Bathing Towel | మీరు ఉపయోగించే తువ్వాలు పరిశుభ్రమైనదేనా? ఎప్పుడు మార్చాలంటే..
మీరు ఉపయోగించే టవల్ క్రమంతప్పకుండా ఉతకాలి, ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఎన్నిరోజులకు టవల్ మార్చాలో ఇక్కడ చూడండి..
మీరు బాత్ రూంలో స్నానం చేసిన తర్వాత.. షవర్, బాత్‌టబ్ లేదా స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చినపుడు మొదటగా అందుకునే ఒక వస్త్రం టవల్. ఈ మూరెడు గుడ్డ మీ అందాలను కప్పివేయడంతో పాటు, మీ శరీరంపై ఉన్న తడిని తొలగిస్తుంది. అయితే ఈ టవల్ పరిశుభ్రంగా లేకపోతే మీరు స్నానం చేసినా కూడా లాభం లేదు. మళ్లీ ఆ టవల్ ద్వారా మురికిని మీ శరీరానికి అంటిచుకున్నట్లే.
కాబట్టి ఎల్లప్పుడు పరిశుభ్రమైన, పొడిగా ఉన్న తువ్వాలునే ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తడిగా ఉండే టవల్ ఉపయోగిస్తే అందులోని మురికి, దురద కారకాలు మీ చర్మంపై దురద, దద్దుర్లు ఇతర చర్మ సమస్యలు కలగజేయడంతో పాటు కొన్ని రకాల అనారోగ్యాలకు కారణమవుతుందని చెబుతున్నారు.
తువ్వాలు తడిని పీల్చుకునే గుణం కలిగి ఉంటాయి కాబట్టి మీరు తుడుచుకున్న చెమట, శ్లేష్మం, మీ శరీరంపై ఉన్న తడి అలాగే మీ శరీరం నుంచి విడుదలయ్యే ఇతర స్రావాలను తువ్వాలు పీల్చుకుంటుంది. దీనిని శుభ్రం చేయని సందర్భంలో అది అనేక రకాల క్రిములు, బాక్టీరియా, ఫంగై, వైరస్ లాంటి ప్రమాదకరమైన సూక్ష్మజీవులకు ఆవాసంగా ఉంటుంది. తడిగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మజీవుల సంఖ్య మరింత వృద్ధి చెందుతుంది. దుర్వాసన కూడా వస్తుంది. మళ్లీ అదే తువ్వాలు మీరు, మీతో పాటు ఇతరులు ఉపయోగిస్తే వివిధ రకాల వ్యాధులు, అంటురోగాల బారినపడే అవకాశం ఉంటుంది. స్టాఫ్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా (MRSA) అపరిశుభ్రమైన తువ్వాలు ద్వారానే వ్యాపిస్తుంది.
టవల్ ఎప్పుడు మార్చాలి, ఎన్నిరోజులకు ఉతకాలి?
ఒక వ్యక్తి మూడు సార్లు ఒక తువ్వాలును ఉపయోగిస్తే, మళ్లీ అదే తువ్వాలును కాకుండా వేరొక శుభ్రమైన తువ్వాలును ఉపయోగించాలని నిపుణులు సిఫారసు చేశారు. శరీర ద్రవం ఉన్న టవల్ ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి, వెంటనే కడిగేయాలి.
తువ్వాలును వారానికి కనీసం రెండు సార్లు ఉతకాలి. ఎప్పుడూ పొడిగా ఉండే తువ్వాలును ఉపయోగిస్తే 5 రోజులకు ఒకసారైనా శుభ్రంగా ఉతకాలి. అలాగే తడి లేకుండా ఎండబెట్టాలి. ఉపయోగించిన తర్వాత కూడా ముద్దగా పడేయకుండా సరిగ్గా ఆరేయాలని చెబుతున్నారు. తువ్వాలును వెనిగర్‌తో శానిటైజ్ చేయవచ్చునని సూచించారు.
మనిషి శరీరంపై ప్రతి అంగుళంలో 19 మిలియన్ల చర్మ కణాలు అలాగే 650 స్వేద గ్రంథులు ఉంటాయి. స్నానం చేసినప్పటికీ కూడా మృతకణాలు, మురికి అలాగే శరీరంపై ఉంటుంది. వాటిని తువ్వాలు అనే సాధనంతో తుడిచివేస్తాం. కాబట్టి ఆ సాధనం శుభ్రంగా ఉండాలి.
సంబంధిత కథనం