Depression | టీనేజర్లలో డిప్రెషన్‌ను ఎలా గుర్తించాలి? ట్రీట్మెంట్‌ ఏంటి?-how to recognize depression in teenagers and help them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Recognize Depression In Teenagers And Help Them

Depression | టీనేజర్లలో డిప్రెషన్‌ను ఎలా గుర్తించాలి? ట్రీట్మెంట్‌ ఏంటి?

Hari Prasad S HT Telugu
Feb 22, 2022 07:22 AM IST

సాధారణంగా టీనేజర్లను పక్కదారి పట్టకుండా చూడటమే తల్లిదండ్రులకు ఓ సవాలుగా ఉంటుంది. ఇక డిప్రెషన్‌తో బాధపడే వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది పేరెంట్స్‌కు అసలు తమ పిల్లలు డిప్రెషన్‌లో ఉన్నారన్న విషయం తెలియకపోవడమే అసలు సమస్య.

సరైన సమయానికి గుర్తిస్తే టీనేజర్లను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావచ్చు
సరైన సమయానికి గుర్తిస్తే టీనేజర్లను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావచ్చు (Pexels)

Depression.. ఇప్పుడున్న లైఫ్‌ స్టైల్‌కి చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మందిని ఈ డిప్రెషన్‌ వేధిస్తోంది. మిగతా రోగాలలాగా ఇది పైకి కనిపించదు. ఓ మనిషి డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని గుర్తించడం అంత తేలిక కాదు. అందులోనూ టీనేజ్‌లోనే ఈ డిప్రెషన్‌ బారిన పడితే చాలా ప్రమాదం. ముందుగానే దీనిని గుర్తిస్తే మరింత నష్టం జరగకుండా నివారించవచ్చు. లేదంటే ఇది ఎక్కడికి దారి తీస్తుందో కూడా తెలియని పరిస్థితి తలెత్తుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు, స్కూలు, కాలేజీల్లో టీచర్ల ఒత్తిడి ఎదుర్కొనే పిల్లలు ఈ డిప్రెషన్‌ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే అసలు ఈ డిప్రెషన్ ఏంటి? ఎలా వస్తుంది? దీనిని ఎలా గుర్తించాలన్న విషయాలను ముందుగా తెలుసుకుంటే.. ఆ డిప్రెషన్‌ను అరికట్టే అవకాశం ఉంటుంది.

డిప్రెషన్‌.. ఆ తేడా తెలుసుకోండి

పిల్లలందరూ ఒకేలా ఉండరు. కొందరు ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా కనిపిస్తారు. మరికొందరు ఎప్పుడూ ఏదో కోల్పోయిన వారిలాగా మూడీగా ఉంటారు. ఇలాంటి పిల్లల్లో డిప్రెషన్‌ గుర్తించడమే సవాలుతో కూడుకున్న పని. చాలా మంది పేరెంట్స్‌ తమ పిల్లలు మూడీగా ఉన్న సమయాల్లో అది అలవాటేగా అనుకొని వదిలేస్తారు. కానీ అలాంటి టీనేజర్లు నిజంగానే ఎప్పటిలాగే మూడీగా ఉన్నారా? లేదంటే డిప్రెషన్‌తో బాధపడుతున్నారా అన్నది చూడాలి. 

ముఖ్యంగా టీనేజీలో కలిగే హార్మోన్ల మార్పు వల్ల తరచూ వాళ్ల మూడ్‌ మారుతూ ఉంటుంది. ఇది సహజమే. కానీ ఎప్పుడూ నిరాశగా, ఒత్తిడిలో కనిపిస్తుంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. అది ముదరక ముందే మందులు లేదా థెరపీ సాయంతో దాని బారి నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు.

డిప్రెషన్‌కు ఇవే సంకేతాలు

డిప్రెషన్‌లో ఉండే టీనేజర్లలో చాలా మార్పులు కనిపిస్తాయి. ఎలాంటి కారణం లేకుండా కోపం, ఎప్పుడూ బాధలో ఉన్నట్లు కనిపించడం, నిరాశ, ఏడవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరు ఎప్పటిలాగే వారిపై అజమాయిషీ చేయాలని చూస్తే ఎదురు తిరుగుతారు.

- డిప్రెషన్‌లో ఉన్న టీనేజర్లలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. తమను తాము తక్కువగా చేసి చూసుకోవడం, తమను తాము తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి చేస్తున్నారేమో గమనించండి. ఇలాంటి వాళ్లు తమ రూపురేఖల గురించి, వైఫల్యాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు.

