Moringa Water for weightloss: ఖాళీపొట్టతో ఈ పానీయాన్ని తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు-if you drink moringa water on an empty stomach you will lose weight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moringa Water For Weightloss: ఖాళీపొట్టతో ఈ పానీయాన్ని తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు

Moringa Water for weightloss: ఖాళీపొట్టతో ఈ పానీయాన్ని తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు

Haritha Chappa HT Telugu
May 09, 2024 09:00 AM IST

మునగాకులను మన దేశంలో సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటారు. మునగాకు నీరు అద్భుతమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఈ నీరు శరీరానికి పోషణ ఇవ్వడమే కాకుండా బరువు తగ్గడానికి, డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది.

మునగా ఆకుల నీళ్లు
మునగా ఆకుల నీళ్లు (Shutterstock)

మునగాకులను పురాతన కాలం నుండి ఆహారంగా, ఔషధంగా వినియోగిస్తున్నారు. దీనిలో అద్భుతమైన సూక్ష్మపోషకాలు ఉన్నాయి. పాలతో పోలిస్తే మునగాకుల్లోనే అధికంగా కాల్షియం ఉంటుంది. అలాగే క్యారెట్ల కంటే విటమిన్ ఎ పది రెట్లు అధికంగా ఉంటుంది. మునగాకు తినడం వల్ల మీ శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. మీ జీవక్రియను మెరుగుపరచడంతో పాటూ, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించడం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు, కాలేయాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మునగాకులు ఎంతో మేలు చేస్తాయి.

yearly horoscope entry point

మునగాకుల్లో పోషకాలు

మునగాకుల్లో నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి, క్యారెట్ల కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఎ, పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, పెరుగు కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ ప్రోటీన్, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం, పాలకూర కంటే 25 రెట్లు ఎక్కువ ఇనుము ఉంటుంది. మునగ చెట్టును మోరింగా అని పిలుస్తారు. మనదేశంలో వాడే ఒక సూపర్ ఫుడ్ ఇది.

మునగ నీటితో ప్రయోజనాలు

మునగాకు ఆకులను నీటిలో మరిగించి, వాటిని వడకట్టి ఒక గ్లాసులో ఆ నీళ్లను వేయాలి. ఆ నీటిని ప్రతి రోజూ ఉదయం ఖాళీ పొట్టతో తాగితే ఎంతో మంచిది. అలాగే మునగ ఆకులను ఎండలో ఎండబెట్టి మునగాకు పొడిని తయారుచేసి దాచుకోవాలి. గ్లాసు నీటిలో ఈ పొడిని వేసుకుని ప్రతి రోజూ ఉదయం ఖాళీ పొట్టతో తాగాలి. ఖాళీ పొట్టతో మోరింగా నీరు తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

పోషక పవర్ హస్

మోరింగా నీరు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం, పొటాషియం, ఇనుము వంటి ముఖ్యమైన విటమిన్లు, పోషకాలు, ఖనిజాలతో నిండి ఉంటాయి. రక్త హీనత సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ మునగ నీటిని తాగితే మంచిది. విటమిన్ల లోపంతో బాధపడుతున్నవారు, జుట్టు రాలడం, చర్మ సమస్యలు ఉన్న వారురోజువారీ మెనూ మునగాకు నీటిని చేర్చాలి. మునగాకులో బీటా కెరోటిన్, విటమిన్ సి నిండి ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

మోరింగాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పాలీఫెనాల్స్ , ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులు రాకుండా మునగ నీరు కాపాడుతుంది. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి శాకాహారులు ప్రతిరోజూ మునగాకు నీటిని తాగడం మంచిది. మునగాకులో విటమిన్ కె అధికం.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

మోరింగా నీరు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

డయాబెటిస్ ఉన్నవారికి

ఇది డయాబెటిక్ రోగులకుఅద్భుతమైనది, ఎందుకంటే ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ప్రీ డయాబెటిక్ లక్షణాలను ఎదుర్కొంటున్న వారు ఖాళీ పొట్టతో మోరింగా నీటిని తీసుకోవచ్చు.

చర్మానికి…

మునగాకులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. చర్మానికి కాంతిని అందిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

Whats_app_banner