బేబీకార్న్ బిర్యానీ తయారీ విధానం:
- ముందుగా బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కనీసం అరగంట పాటూ నానబెట్టుకోవాలి. ఈలోపు కూరగాయలన్నీ ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.
- బేబీకార్న్ నిలువుగా కట్ చేసి రెండు ముక్కలు చేసుకుంటే చాలు. మీకు ఇష్టం లేదనుకుంటే చిన్న ముక్కలు చేసుకోండి.
- ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని వేడెక్కాక నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. వేడెక్కాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. వాసన వచ్చేదాకా ఆగాలి.
- వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బంగారు వర్ణం లోకి వచ్చేదాకా వేయించాలి.
- ఉల్లిపాయ ముక్కలు వేగాక కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలిపి నిమిషం పాటు వేగనివ్వాలి.
- ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టుకోవాలి. ముక్కలు మెత్త బడ్డాక ముందుగా తరిగి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలు వేసుకోవాలి.
- ఈ బిర్యానీకి ఒక గ్రీన్ మసాలా వేసుకుంటే రుచి పెరుగుతుంది. దానికోసం మిక్సీ జార్ తీసుకుని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. గ్రీన్ మసాలా రెడీ.
- ఈ గ్రీన్ మసాలాను ఉడుకుతున్న బేబీకార్న్ ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి.
- పచ్చివాసన పోయేదాకా కనీసం రెండు నిమిషాల పాటూ ఈ మసాలాను వేగనివ్వాలి. తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి.
- నీళ్లు మరిగి బుడగలు వస్తుంటే ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకుని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి.
- పెద్ద మంట మీద ఉడికిస్తే మూడు విజిల్స్ వచ్చేదాకా ఆగాలి. మీడియం మంట మీద పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది.
- ఒక అయిదు నిమిషాలు అలాగే వదిలేసి మూత తీస్తే ఫ్లేవర్ బాగా పడుతుంది. చివరగా రైతాతో సర్వ్ చేసుకుంటే సరి. బేబీకార్న్ బిర్యానీ రెడీ.
ఈ బిర్యానీలో క్యారట్, బీన్స్, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ బేబీకార్న్ ఫ్లేవర్ రావాలంటే కేవలం బేబీకార్న్ ముక్కలు ఎక్కువ వేసుకుంటే చాలు.