Know about Microwave: మైక్రోవేవ్ వాడితే మంచిదేనా? ఏవి.. ఎలా వండితే ఆరోగ్యకరం?-know about microwave and different foods that are healthy to cook in it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Know About Microwave: మైక్రోవేవ్ వాడితే మంచిదేనా? ఏవి.. ఎలా వండితే ఆరోగ్యకరం?

Know about Microwave: మైక్రోవేవ్ వాడితే మంచిదేనా? ఏవి.. ఎలా వండితే ఆరోగ్యకరం?

Koutik Pranaya Sree HT Telugu
Nov 29, 2023 03:23 PM IST

Know about Microwave: మైక్రోవేవ్‌లో ఎలాంటి పదార్థాలు వండాలి? వండకూడదు అని చాలా సందేహాలుంటాయి. దాన్ని వాడటం ఆరోగ్యకరమా కాదా అనే సందేహమూ ఉంటుంది. అవన్నీ వివరంగా తెల్సుకోండి.

మైక్రోవేవ్ వాడకం
మైక్రోవేవ్ వాడకం (freepik)

ఇటీవల కాలంలో మైక్రోవేవ్‌ల వాడకం మన దగ్గర ఎక్కువైంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది వీటిని వాడుతున్నారు. ఆహారాలను వేడి చేసుకోవడం, కేకుల్లాంటివి బేక్‌ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అయితే వీటిలో ఎక్కువగా ప్లాస్టిక్‌ గిన్నెల్లో ఆహారాలను ఉంచి వేడి చేయాల్సి ఉంటుంది. రెండు నిమిషాల్లో పని అయిపోతుంది. కానీ ఆరోగ్యం మాటేమిటి? దీనిలో వండిన ఆహార పదార్థాలు అసలు మంచివా? కాదా? నిపుణులు ఈ విషయంపై ఏం చెబుతున్నారంటే..

పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

మైక్రోవేవ్ ఉపయోగించి వండిన ఆహారం మంచిదని కొన్ని పరిశోధనల్లో తేలింది. వాస్తవానికి ఆవిరిలో ఉడికించడం, మైక్రోవేవ్‌లో వండడం వలన ఆహారంలో చాలా రకల ఫ్లేవనాయిడ్లు పెరుగుతాయని, ఇవి గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయని ఆ పరిశోధన స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో ఆవిరి మీద వండడంకన్నా కూడా మైక్రోవేవ్‌లో వండడం వల్ల ఫ్లేవనాయిడ్లు పెరిగాయని ఈ అధ్యయనంలో తేలింది. అయితే ఉడికించడానికి ఎక్కువ నీరు వాడితే మాత్రం ఫ్లేవనాయిడ్ల శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.

కొన్ని నష్టాలున్నాయ్:

కొన్ని ఆహారాలు మైక్రోవేవ్‌లో మళ్లీ మళ్లీ వేడి చేయడం భారీగా పోషకాల నష్టం వాటిల్లుతుంది. దీంతో తక్కువ పోషకాలు ఉన్న ఆహారం లోపలికి వెళుతుంది. అలాంటివి తినడం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. మైక్రోవేవ్ లో పదార్థాలు వేడి చేయటం వల్ల టాక్సిన్‌గా మారే ప్రమాదం ఉంటుంది. బ్రోకలీలాంటి కూరగాయలను మైక్రోవేవ్‌లో వండితే వాటిలో ఉండే కొన్ని రకాల ఫ్లేవనాయిడ్లు 97% వరకూ తగ్గిపోతాయని, పొయ్యి మీద ఉడికించడం వల్ల జరిగే నష్టంకన్నా ఇది ఎక్కువ శాతమని తేలింది. ఈ ఫ్లేవనాయిడ్లు కడుపులో మంటను తగ్గించేందుకు సహాయపడతాయి.

ఓవెన్ లో ఏమేం వండుకోవచ్చు?

కూరగాయల్లో ఉండే ఫినోలిక్స్ మిశ్రమాలు నీళ్లల్లో ఉడికించినప్పుడు, ఆవిరి మీద ఉడికించినప్పుడు, మైక్రోవేవ్‌లో వండేటప్పుడు ఎలా మారుతున్నాయో మరో అధ్యయనంలో పరిశీలించారు. ఆవిరి మీద ఉడికించినప్పుడు, మైక్రోవేవ్‌లో వండినప్పుడు పాలకూర, కాప్సికం, బ్రోకలీ, గ్రీన్ బీన్స్‌లాంటి వాటిల్లో ఫినోలిక్స్ పోలేదు. అంటే వీటిని భేషుగ్గా మైక్రోవేవ్‌లో వండుకోవచ్చు. కానీ గుమ్మడి, పచ్చి బఠాణీ, ఉల్లికాడలు లాంటి వాటిల్లో ఫినోలిక్స్ ఎక్కువ శాతం నశించాయి. దీన్ని బట్టి వీటని ఒవెన్‌లో పెట్టకూడదని పరిశీలకులు తేల్చారు.

మైక్రోవేవ్ కుకింగ్‌లో వాడే అధిక ఉష్ణోగ్రతలు కూడా కొన్నిసార్లు హాని కలిగించవచ్చు. ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే దుంపలు, ధాన్యాలలాంటివి వండేటప్పుడు జాగ్రత్త వహించాలి. పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నవాటిని మైక్రోవేవ్‌లో అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు ఎక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనం విడుదల అవుతుంది. ఆహార పదార్థం రకాన్ని బట్టి దాన్ని ఒవెన్‌లో పెట్టుకుని తినొచ్చా? లేదా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

Whats_app_banner