారం విచారించాలని విజ్ఞప్తి చేశారు.

రిమాండ్‌ చేసిన ఖైదీకి బెయిల్‌ మంజూరు చేయడం తగదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ రిమాండ్‌ పూర్తైందని.. చంచల్ గూడ జైలుకు తరలించారని చెప్పారు. రెగ్యూలర్ కోర్టులో మాత్రమే బెయిల్ పిటిషన్‌ వేసుకోవాలని అభ్యంతరం వ్యక్తం చేశారు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు….

అల్లు అర్జున్ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నటుడైన అల్లు అర్జున్ పోలీసులకు సమాచారం ఇచ్చి థియేటర్ కు వెళితే జరిగిన సంఘటనకు ఆయన బాధ్యడవుతారా? అని వ్యాఖ్యానించింది. అల్లు అర్జున్ హీరో కాబట్టి అత్యవసరంగా పిటిషన్‌ విచారణ చేపట్టడం లేదని.. సాధారణ వ్యక్తి పిటిషన్ అయినా విచారిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది.

ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. యాక్టర్‌ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని పేర్కొంది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందన్న ధర్మాసనం… కేవలం నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా..? అని వ్యాఖ్యానించింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని… అంతమాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని ప్రస్తావించింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం