Foods to balance Doshas: ఆయుర్వేదం ప్రకారం.. శరీరంలో మూడు దోషాలనూ నియంత్రించే 5 ఆహారాలు
Foods to balance Doshas: మన శరీరంలో దోషాలు సమానంగా ఉండటం చాలా అవసరం. అలా ఉంచే కొన్ని ఆహారాలేంటో తెల్సుకుని డైట్ లో చేర్చుకోండి.
ఆయుర్వేదం ప్రకారం మన శరీరం ప్రకృతితో అనుసంధానం అయి ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మనం తినే ఆహారాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తదనుగుణంగా మాత్రమే ఏ కాలానికి తగినట్లుగా ఆ కాలానికి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు తదితరాలు సహజ సిద్ధంగా మనకు లభిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో హైబ్రీడ్ రకాలు, జన్యు మార్పిడి చేసిన విత్తనాలు అందుబాటులోకి రావడం వల్ల అన్ని కాలాల్లోనూ మనకు ఇష్టమైనవన్నీ లభ్యం అవుతున్నాయి.
ఇలాంటి విత్తనాలు అభివృద్ధి చెందక ముందు కాలానికి తగినట్లుగా మాత్రమే మనకు ఆహారాలు లభ్యం అవుతూ ఉండేవి. అయితే ఇప్పుడు ఇలా మార్పు చెందిన ఆహారాల వల్ల మన దేహంలో త్రి దోషాలు అనేవి ప్రకోపిస్తూ ఉంటాయి. అంటే వాత, పిత్త, కఫాలు అనేవి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మన శరీరంలోని అన్ని వ్యవస్థలూ సజావుగా పని చేస్తాయి. అలా కాకుండా ఒకటి పెరిగి, ఒకటి తగ్గడం జరిగితే దాన్నే దోషంగా చెబుతారు. అయితే కొన్ని ఆహారాలను మనం రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ త్రి దోషాలు నియంత్రణలో ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
1. పుచ్చకాయ:
గతంలో పుచ్చ కాయలు కేవలం వేసవి సమయంలోనే ఎక్కువగా దొరుకుతూ ఉండేవి. అయితే ఇప్పుడు మాత్రం సంవత్సరం పొడవునా ఇవి మనకు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో దోషాలను నియంత్రణలో ఉంచుతుంది.
2. ఉసిరి కాయ:
శీతాకాలంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయని పోషకాల గని అని చెప్పవచ్చు. దీనిలో సూక్ష్మ పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. త్రిదోషాలను సమంగా ఉంచడంలో ఇవి చక్కగా పని చేస్తాయి.
3. కొబ్బరి నీళ్లు:
కొబ్బరి బొండం నీళ్లలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు శరీరానికి చలవ చేస్తాయి. అందువల్ల పిత్త దోషం ప్రకోపించకుండా ఉంటుంది.
4. పుదీనా:
మంచి రిలాక్సింగ్ వాసనతో ఉండే పుదీనాకు పిత్త దోషాన్ని తగ్గించే లక్షణం ఉంది. దీన్ని రోజూ క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. జీవ క్రియ వేగవంతం అవుతుంది. త్రి దోషాలు ఉండవు.
5. గార్డ్స్:
సొరకాయ, బీర, దోస, గుమ్మడి.. లాంటి కూరగాయల్ని ఆంగ్లంలో గార్డ్స్ అంటారు. బాటిల్ గార్డ్, రిడ్జ్ గార్డ్.... అంటూ ఉండే ఇలాంటి కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని మెరుగుచేసి త్రి దోషాలను నియంత్రిస్తాయి.