Mirror Cleaning Tips: ఎంత తుడిచినా అద్దంపై మరకలు పోవడం లేదా? ఈ 6 టిప్స్ పాటిస్తే క్లీన్ అయి మెరిసిపోతుంది!
Mirror Cleaning Tips: ఎంత తుడిచినా ఒక్కోసారి అద్దాలపై మరకలు అలాగే ఉంటాయి. మసకగా కనిపిస్తుంటాయి. ఇలా జరుగుతుంటే కొన్ని టిప్స్ పాటిస్తే అద్దాలపై ఉన్న మరకలు పోతాయి.
ఇంట్లోని అద్దాలపై తరచూ మరకలు పడుతుంటాయి. దుమ్ము పేరుకుపోతుంటుంది. అయితే కొన్నిసార్లు క్లాత్‍తో అద్దాన్ని తుడిచినా దుమ్ముపోదు. అలాగే కొన్ని మరకలు ఉంటాయి. పూర్తిగా శుభ్రం అయినట్టు కనిపించదు. అలా క్లాత్‍తో ఎంత తుడిచినా ఒక్కోసారి లాభం ఉండదు. అటువంటి సమయాల్లో అద్దాలను ఎలా క్లీన్ చేయాలని చాలా మంది తర్జన భర్జన పడుతుంటారు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఈ పని సులువుతుంది. అద్దాలపై మరకలను తొలగించేందుకు ఉపయోగపడే చిట్కాలను ఇక్కడ చూడండి.
వెనిగర్.. నీరు
అద్దాలపై మరకలు ఎంత తుడిచినా పోకపోతే వెనిగర్ వాడడం ఉత్తమం. వెనిగర్‌లో శుభ్రం చేసే గుణాలు బాగా ఉంటాయి. అద్దాలకు కూడా ఇది పని తేస్తుంది. ముందుగా వెనిగర్, నీళ్లు సమాన మోతుదులో కలిపి ఓ స్ప్రే బాటిల్‍లో పోయాలి. మరకలు ఉన్న అద్దంపై దీన్ని స్ప్రే చేయాలి. ఆ తర్వాత మైక్రోఫైబర్ క్లాత్‍తో అద్దాన్ని తుడవాలి. అద్దంపై మరకలు తగ్గేందుకు వెనిగర్ సహకరిస్తుంది. అద్దం మెరుపు పెరుగుతుంది.
ఆల్కహాల్
అద్దంపై మరకలు తొలగించేందుకు ఆల్కహాల్ కూడా ఉపయోగపడుతుంది. అద్దంపై మరక ఉన్న చోట ఆల్కహాల్‍ను కాస్త స్ప్రే చేసి.. మైక్రోఫైబర్ క్లాత్ లేదా కాటన్ ప్యాడ్‍తో తుడవాలి. మరక పడిన చోట గట్టిగా కాకుండా కాస్త మృధువుగా రుద్దాలి. మరక పోయిన తర్వాత మరో క్లాత్ తీసుకొని మరోసారి తుడిస్తే శుభ్రంగా కనిపిస్తుంది.
న్యూస్‍పేపర్
అద్దంపై ఉన్న తేమను క్లాత్‍తో పూర్తిగా పోగొట్టండం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఎంత తుడిచినా అద్దంపై తడి మరకలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో న్యూస్‍పేపర్‌ను ఉపయోగించవచ్చు. అద్దంతా న్యూస్‍పేపర్‌తో తుడవాలి. క్లాత్‍తో పోలిస్తే ఈ పేపర్ తేమను బాగా పీల్చుకుంటుంది. అద్దంపై ఉన్న దుమ్ము, మరకలను పోగొడుతుంది.
వంట సోడా
ఇంట్లో అద్దాలపై ఉన్న మొండి మరకలను తొలగించేందుకు వంట సోడా ఎంతో ఉపకరిస్తుంది. క్లీనింగ్ గుణాలు సోడాలో అధికంగా ఉంటాయి. ఇందుకోసం ముందుగా వంట సోడాలో కాస్త నీరు పోసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని అద్దంపై మరక ఉన్న చోట రుద్దాలి. ఆ తర్వాత ఓ పొడి క్లాత్‍తో దాన్ని తుడవాలి. ఇలా చేయడం వల్ల అద్దంపై మరక తొలకడంతో పాటు మంచి షైనింగ్ వస్తుంది.
టాల్కమ్ పౌడర్
మరకలు ఉంటే అద్దంపై నీరు చలకరించి తుడిచే బదులు.. టాల్కమ్ పౌడర్ చల్లి కూడా క్లీన్ చేయవచ్చు. ముందుగా టాల్కమ్ పౌడర్‌ను అద్దంపై చల్లాలి. ఆ తర్వాత క్లాత్‍తో తుడవాలి. అయితే, ఇలా చేసిన తర్వాత కాసేపటి వరకు అద్దాన్ని చేతులతో తాకకూడదు. వెంటనే తాకితే చేతివేళ్ల ముద్రలు కనిపిస్తాయి.
నిమ్మరసం
అద్దాన్ని క్లీన్ చేసేందుకు నిమ్మరసం కూడా ఉపయోగపడుతుంది. మరకలను ఇది ప్రభావవంతంగా పోగొట్టగలదు. నిమ్మలోనూ శుభ్రం చేసే గుణాలు అధికం. నిమ్మరసం, నీరు సమపాళ్లలో కలిపి స్ప్రేబాటిల్‍లో పోసుకోవాలి. అద్దంపై మరక ఉన్న చోట స్ప్రే చేసి.. క్లాత్‍తో తుడవాలి. ఇలా చేయడం వల్ల కూడా మరక తొలగుతుంది. అద్దానికి మంచి మెరుపు వస్తుంది.