Home remedies for Diabetes: షుగర్‌ను అదుపు చేసే వంటింటి చిట్కాలు
Home remedies for Diabetes: షుగర్ (డయాబెటిస్)ను అదుపు చేసేందుకు వంటింటి చిట్కాలు సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
Home remedies for Diabetes: కోవిడ్ 19 శకం దాదాపు ముగిసింది. కానీ ఈ మహమ్మారి దీర్ఘకాలిక అనారోగ్యాలకు కారణమైందని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెటబాలిక్ డిజార్డర్ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా మధుమేహం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. నేడు ప్రతి 11 మంది వయోజనుల్లో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ జీవనశైలి రుగ్మత సాధారణ మందులతో పాటు జీవనశైలి మార్పులతో అదుపులో ఉంటుంది. భోజనం చిన్న పరిమాణంలో ఎక్కువ సార్లు తినడం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల ఆహారాలు తీసుకోవడం, కొన్ని సుగంధ ద్రవ్యాలు, మూలికలు తీసుకోవడం, క్రమబద్ధమైన వ్యాయామం, తగినంత నిద్ర పోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
‘టైప్ 2 మధుమేహం ప్రధానంగా జీవనశైలి రుగ్మత. ఔషధాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, 60 నుండి 70% వరకు కేసుల్లో జీవనశైలి మార్పులు సహాయపడతాయి. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి తగ్గించుకోలేకపోవడం వంటి కారణాల వల్ల డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి..’ అని డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ ఛైర్మన్, చీఫ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి.మోహన్ హెచ్‌టీ డిజిటల్‌కు వివరించారు.
‘డయాబెటిస్ రెండు రకాలు. టైప్ 1 మధుమేహంలో శరీరం ఇన్సులిన్‌ను తయారు చేయదు. టైప్ 2 డయాబెటిస్‌లో శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది కానీ దానిని సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతుంది’ అని ప్రైమస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హెచ్‌ఓడీ, ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ అనురాగ్ సక్సేనా చెప్పారు.
డయాబెటిస్ సమస్యకు ఇంటి చిట్కాలు
మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటానికి ఇక్కడ కొన్ని ఇంటి చిట్కాలను డాక్టర్ సక్సేనా సూచించారు.
1. వేప ఆకుల పొడి
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్లు, ట్రైటెర్పెనాయిడ్స్, యాంటీవైరల్ పదార్థాలు, గ్లైకోసైడ్‌లను కలిగి ఉన్నందున వేప ఆకులు డయాబెటిస్‌కు సమర్థవంతమైన చికిత్స. కొన్ని ఎండిన వేప ఆకులను పొడి చేయాలి. మీరు ప్రతిరోజూ రెండుసార్లు ఈ పొడిని తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
2. కాకర కాయ జ్యూస్
కాకరకాయలో ఉండే రెండు ముఖ్యమైన పదార్థాలు క్యారటిన్, మోమోర్డిసిన్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కాకర కాయ రసం తాగండి.
3. అల్ల నేరేడు
అల్ల నేరేడులో హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అల్ల నేరేడు గింజల పొడి చేసుకుని రోజూ ఉదయం పరిగడుపున ఒక టీస్పూన్ పొడిని కొద్దిగా నీటిలో కలుపుకొని తాగండి.
4. అల్లం
క్రమం తప్పకుండా అల్లం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది ఇన్సులిన్‌ను సమతుల్యం చేస్తుంది. ఒక గిన్నెలో ఒక కప్పు నీరు, ఒక అంగుళం సైజు అల్లం వేసి మరిగించాలి. ఐదు నిమిషాలు మరిగిన తర్వాత అల్లం వేరు చేయండి. ఈ కషాయం రోజుకు ఒకటి లేదా రెండుసార్లు త్రాగాలి.
5. మెంతిపొడి
మెంతులు డయాబెటిస్‌ను అదుపులో పెడతాయి. గ్లూకోస్ టాలరెన్స్‌ని పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ విడుదలను ప్రేరేపించడంలో సహాయపడతాయి. ఇది టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రెండింటినీ అదుపులో ఉంచడానికి బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఆ విత్తనాలను కూడా తినాలి.
మధుమేహం కోసం జీవనశైలి మార్పులు
ఇవి కాకుండా మధుమేహం ఉన్నవారి కోసం డాక్టర్ మోహన్ సూచించిన కొన్ని జీవనశైలి మార్పులు ఇక్కడ ఉన్నాయి.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు
‘మనం పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి అలవాటు పడ్డాం. కార్బోహైడ్రేట్స్ తగ్గించడం మంచిది. శనగలు, పుట్టగొడుగులు, పనీర్, పెసర పప్పు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (గ్లూకోజు శాతం) తక్కువగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో పిండిపదార్థాలు తక్కువగా ఉంటాయి..’ అని డాక్టర్ మోహన్ చెప్పారు.
వ్యాయామం
గ్లూకోజ్ నియంత్రణలో వ్యాయామం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు ఎఫ్ఏఆర్ రూల్ పాటించాలి. ఎఫ్ అంటే ఫ్లెక్సిబిలిటీ, ఎ అంటే ఏరోబిక్స్, ఆర్ అంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ చేయడంతో పాటు టెన్నిస్ లేదా బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడాలి. 2 కిలోల డంబెల్స్ వంటి చిన్న బరువులు ఎత్తడం రెసిస్టెన్స్ ట్రైనింగ్ కిందికి వస్తుంది.
దీర్ఘ శ్వాస
ఒత్తిడిని తగ్గించడం కూడా డయాబెటిస్ నియంత్రణలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ దిశగా ప్రాణాయామం లేదా దీర్ఘ శ్వాస కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి నియంత్రణ కూడా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మూలికలు, మసాలా దినుసులు
మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. మెంతులు, దాల్చిన చెక్క వంటివి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతాయి.
సంబంధిత కథనం
టాపిక్