Kala Azar | కొత్తగా బ్లాక్ ఫీవర్ విస్తరిస్తోంది.. దీని లక్షణాలు, నివారణ మార్గాలు
ఈశాన్య భారతదేశంలో (Kala Azar) బ్లాక్ ఫీవర్ వ్యాపిస్తోంది. కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. బ్లాక్ ఫీవర్ ఎలా సోకుతుంది, లక్షణాలు ఎలా ఉంటాయి. నివారణ మార్గాలు చూడండి.
మొన్నటి వరకు కరోనా, నేడు మంకీ పాక్స్ ఇప్పుడు వీటికి తోడు 'కాలా అజార్' గా పిలిచే ఒక రకమైన జ్వరం భారతదేశంలో ఎక్కువగా ప్రబలుతోంది. దీనిని బ్లాక్ ఫీవర్ అని కూడా అంటారు. ఈ జ్వరం ప్రస్తుతం ఈశాన్య భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు సుమారు 65 కేసులు నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం మనకు వర్షాకాలం కొనసాగుతుంది. ఈ కాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. ప్రజలు విహార యాత్రలు కూడా ఎక్కువగా చేస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.
మరి ఈ నల్ల జ్వరం ఎలా వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
కాలా-అజర్ లేదా బ్లాక్ ఫీవర్ అంటే ఏమిటి?
నల్ల జ్వరం ప్రధానంగా 'లీష్మానియా డోనోవాని' అనే పరాన్నజీవి సోకిన సాండ్ ఫ్లై అనే కీటకం కాటు ద్వారా వ్యాప్తిస్తుంది. ఇందులోనూ ఆడ కీటకం కుట్టడం ద్వారా మనిషికి సోకుతుంది. దీనిని విసెరల్ లీష్మానియాసిస్ (VL) అని కూడా పిలుస్తారు. వ్యాప్తి వేగంగా, మరణాల రేటు ఎక్కువగా ఉన్న సీజనల్ వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. ఈ కీటకం ఎక్కువగా పశువుల పాకలో, తేమతో కూడిన పరిసరాల్లో, మూత్రాశయాలలో, రాతి పగుళ్లలో అపరిశుభ్ర వాతావరణంలో పెరుగుతుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి?
బ్లాక్ ఫీవర్ నెమ్మదిగా పురోగమించే వ్యాధి. ఈ జ్వరం సోకిన వ్యక్తుల్లో క్రమరహితంగా జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, చర్మం పొడిబారడం, కళావిహీనంగా తయారవడం, రక్తహీనత వంటి లక్షణాలు ఉంటాయి. కాలేయం, ప్లీహంలో వాపు ఉంటుంది.
చికిత్స- నివారణ ఎలా?
పారాసిటోలాజికల్ లేదా సెరోలాజికల్ పరీక్షలు జరిపి బ్లాక్ ఫీవర్ నిర్ధారణ చేస్తారు. యాంటీ బాడీలను పంపడం ద్వారా చికిత్స చేస్తారు.
నివారణ ఎలా అంటే.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం వేళల్లో ఈ కీటకాలు ఎక్కువగా సంచరిస్తాయి. ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేటపుడు నిండుగా దుస్తులు ధరించాలి. కీటక రిపెల్లంట్లను వాడాలి. పోషకాహారం తినాలి. మెరుగైన రోగ నిరోధకశక్తి కలిగి ఉండాలి.
సంబంధిత కథనం