Is It Safe To Eat Raw । పచ్చి కూరగాయల జ్యూస్ తాగడం సురక్షితమేనా? ఆయుర్వేద సలహ!
కొంతమంది పచ్చికూరగాయలనే తినేస్తారు, వాటిని జ్యూస్ చేసుకొని తాగేస్తారు. మరి ఇలా తినడం మంచిదేనా? ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.
ఆరోగ్య స్పృహ కలిగిన వారు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు ఎక్కువగా వండనివి, పచ్చి కూరగాయలను తినడానికి ఆసక్తి చూపుతారు. ఆహారాన్ని వండితే అందులోని పోషకాలన్నీ నశిస్తాయనేది వీరి భావన. అందుకే తరచుగా కూరగాయలను జ్యూస్ లుగా, స్మూతీలుగా చేసుకొని తాగేస్తున్నారు. ఈ రకంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరగదు, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండవచ్చు అని చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చికూరగాయలు, వండనివి తీసుకోవటం కొంత వరకు మంచిదే, అయితే మనం ఎంచుకునే కూరగాయలు అందుకు అనువైనవా? కాదా అనేది ముఖ్యం. అది కూడా అతిగా కూడా తీసుకోవద్దు, మితంగా తీసుకోవాలి. ప్రతి దానికి ఒక మోతాదు అనేది ఉంటుంది. సరైన ఆహార నియమాలు పాటించాలి అని ఆయుర్వేదం చెబుతోంది.
ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ డింపుల్ జంగ్దా మాట్లాడుతూ.. ఎక్కువగా పచ్చి ఆహారాలను తీసుకుంటే అజీర్ణం సమస్యలు లేదా కడుపు ఇన్ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు.
పచ్చి కూరగాయలు ఎందుకు హానికరం?
వండిన ఆహారంతో పోల్చినప్పుడు పచ్చి ఆహారాలు జీర్ణం కావడం చాలా కష్టం. కూరగాయలను వండినపుడే ఆ వేడికి అవి కొంత వరకు విచ్ఛిన్నం అవుతాయి. ఇంకా అందులో మనం సుగంధ ద్రవ్యాలు కలుపుతాం. ఇవి జీర్ణ అగ్నిపై ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి వండుకొని తింటేనే శోషణ వేగంగా జరుగుతుంది. అయితే మరీ ఎక్కువగా కూడా వండుకోకూడదని డాక్టర్ డింపుల్ తెలిపారు.
అలాగే వికారం, అలసట, మైకము, ఉబ్బరం, విరేచనాలు లేదా IBS వంటి లక్షణాలను ఉన్నప్పుడు పచ్చి ఆహారాలు లేదా చల్లని ఆహారాలు తినకూడదు అని ఆయుర్వేదం చెబుతుంది. పచ్చివి బ్యాక్టీరియాలు, ఇతర పరాన్నజీవులకు నిలయం. కాబట్టి వాటిని శుభ్రంగా కడిగి, వండుకుని తింటేనే ఆరోగ్యకరం అని చెబుతున్నారు.
ఉడికించటానికి సరైన మార్గం
ఆకుకూరలు, కూరగాయలను కొద్దిగా ఆవిరిలో ఉడికించవచ్చు. కొన్ని మసాలా దినుసులతో కలిపి ఉడికిస్తే జీర్ణక్రియ ప్రక్రియకు మరింత సహాయపడుతుందని డాక్టర్ డింపుల్ తెలిపారు. వంట ప్రక్రియలో పోషకాలను కోల్పోవచ్చని వాదనలకు కూడా సమాధానమిస్తూ పచ్చివి తిని అవి జీర్ణం కాకపోతే కూడా పోషకాలు అందవు అని తెలిపారు.
ఈ కూరగాయలను పచ్చిగా తినకూడదు
పాలకూర, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ, బోక్ చోయ్ వంటివి ఎంతమాత్రం పచ్చిగా తినకూడదు. ఇవి కిడ్నీలో రాళ్లు కలిగిస్తాయి. ఇనుము, కాల్షియం శోషణను కూడా నిరోధించగలవు. థైరాయిడ్ గ్రంధికి అంతరాయం కలిగిస్తాయి. జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.
జ్యూస్ చేసుకోగల కూరగాయలు
క్యారెట్లు, దుంపలు, దోసకాయలు, సెలెరీ, వీట్‌గ్రాస్, అల్లం, పార్ల్సీ , కొత్తిమీర వంటివి జ్యూస్ చేసుకొని తాగొచ్చు. అయితే వీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకుంటే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.
సంబంధిత కథనం