Know about Palm Oil: పామాయిల్‌ని వాడుతున్నారా? కచ్చితంగా ఇది చదవండి..-know about palm oil and health hazards by its usage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Know About Palm Oil: పామాయిల్‌ని వాడుతున్నారా? కచ్చితంగా ఇది చదవండి..

Know about Palm Oil: పామాయిల్‌ని వాడుతున్నారా? కచ్చితంగా ఇది చదవండి..

Know about Palm Oil: వంటకోసం పామాయిల్ వాడుతున్నారా? అయితే దానివల్ల జరిగే నష్టాల గురించి తెలిస్తే మీ అలవాటు మార్చేసుకుంటారు. ఆ నూనె తింటే ఏం జరుగుతుందో వివరంగా తెల్సుకోండి.

పామాయిల్ వాడకం (pexels)

ఇది వరకటి రోజుల్లో అంతా ఎక్కువగా పామాయిల్‌నే వంట నూనెగా వాడుతూ ఉండేవారు. ఇటీవల కాలంలో అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. ఏం తింటున్నాం అన్న దాని మీద జిజ్ఞాస ఎక్కువైంది. అందుకనే ఏది ఆరోగ్యానికి మంచిదో దాన్నే తినే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యాభిలాషులు పామాయిల్‌ వాడకం బాగా తగ్గించారు. ఎందుకంటే దాన్ని తినడం వల్ల ఆరోగ్యంపై కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. అవేంటంటే..

పామాయిల్ నష్టాలు:

  • పామాయిల్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనలో చెడు కొలెస్ట్రాల్‌ని (ఎల్‌డీఎల్‌) పెంచడంలో కీలకంగా పని చేస్తాయి. ఈ ఎల్‌డీఎల్‌తోపాటుగా, ట్రై గ్లిజరైడ్లు ఉండటం వల్ల గుండె జబ్బులు, రక్త పోటు లాంటివి వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి.
  • ఈ నూనెలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వంద గ్రాముల పామాయిల్‌ని తింటే మనకు ఏకంగా 884 క్యాలరీలు లభిస్తాయి. ఈ నూనెలో ఏదో ఒకటి వేయించి దాని ద్వారా నూనెనూ తింటాం. అంటే ఆ ఆహారంతో పాటు అదనంగా ఈ నూనెలోని క్యాలరీలు మనకు లభిస్తాయి. తక్కువలో తక్కువ లెక్క వేసుకున్నా దీనితో చేసిన ఆహారాన్ని తినడం వల్ల 1500 వరకు కేలరీలు తేలికగా మన శరీరంలోకి చేరిపోతాయి. ఇలా క్రమంగా తింటూ ఉండటం వల్ల బరువు పెరగడం, ఊబకాయం రావడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడం లాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  • ఈ మధ్య కాలంలో అన్ని చోట్లా రిఫైన్డ్‌ పామాయిల్‌ మాత్రమే దొరుకుతూ ఉంది. సాధారణ పామాయిల్‌ మచ్చుకైనా కనిపించడం లేదు. దీని ప్రాసెసింగ్‌లో భాగంగా 3 mcpd, గ్లైసిడైల్‌ ఈస్టర్లు లాంటి వాటితో ఇది కలుస్తుంది. ఈ క్రమంలో దీన్ని వేడి కూడా చేస్తారు. ఇలా ప్రాసెసింగ్‌లో అన్నీ కలవడం వల్ల దీర్ఘ కాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం మనకు పొంచి ఉంటుంది.
  • ఈ నూనె వాడకం వల్ల అధికంగా క్యాలరీలు లభిస్తాయని చెప్పుకొన్నాం కదా. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, మధుమేహం ముప్పుల్లాంటివీ ఎక్కువ అవుతాయి.
  • ఈ నూనెని అధికంగా ఉత్పత్తి చేయడానికి ఏటా వందల ఎకరాల అటవీ భూమి డీ ఫారెస్టేషన్‌కు గురవుతోంది. అలా ఈ తోటల వల్ల పర్యావరణానికీ చేటు కలుగుతోందని పర్యావరణ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. దీన్ని తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండీ. దీనిలో విటమిన్‌ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. 14 గ్రాముల పామాయిల్‌ని తింటే మనకు రోజు వారీ అవసరాల్లో 14 శాతం ఈ విటమిన్‌ దీనిలో దొరికేస్తుంది.