Section 80C insurance plans | 80 సీ పరిధిలోకి వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు
Section 80C Insurance plans | ఇన్‌కమ్ టాక్స్ చట్టం సెక్షన్ 80 సి పరిధిలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చూపి పన్ను మినహాయింపు కోరవచ్చు. సాధారణంగా పన్ను మినహాయింపు కోసమే అయితే ఇన్సూరెన్స్ పాలసీలు చేయరు. కానీ 80సి పరిధిలో ఇతర సేవింగ్స్ లేనిపక్షంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చూపవచ్చు.
కుటుంబ సభ్యుల భవిష్యత్తును సురక్షితంగా కాపాడే ధీమా ఇచ్చే బీమా పాలసీలు పన్ను ఆదా చేయడంలో కూడా ఉపయోగపడుతాయి. కానీ బీమా పాలసీల లక్ష్యం కేవలం పన్ను ఆదా మాత్రమే కాకూడదని పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతుంటారు. అయినప్పటికీ ఒకవేళ మీరు బీమా పాలసీ తీసుకున్నట్టయితే ఆయా పాలసీలు 80 సీ కింద మినహాయింపు పరిధిలోకి వస్తాయో లేదో తెలుసుకోవడం మంచిది. ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశమేంటంటే సెక్షన్ 80 సీ పరిధిలో కేవలం రూ. 1.5 లక్షలు మాత్రమే మినహాయింపు కోరవచ్చు. ఇందులో జీవిత బీమాతో పాటు, పిల్లల ట్యూషన్ ఫీజులు, హౌజింగ్ లోన్ అసలు చెల్లింపులు, పీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ వంటి అనేక సేవింగ్ సాధనాలు కూడా ఉంటాయి. అయితే బీమా పాలసీలు ఏవేవి సేవింగ్స్ పరిధిలోకి వస్తాయో చూద్దాం.
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అత్యంత తక్కువ ప్రీమియంతో ఎక్కువ సొమ్ముకు బీమా చేయించుకోగలిగే పాలసీ. అంటే మీ ప్రాణానికి రిస్క్ అయినప్పుడు మాత్రమే మీరు బీమా చేయించిన మొత్తం మీ నామినీలకు వస్తుంది. అంతేతప్ప ఇతరత్రా వీటి నుంచి ఎలాంటి ప్రతిఫలం వెనక్కి రాదు. మీ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల పేర్లపై పాలసీ కొనుగోలు చేసి మీరు చెల్లించే ప్రీమియం సెక్షన్ 80 సీ కింద మినహాయింపు కోరవచ్చు. పాలసీదారుడు మరణిస్తే నామినీలకు వచ్చే సొమ్ముపై ఎలాంటి పన్ను ఉండదు.
ఎండోమెంట్ పాలసీ
ఎండోమెంట్ పాలసీ అంటే జీవిత బీమా అందించడంతో పాటు మెచ్యూరిటీ సొమ్ము వెనక్కి వస్తుంది. పాలసీ వ్యవధిలో జీవించి ఉంటే పాలసీ మెచ్యూరిటీపై నిర్ధిష్ట మొత్తాన్ని పొందుతారు. క్రమం తప్పకుండా మీరు సేవింగ్స్ చేసేలా కూడా ఇది దోహదపడుతుంది. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీపై చెల్లించే ప్రీమియంతో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే రాబడి కూడా సేవింగ్స్ బ్యాంకు వడ్డీ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. సేవింగ్స్ కోసమో, పన్ను ఆదా కోసమో ఈ పాలసీలు ఎంచుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు.
యులిప్
యులిప్ అంటే యూనిట్ లింక్డ్ ప్లాన్. అంటే మీరు ఈ పాలసీ కింద చెల్లించే ప్రీమియం షేర్ మార్కెట్‌తో లింక్ అయి ఉంటుంది. మెచ్యూరిటీ సొమ్ముకు కూడా సెక్షన్ 10 (10D) పరిధిలో పన్ను మినహాయింపు ఉంటుంది. యులిప్ కోసం చెల్లించిన ప్రీమియంను కూడా సెక్షన్ 80 సీ పరిధిలో పన్ను మినహాయింపు కోసం చూపవచ్చు.
సంబంధిత కథనం