Ragi khichdi: కమ్మటి రాగి కిచిడీ.. వెయిట్ లాస్, డయాబెటిస్ రెసిపీ
Ragi khichdi: రుచిగా తిన్నా షుగర్ అదుపులో ఉండాలి, బరువు పెరగొద్దు అనుకుంటే రాగుల కిచిడీ ట్రై చేయండి. కడుపు నింపి, పోషకాలిచ్చే రెసిపీ ఇది. తయారీ చూసేయండి.
డయాబెటిస్ ఉన్నవాళ్లు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాగుల వల్ల కలిగే ప్రయోజనాల వల్ల డయాబెటిస్ లేని వాళ్లైనా సరే.. ఆరోగ్యం కోసం వాటిని ఆహారంలో చేర్చుకుంటున్నారు. మీరు కూడా అలా ప్రయత్నిస్తే ఒకసారి రాగులతో కిచిడీ చేసి చూడండి .ఇంకో కొత్త వంటకం మీ లిస్టులో చేరిపోతుంది. అదెలా తయారు చేయాలో వివరంగా చూసేయండి. దీంతో బరువు తగ్గడమూ సాధ్యమవుతుంది. ఈ డయాబెటిస్, వెయిట్ లాస్ రెసిపీని ప్రయత్నించండి.
రాగులతో కిచిడీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు రాగులు
పావు కప్పు పెసరపప్పు
1 ఉల్లిపాయ, సన్నని తరుగు
1 టమాటా, సన్నటి ముక్కలు
సగం కప్పు ఏవైనా కూరగాయ ముక్కలు (క్యారట్, బటానీ, బీన్స్)ఇలా ఏవైనా తీసుకోవచ్చు.
పావు టీస్పూన్ ఆవాలు
పావు టీస్పూన్ జీలకర్ర
సగం చెంచా పసుపు
సగం చెంచా అల్లం తురుము
నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు, తరుగు
1 చెంచా నెయ్యి లేదా నూనె
తగినంత ఉప్పు
కొద్దిగా కొత్తిమీర తరుగు
రాగులతో కిచిడీ తయారీ విధానం:
1. ముందుగా రాగులను, పెసరపప్పును వేరుగానే శుభ్రంగా కడుక్కోవాలి. రెండింటినీ కనీసం అరగంట సేపు నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుని వేడెక్కాక అందులో నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి చిటపటలాడాక అల్లం, వెల్లుల్లి కూడా వేసుకుని వేయించాలి.
3. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి. వేగాక అందులోనే టమాటా ముక్కలు వేసుకుని మెత్తబడేదాకా ఉడకనివ్వాలి.
4. మిగతా కూరగాయ ముక్కలు, పసుపు వేసుకుని ఒకసారి కలియబెట్టి మూత పెట్టుకోవాలి.
5. ఇప్పుడు నీళ్లు వంపేసి రాగులు, పెసరపప్పును కూడా వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. అందులోనే ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి.
6. కప్పు రాగులు, పెసరపప్పు తీసుకుంటే అవి ఉడకడానికి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి.
7. అన్నీ కాస్త మెత్తబడ్డాక ప్రెజర్ కుక్కర్ మూత పెట్టుకున్నాక మీడియం మంట మీద 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
8. తర్వాత కుక్కర్ మూత తీసుకుని కిచిడీ గట్టిగా ఉందా లేదా పలుచగా ఉందా మీ ఇష్టం బట్టి చూసుకోవాలి. గట్టిగా అనిపిస్తే కొన్ని వేడి నీళ్లు పోసుకుని ఉడికించుకోవచ్చు. పలుచగా అనిపిస్తే కాసేపు అలాగే ఉడికించుకుంటే సరి.
9. చివరగా కొత్తిమీర తరుగు వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.