- ఈ సమయంలోనే వాళ్లు డ్రగ్స్‌, ఆల్కహాల్ వంటి వాటి వైపు చూస్తారు. డిప్రెషన్‌ను అధిగమించడానికి ఆల్కహాలే మందు అన్న భావనతో ఉంటారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.

- ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్లలోనే గడుపుతుంటారు. ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు.

- అప్పటి వరకూ క్లాస్‌లో మంచి ప్రతిభ కనబరిచే స్టూడెంట్ అయినా సరే.. డిప్రెషన్‌ బారిన పడినప్పుడు చదువుపై ఆసక్తి చూపరు. వాళ్ల మార్కులు, గ్రేడ్లు క్రమంగా తగ్గుతుంటాయి.

- నిర్లక్ష్యంగా ఉంటారు. మొండిగా తయారవుతారు.

- సమస్యలను పరిష్కరించకుండా వాటి నుంచి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఇది భవిష్యత్తులో వారికి చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది.

- కొన్నిసార్లు చాలా దూకుడుగా, హింసాత్మకంగా ప్రవర్తిస్తారు.

- ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు రావడం, ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కూడా చేస్తుంటారు. అసలు టీనేజర్లు ఈ సూసైడ్‌ గురించి మాట్లాడటం, జోక్‌ చేయడం వంటివి చేసినా.. పేరెంట్స్‌ చాలా సీరియస్‌గా తీసుకోవాలి.

- ఒకప్పుడు వాళ్లు ఎంతో ఆసక్తిగా చేసే పనులను కూడా పట్టించుకోరు.

- ఎక్కువగా తినడం లేదంటే అసలే తినకపోవడం, అతిగా నిద్రపోవడం, లేదంటే అసలే పడుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

- స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

టీనేజర్లలో డిప్రెషన్‌.. పేరెంట్స్‌ ఏం చేయాలి?

టీనేజర్లను డిప్రెషన్‌ నుంచి బయటకు తీసుకురావడానికి చికిత్సలు, థెరపీలు ఎన్ని ఉన్నా.. ముఖ్యపాత్ర మాత్రం తల్లిదండ్రులదే. డిప్రెషన్‌ తాలూకు లక్షణాలను గుర్తించడంతోపాటు దానిని అధిగమించడానికి వారికి తగిన సాయం అందించాల్సింది పేరెంట్సే.

- మీ టీనేజర్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి. ఎందుకలా ఒంటరిగా ఉంటున్నారు? స్నేహితులను ఎందుకు కలవడం లేదు? హోంవర్క్‌ ఎందుకు చేయడం లేదు? వంటి ప్రశ్నలు అడగండి. వారితో ఫ్రెండ్లీగా ఉంటూ సమస్యను కనుక్కొని సాయం చేయడానికి ప్రయత్నించండి.

- ఒకవేళ మీ పిల్లల ప్రవర్తన డిప్రెషనా కాదా అన్నది మీరు తేల్చుకోలేకపోతే.. వారిని మానసిక వైద్యుడు, ప్రొఫెషనల్‌ థెరపిస్ట్‌ల దగ్గరికి తీసుకెళ్లండి.

- వారిని చూస్తే ఎందుకు ఆందోళనగా ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. వారిలో కలిగిన మార్పులను వివరించండి.

- అవసరమైతే తగిన మందులు కచ్చితంగా వాడండి. ఇది డిప్రెషన్‌ను మరింత ముదరకుండా చేస్తుంది.

- వాళ్ల లైఫ్‌స్టైల్‌లో తగిన మార్పులు తీసుకురండి. మంచి పౌష్టికాహారం, సరైన నిద్ర ఉండేలా చూసుకోండి. తరచూ బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. స్పోర్ట్స్‌, డ్యాన్స్‌, సింగింగ్‌, ఏవైనా ఇతర ఆర్ట్స్‌ నేర్పించండి. డిప్రెషన్‌కు ఇదే సరైన మందు.

- మీ పిల్లలకు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ లేదంటే కుటుంబ సభ్యులు, బంధువుల్లోనే క్లోజ్‌గా ఉండేవారు కొందరు ఉంటారు. వారికి సమస్యను వివరించి.. దానిని పరిష్కరించడంలో వారి సాయం తీసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం