Business ideas: ఇంట్లోనుండే డబ్బు సంపాదించాలా? వేలకు వేలు తెచ్చిపెట్టే మార్గాలివే-know creative business ideas for women to earn money from home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Business Ideas: ఇంట్లోనుండే డబ్బు సంపాదించాలా? వేలకు వేలు తెచ్చిపెట్టే మార్గాలివే

Business ideas: ఇంట్లోనుండే డబ్బు సంపాదించాలా? వేలకు వేలు తెచ్చిపెట్టే మార్గాలివే

Koutik Pranaya Sree HT Telugu
Jul 30, 2024 07:00 PM IST

Business ideas: మహిళలు ఇంట్లో నుంచే డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతుకున్నారా? అయితే కాస్త సృజనాత్మకత, ఓపిక ఉంటే ఈ మార్గాలతో వేలకు వేలు సంపాదించవచ్చు.

ఇంటి నుంచే డబ్బు సంపాదించే మార్గాలు
ఇంటి నుంచే డబ్బు సంపాదించే మార్గాలు (pexels)

చాలా మంది మహిళలు ఇంటినుంచే డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతుకుతారు. మీరు వాళ్లలో ఒకరైతే మీరు కూడా మొదలెట్టగలిగే బిజినెస్ ఐడియాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ట్రెండిగ్‌లో ఉండి, మంచి సంపాదన తెచ్చి పెడుతున్న వాటిలో జ్యువెలరీ బిజినెస్‌లు ముందుంటాయి. ఆన్‌లైన్ పేజీల్లో ఈ బిజినెస్ పెద్ద ఎత్తున జరుగుతుందనే చెప్పాలి.అలాగని ఇవేమీ కష్టమైనవి కాదు. కాస్త ఓపిక ఉంటే వీటిని ఉచిత వీడియోలు చూసి నేర్చుకుని మీరూ కస్టమైజ్డ్ జ్యువెలరీ అమ్మేయొచ్చు. అదెలాగో, సులభమైన మార్గాలేంటో చూద్దాం.

కాస్త సృజనాత్మకంగా ఆలోచించి, చిన్నపాటి బొమ్మలు గీయగలగడం, గంటల సేపు కూర్చునే ఓపిక ఉంటే చాలు. మంచి డబ్బు సంపాదించొచ్చు. అలాంటి మార్గాల్లో కొన్ని మీకోసం.

1. టెర్రాకోటా జ్యువెలరీ:

టెర్రాకోట మట్టితో ఈ నగలు తయారు చేస్తారు. అలాగని తీసిపడేసేలా ఉండవివి. వీటితో చేసిన చిన్న పాటి చెవి పోగుల ధర 200 నుంచి మొదలై ఒక పెద్ద నెక్‌లేస్ సెట్ల ధర 10,000 దాకా కూడా ఉంటుంది. కెంపులు, స్టోన్స్, బీడ్స్, మంచి రంగుల్లో వీటిని తయారు చేసి అమ్ముతున్నారు. మామూలు వన్ గ్రామ్ జ్యువెలరీ లాగా కాకుండా వీటిని మనం ఎంచుకున్న రంగుల కాంబినేషన్లో మనకోసమే మనం ఎలా అనుకుంటే అలాగే తయారు చేయొచ్చు. పెళ్లిళ్లకు కూడా వేసుకునేంత భారీ నగలు కూడా ఈ టెర్రాకోట మట్టితో చేయొచ్చు. దానికోసం ఆన్‌లైన్ లో కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఒక్కసారి నేర్చుకుంటే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లో పేజీ మొదలుపెట్టి వీటిని అమ్మడం మొదలుపెట్టొచ్చు. మంచి సంపాదన మార్గం దొరికినట్లే. 

2. క్రోషెట్ జ్యువెలరీ:

ఉన్ని దారం అల్లుకుంటూ ఈ జ్యువెలరీ తయారు చేస్తారు. చెవి కమ్మలు, స్టడ్స్, చేతి రింగులు, కార్లో తగిలించుకునే బొమ్మలు, డెకొరేటివ్ వస్తువులు, పిల్లల బొమ్మలు, వ్యాలెట్లు.. ఇలా చాలా చేయొచ్చు. ఇవి చూడ్డానికి కూడా కొత్తగా, ట్రెండీగా ఉంటాయి. ఈ జ్యువెలరీ ఎలా తయారు చేయాలో చెప్పే క్లాసులు యూట్యూబ్‌లో బోలెడు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా నేర్చుకోవచ్చు. ఇవి ఫ్యాన్సీ రకం జ్యువెలరీ కాబట్టి వీటి ధర కూడా కనీసం 300కు తక్కువ నుంచి మొదలవ్వదు.

3. రెజిన్ జ్యువెలరీ:

కరిగించిన రెజిన్ పారదర్శకంగా ఉండే మైనం లాగా ఉంటుంది. దీన్ని అచ్చుల్లో పోసి కళాత్మకమైన వస్తువులు తయారు చేయొచ్చు. పెండెట్లు, చెవిపోగులు, ఉంగరాలు.. ఒక్కటేమిటి చాలా ఉన్నాయి. ఈ జ్యువెలరీ సాంప్రదాయ దుస్తులకే కాకుండా జీన్స్, కుర్తాలకు కూడా చక్కగా నప్పుతుంది. రెజిన్ కాస్త కళాత్మకంగా చేసే ఆంగ్ల అక్షరాలకు మంచి గిరాకీ ఉంటుంది. వాటిని కీచైన్ లాగా వాడుకోవచ్చు. వీటి ధర అయితే 500 నుంచీ మొదలవుతుంది.

4. ఫ్యాబ్రిక్ జ్యువెలరీ:

ఓపిక ఉంటే చాలు వీటిని ఎలాంటి ప్రత్యేకమైన కోర్సు అవసరం లేకుండా చేసేయొచ్చు. మనం ఎంచుకున్న డ్రెస్సుకు చాలా దగ్గరగా ఉండే రంగుల బట్టతో వీటిని తయారు చేయడం వల్ల చక్కగా మ్యాచింగ్ అవుతాయి. వీటికి పూసలు, స్టోన్స్ అతికించి కళాత్మకంగా తయారు చేస్తారు. హల్దీ, మెహందీ లాంటి పెళ్లికి సంబంధించిన ఫంక్షన్లకు ఈ జ్యువెలరీ నప్పడం వల్ల ఇవి ట్రెండ్ అవుతున్నాయి. మీకు మంచి సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యం ఉంటే ఈ జ్యువెలరీని వినూత్నంగా తయారు చేసి మంచి డబ్బు సంపాదించొచ్చు.

ఈ జ్యువెలరీ తయారు చేయడం మొదలుపెట్టాక, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో, యూట్యూబ్‌లో చానెల్ మొదలు పెట్టి వీటిని అమ్మొచ్చు. వీటి ధర మీరెంత బాగా చేయగలుగుతున్నారనే దానిమీదే ఆధారపడుతుంది. మీ ఉత్పత్తి ధర మీ చేతుల్లోనే ఉంటుంది. కొన్నింటికి కోర్సులు ప్రత్యేకంగా చేస్తే బాగుంటుంది. లేదా ముందుగా ఉచితంగా నేర్పే ఆన్‌లైన్ వీడియోలు చూసి మీకిష్టం ఉన్నది మొదలుపెట్టండి.

Whats_app_banner