Tuesday Motivational: ఈ ఐదు స్కిల్స్ మీలో ఉన్నాయంటే మీరు గొప్ప వ్యక్తిగా మారిపోతారు, ఆ నైపుణ్యాలు ఏంటో తెలుసుకోండి
Tuesday Motivational: ఒక మనిషి అసాధారణ సామర్ధ్యాలను కలిగి ఉన్నప్పుడే అతడు జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును దాటుకుంటూ వెళ్లగలడు. అలా మీరు శక్తివంతమైన వ్యక్తిగా ఎదగాలంటే మీకు కొన్ని రకాల లక్షణాలు అవసరం.
మీరు శక్తివంతమైన వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నారా? అసాధారణ సామర్థ్యాలను పుణికి పుచ్చుకుంటేనే మీరు గొప్ప వ్యక్తిగా ఎదగగలరు. అసాధారణ సామర్ధ్యాలు అంటే సూపర్ పవర్స్ అనుకోకండి. ఐదు ముఖ్యమైన నైపుణ్యాలు, ఈ నైపుణ్యాల్లో మీరు ఒంట పట్టించుకుంటే చాలు, మీరు ఉన్నత వ్యక్తిగా ఎదుగుతారు. అవేంటో తెలుసుకోండి.
భావోద్వేగాల నియంత్రణ
కోపం రానీయండి, ఏడుపు రానీయండి, సంతోషం రానీయండి, దుఃఖం రానీయండి... ఏది వచ్చినా ఆ ఉద్వేగాన్ని ఆ క్షణమే ఆపగలిగే శక్తి మీకు ఉండాలి. ఇదే భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం. అలా మీ భావోద్వేగాలు మీ అదుపులో ఉంటే మీరు ఏ పరిస్థితిని అయినా తట్టుకొని నిలబడగలుగుతారు. ఏ వ్యక్తికైనా భావోద్వేగాలే ట్రిగ్గర్లుగా మారుతాయి. అవి వారి పతనానికి కారణమవుతాయి. విపరీతమైన కోపం, విపరీతమైన దయ, విపరీతమైన ఏడుపు ఏదీ మంచిది కాదు. కాబట్టి మీ భావోద్వేగాలని ఎలా నియంత్రించుకోవాలో సాధన చేయండి. అవసరమైతే సైక్రియాటిస్టుల సహాయం కూడా పొందండి. ఏ వ్యక్తి అయితే భావోద్వేగాలను నియంత్రించుకుంటాడో అతని వ్యక్తిగత, వృత్తి గత జీవితంలో మంచి ఫలితాలను పొందుతాడు.
కృతజ్ఞతగా ఉండడం
కృతజ్ఞతగా ఉండడం కేవలం ఒక నైపుణ్యమే కాదు, ఇది ఒక చక్కటి మానసిక స్థితి. అందులోనూ గొప్పదైనది కూడా. ప్రతిరోజూ కృతజ్ఞతా భావాన్ని పాటించడం వల్ల మీరు ఆనందంగా ఉంటారు. జీవితంలో మీరు దేనికి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నారో గుర్తు తెచ్చుకొని కొంత సమయాన్ని దానికి వెచ్చించండి. మీ కృతజ్ఞతలు ఒక పుస్తకంలో రాసుకోండి. అది ఒక కృతజ్ఞత. మీరు ఒక వ్యక్తికి చెప్పాలనుకుంటున్నారా? పరిస్థితులకు చెప్పాలనుకుంటున్నారా? లేక వస్తువులకు చెప్పాలనుకుంటున్నారో మీ ఇష్టం. కానీ కృతజ్ఞత వ్యక్తికరించడం మాత్రం చాలా ముఖ్యం. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
మైండ్ ఫుల్ నెస్
ఇది ఎంతో అవసరమైనది. ఈ క్షణంలోనే మీరు జీవించడానికి మైండ్ ఫుల్ నెస్ అవసరం. గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉంటే మీరు ప్రశాంతంగా, సంతోషంగా జీవించలేరు. మీరు చేసే పనిలో పూర్తిగా మీరు నిమగ్నమైతేనే మీకు ఈ క్షణం ఆనందంగా సాగుతుంది. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గించాలంటే మీరు మైండ్ ఫుల్ నెస్ ను నేర్చుకోవాలి. ఇది మెరుగైన మానసిక స్పష్టతను అందిస్తుంది.
క్షమాపణ చెప్పడం
క్షమాపణ చెప్పడం బలహీనుల లక్షణం కాదు, ఒకరికి క్షమాపణ చెప్పాలంటే అది బలమైన వ్యక్తులకు ఉండే నైపుణ్యమే. ఒకరిని క్షమించడం అంత సులువు కాదు. అది భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకున్న వారే ఎదుటివారిని క్షమించగలరు. మిమ్మల్ని వారు అగౌరవపరిచినా, బాధపెట్టినా మీరు వారిని క్షమించడం అనేది నేర్చుకోండి. ఇది మీరు బాధపడకుండా ఏ బాధల వల్ల ఎలాంటి ప్రభావానికి గురికాకుండా కాపాడుతుంది. క్షమాపణ గుణం మీకు ఉంటే చాలు, మీరు జీవితంలో ఏదైనా సాధిస్తారు. ఎలాంటి మాటలకు లొంగరు. ఎలాంటి వాదనలకు భయపడరు. సానుకూలమైన ప్రవర్తనతో ముందుకు వెళతారు.
స్వీయ క్రమశిక్షణ
ఒకరు మనకు డిసిప్లిన్ గా ఉండమని చెప్పకూడదు, మనకి మనమే స్వీయ క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఇది మీపై మీరు నియంత్రణను కలిగి ఉండడం అని అర్థం. స్వీయ నియంత్రణ సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటే మీ జీవితంలో మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దేనికి నో చెప్పాలి, దేనికి ఎస్ చెప్పాలి... వంటి వాటిలో మీరు నిష్ణాతులుగా మారుతారు. స్వీయ క్రమశిక్షణ కోసం మీరు సాధన చేయాలి. ధ్యానం చేయాలి. మీపై మీరు విశ్వాసాన్ని నమ్మకాన్ని పెట్టుకోవాలి.