IRCTC Ayodhya Tour : ఐఆర్‌సీటీసీ అయోధ్య టూర్.. మిడిల్ క్లాస్ వారికి పర్ఫెక్ట్ ప్యాకేజీ
IRCTC Ayodhya Tour : ఇటీవలే అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. ఈ పవిత్రమైన స్థలాన్ని చూసేందుకు రామ భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే ఐఆర్‌సీటీసీ అయోధ్య టూర్ ప్యాకేజీ ప్రకటించింది.
అయోధ్యలో రామజన్మభూమిని దర్శించుకుకోవాలని చాలామందికి ఉంటుంది. రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన ప్రదేశాన్ని సందర్శించాలని కోరుకుంటారు. అయితే ఎలా వెళ్లాలని మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంతో కలిసి ఎంచక్కా ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. మధ్యతరగతివారికి అందుబాటు ధరలో ఈ ప్యాకేజీ ఉంది. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు మీకోసం..
తక్కువ ఖర్చుతో అయోధ్యకు వెళ్లేందుకు భారతీయ రైల్వే అయోధ్య టూర్ అవకాశాన్ని ప్రకటించింది. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ క్యాటరింగ్ కార్పొరేషన్(IRCTC) భారతీయ రైల్వేలకు చెందిన సంస్థ. ప్రయాణీకుల కోసం మంచి మంచి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఇందులో వెకేషన్ స్పాట్‌లతోపాటుగా మతపరమైన ప్రార్థనా స్థలాలు కూడా ఉంటాయి.
ప్రస్తుతం SHREE RAM JANAM BHOOMI-AYODHYA, PRAYAGRAJ WITH 03 JYOTIRLINGA DARSHAN పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీలో అయోధ్య, నాసిక్, వారణాసి మొదలైన మతపరమైన ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని అందించింది. ఈ ప్యాకేజీతో మీరు రామ జన్మభూమి, కాశీ విశ్వనాథ్, మహాకాళేశ్వర్, త్రయంబకేశ్వరంతో సహా మొత్తం 3 జ్యోతిర్ లింగాలను దర్శించుకోవచ్చు.
అయోధ్య టూర్ ప్యాకేజీ 9 రాత్రులు, 10 పగళ్లు ఉంటాయి. ఫిబ్రవరి 5, 2024 నుంచి టూర్ మెుదలవుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో లేదు. కానీ మీరు రాజ్‌కోట్ నుండి కూడా వెళ్లొచ్చు. అక్కడ వరకూ ట్రైన్‌లో ముందుగానే వెళ్లాలి. ఈ ప్యాకేజీతో మీరు అయోధ్య, ప్రయాగ్‌రాజ్, శృంగవర్‌పూర్, చిత్రకూట్, వారణాసి, ఉజ్జయిని, నాసిక్‌లను సందర్శించవచ్చు. రాజ్‌కోట్, సురేంద్ర నగర్, విరామ్‌గామ్, సబర్మతి, నదియాడ్, ఆనంద్, సాయపురి, గోద్రా, దహోత్, మేఘనగర్, రత్లాం నుండి రైలు ఎక్కేందుకు అవకాశం ఉంది.
ప్యాకేజీలో ప్రయాణీకులకు రైలు టిక్కెట్లు, వసతి, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. ప్రయాణీకుడు ఎంచుకున్న తరగతి ప్రకారం పర్యటన ఛార్జీలు ఉంటాయి. ఒక్కో వ్యక్తికి రూ.20,500 నుంచి ప్యాకేజీలు ప్రారంభమవుతాయి. ఎకానమీ (స్లీపర్) తరగతిలో ఒక్కొక్కరికి 20,500. కంఫర్ట్ (3వ ఏసీ) క్లాస్ ధర ఒక్కొక్కరికి రూ.33,000, సుపీరియర్ (సెకండ్ ఏసీ) తరగతికి వ్యక్తికి రూ.46,000 ఖర్చు అవుతుంది. మిడిల్ క్లాస్ వారు ఎకానమీ తీసుకుని వెళ్లొచ్చు. కావాలనుకుంటే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసి రావొచ్చు.
దాదాపు పది రోజులపాటు పవిత్ర స్థలాలను సందర్శించుకోవచ్చు. ఫిబ్రవరి 2న మెుదలయ్యే ఈ టూర్ ప్యాకేజీ.. ఫిబ్రవరి 14న ముగుస్తుంది. మధ్యలో ఎన్నో ప్రదేశాలు చూసేందుకు వీలుంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ సందర్శించండి.