Music Therapy: ఎంతటి ఒత్తిడినైనా తగ్గించే మ్యూజిక్ థెరపీ ప్రయత్నించారా?-know about music therapy and its health advantages ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Music Therapy: ఎంతటి ఒత్తిడినైనా తగ్గించే మ్యూజిక్ థెరపీ ప్రయత్నించారా?

Music Therapy: ఎంతటి ఒత్తిడినైనా తగ్గించే మ్యూజిక్ థెరపీ ప్రయత్నించారా?

HT Telugu Desk HT Telugu
Dec 17, 2023 07:45 PM IST

Music Therapy: సంగీతానికి మన బాధ తగ్గించి ఆనందంగా మార్చేసే శక్తి ఉందని మ్యూజిక్ థెరపీ చెబుతుంది. ఈ థెరపీ గురించి, దాని పూర్తి వివరాలేంటో తెలుసుకోండి.

మ్యూజిక్ థెరపీ
మ్యూజిక్ థెరపీ (freepik)

మూడ్‌ కాస్త బాలేదు.. ఎందుకో విసుగ్గా ఉంది.. చాలా ఒత్తిడిలో ఉన్నాను.. ఇలాంటి భావాలు మనసులో ఉన్నప్పుడు సన్నగా మోగే సున్నితమైన సంగీతాన్ని పెట్టుకుని ఆస్వాదించి చూడండి. బరువైన భావాలు కొంత తేలికైనట్లు అనిపిస్తాయి. భారమైన హృదయం కాస్తా గాల్లో దూది పింజలా తేలుతున్నట్లు అనిపిస్తుంది. కాస్త ఒత్తిడి తగ్గి విసుగులోంచి ఆనందంలోకి మూడ్‌ మారిపోతుంది. మీరు అవునన్నా? కాదన్నా? ఇది మాత్రం నిజం. ఎందుకంటే మనల్ని మంచి భావాల్లోకి మార్చే శక్తి మ్యూజిక్‌ థెరపీకి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నచ్చిన మ్యూజిక్‌ని పెట్టుకుని వినడం వల్ల సహజంగానే మన భావాలు హ్యాపీగా మారిపోతాయని అంటున్నాయి. ఇలా మ్యూజిక్‌ థెరపీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో చదివేయండి.

మ్యూజిక్ థెరపీ లాభాలు:

సంగీతానికి మన భావోద్వేగాలు, ప్రవర్తన, సంభాషణ తదితరాలపై సానుకూల ప్రభావాలను చూపే శక్తి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల మనం కాస్త ఆనందంగా, రిలాక్సింగ్‌గా ఉండగలుగుతాం. ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ మ్యూజిక్‌ థెరపీ అనేది మన జీవితం మీద చాలా సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. అందుకనే ఇటీవల మ్యూజిక్‌ థెరపిస్టులు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నారు. వీరు మన కోసం కొన్ని ప్లేలిస్ట్‌లను సిఫార్సు చేస్తారు. ఎలాంటి వాటిని మనకు మూడ్‌ బాగోలేనప్పుడు వింటూ ఉంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.

ప్రతి విషయానికీ ఎక్కువగా భయపడిపోవడం, కంగారు పడిపోవడం, పని చేయాలంటే కంగారు వచ్చేసి సవ్యంగా చేయ లేకపోవడం, అతిగా ఒత్తిడికి గురవ్వడం లాంటి లక్షణాలు అన్నింటినీ యాంగ్జైటీగా చెబుతారు. దీన్ని తగ్గించడంలో ఈ థెరపీ అద్భుతంగా పని చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రతి విషయంలోనూ నిరాశకు లోనవ్వడం అనేది కూడా ఒక విధమైన మూడ్‌ డిజార్డరే. ప్రతి పనిలోనూ నాకు ఏ పనీ కాదు. నేను వృద్ధిలోకి రాను. నేను దురదృష్టవంతుణ్ణి.. లాంటి అనేకానేక నిరాశలు కొందరు మనుషుల్ని ఆవహించి ఉంటాయి. వీటికి కూడా మ్యూజిక్‌ థెరపీతో చెక్‌ పెట్టవచ్చు. తరచుగా ప్రోత్సాహకర పాటలు, సంగీతం వినడం ద్వారా వీరు ఇలాంటి ఆలోచనా ధోరణి నుంచి బటయపడొచ్చని మ్యూజిక్‌ థెరపిస్టులు చెబుతున్నారు.

మనం కొద్ది సమయంలో ఎక్కువగా పని చేయాల్సి ఉంటే తెలియకుండానే మనల్ని ఒత్తిడి ఆవహించేస్తుంది. ఇలా ఉన్నప్పుడు సహజంగానే గుండె కొట్టుకునే వేగం, శ్వాసక్రియ వేగం పెరిగిపోతాయి. ఇలాంటప్పుడు కొన్ని రకాల సంగీతాలను వినడం వల్ల రిలాక్సేషన్‌ దొరుకుతుంది. కండరాలకు సాంత్వన లభిస్తుంది. అలాగే ఇలాంటి సమయంలో నచ్చిన పాటల్ని మనం పాడటం వల్ల కూడా ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గుతుంది.

కాబట్టి ఎప్పుడు అదోలా అనిపించినా చక్కగా పాడేయండి. నచ్చిన పాటల్ని వినేయండి. వీలైతే ఓ చిందేయండి. లోపలి భయాల్ని గాల్లో కలిపేయండి.

Whats_app_banner