Curry Leaves benefits: కరివేపాకుతో 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
Curry Leaves benefits: కరివేపాకుతో డయాబెటిస్, బీపీ, అర్షమొలలు.. ఇలా అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
Curry leaves: కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు (Thamizhpparithi Maari, CC BY-SA 4.0 , via Wikimedia Commons)
Curry Leaves benefits: కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. కానీ మనం కరివేపాకును తేలిగ్గా తీసుకుంటాం. కంచంలో కనిపిస్తే కరివేపాకును తీసిపడేస్తాం. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ తదితర జీవన శైలి వ్యాధులే కాకుండా అనేక వ్యాధులకు నివారణిగా ఉపయోగపడుతుంది.
- సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు రోజుకు 10 చొప్పున కరివేపాకు ఆకులను తినాలి. ఇలా 3 నెలల పాటు తింటే అసలు మధుమేహం (డయాబెటిస్) దరిచేరదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
- కరివేపాకును పొడి చేసి మెంతులు, ఉసిరి, నేరేడు గింజల పొడి, నల్ల జీలకర్ర, తిప్పసత్తు, నాటు కాకర కలిపి పొడి చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో ఒక రెండు చెంచాలు కలుపుకొని తినాలి. ఇలా చేస్తే డయాబెటిస్ ఉన్న వారికి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వీరు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం ఇది.
- కరివేపాకు పండ్లు, లేదా బెరడు కషాయంగా కాచుకోవాలి. దీనిని రోజూ కొద్దిగా తాగితే హైపర్ టెన్షన్ (బీపీ) వల్ల వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి.
- అర్శమొలలు (పైల్స్) తగ్గాలంటే లేతగా ఉన్న కరివేపాకును జ్యూస్‌గా చేసుకుని తేనె కలిపి తాగితే సరిపోతుంది. పైల్స్ ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది.
- వికారం తగ్గడానికి కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. కరివేపాకు రసం చేసుకుని దానికి అంతేమొత్తంలో నిమ్మరసం కలుపుకుని రోజూ ఓ రెండుసార్లు తాగితే వికారం, వాంతుల నుంచి రిలీఫ్ ఉంటుంది.
- మలబద్దకం, కడుపులో మంట, కడుపు ఉబ్బరం తదితర జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉంటే కరివేపాకు చూర్ణంలా చేసుకొని మజ్జిగలో కలిపి తాగాలి.
- జ్వరం ఉన్నప్పుడు కాస్త కరివేపాకు కషాయం కాచుకుని తాగితే జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
- జీర్ణ శక్తి పెరగాలంటే కరివేపాకులను ఎండబెట్టి ధనియాలు, జీలకర్రతో కలిపి వేయించాలి. నేతితో వేయించి చూర్ణం చేసుకుని కాస్త సైంధవ లవణం కలిపి నిల్వ చేసుకోవాలి. ఆహారంతో పాటు అప్పుడప్పుడు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. లేదా ధనియాలు, మెంతులు, ఆవాలు సమపాళ్లలో నెయ్యిల వేయించాలి. ఈ మిశ్రమాన్ని దంచి పొడిలా చేసుకోవాలి. ఎండు మిరపకాయలకు బదులుగా శొంఠి పొడి వాడుకుంటే ఇంకా శ్రేష్టం. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అమీబియాసిస్ నుంచి ఉపశమనం కోసం కరివేపాకు పొడి, తేనె కలిపి తీసుకోవాలి.
- శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా కరివేపాకు ఉపశమనం ఇస్తుంది. రాత్రి భోజనంలో కరివేపాకు చూర్ణం కలిపి తీసుకున్నా లేదా విడిగా తీసుకున్నా దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- చలికాలంలో శరీరంలో వేడి పుట్టేందుకు కరివేపాకును ఎక్కువగా మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.