Leadership skills in children: పిల్లల్లో లీడర్‌షిప్ స్కిల్స్ ఎలా పెంచాలి? నిపుణుల 5 సలహాలివే
Leadership skills in children: పిల్లల్లో లీడర్‌షిప్ స్కిల్స్ పెంచడం చిన్నప్పుడే సాధ్యం. ఇందుకు 5 ఉత్తమ ప్రాక్టికల్ మార్గాలను అనుసరించాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి చిన్నారికి నాయకుడిగా ఉండే సామర్థ్యం ఉంటుంది. కొందరు పిల్లల్లో పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. అయితే అందరు పిల్లలూ ఏదో ఒక సమయంలో నాయకుడిగా మారగల సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటారు. కొందరు ప్రశాంతంగా, కంపోజ్డ్‌గా ఉంటారు. కొందరు కఠినంగా ఉంటారు. కొందరు పిల్లల్లో సహజ నాయకత్వ లక్షణాలు ఉంటే, మరికొందరు తమ నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలనుకుంటే మీరు వారితో కలిసి ఆ దిశగా కృషి చేయాల్సి ఉంటుంది.
మైపీగూ సంస్థ ఫౌండర్, సీఈవో చేతన్ జైస్వాల్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంపై పలు సూచనలు చేశారు.
చిన్నతనంలోనే కొన్ని నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల కాలక్రమంలో వాటిలో పట్టుసాధిస్తారని జైస్వాల్ చెప్పారు. ఇది పోటీ నుంచి ఒత్తిడిని ఎదుర్కొనేలా చేస్తుంది. పిల్లలు కొత్త వాటిని ప్రయత్నించేటప్పుడు ఆత్మవిశ్వాసం అవసరం. ఇది వారిని జీవితంలో ముందుకు తీసుకెళుతుందని చెప్పారు. నేటి సమాజంలో సోషల్ ఇంటిలిజెన్స్ చాలా అవసరం అని చెప్పారు. పిల్లలు వారి ఆలోచనలను కమ్యూనికేట్ చేయడం ద్వారా నాయకులుగా మారగలుగుతారని చెప్పారు. ఈ దిశగా కొన్ని ప్రాక్టికల్ టిప్స్ వివరించారు.
1. చిన్నచిన్న చర్యలతో ఆత్మవిశ్వాసం
పిల్లల్లో కాలక్రమంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విభిన్న సందర్భాలను ఎదుర్కోవాలో ప్రాక్టికల్‌గా అనుభవంలోకి తేవాలి. ఉదాహరణకు రెస్టారెంట్‌లో ఆర్డర్ చేయడం, షాపులో సరుకులకు వారితో డబ్బులు ఇప్పించడం వంటి చిన్నచిన్న చర్యలే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.
2. క్యాంపులో చేరేలా ప్రోత్సహించాలి
పిల్లలను తోటివారితో కమ్యూనికేట్ చేసేలా, సహచరుల ప్రవర్తనను తెలుసుకునేలా చేయాలి. విభిన్న సమ్మర్ క్యాంపుల్లో చేర్చడం ద్వారా వారు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడం అలవరచుకుంటారు. స్వతంతంగా పనిచేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
3. పొరపాట్లు అంగీకరించడం
పేరెంట్‌గా మీ నాయకత్వ చర్యల్లో పొరపాట్లను అంగీకరించాలి. నాయకులుగా ఉండేవారు ఒక్కోసారి వైఫల్యం చెందడం సహజం అన్న వాస్తవం వారికి అర్థమవుతుంది. నేర్చుకోవడంలో అనేక తప్పులు, పొరపాట్లు జరుగుతాయని తెలుస్తుంది. ఇప్పటికీ మీరు నేర్చుకుంటున్నారని వారికి తెలియడం కూడా వారు నాయకులుగా ఎదగడానికి దోహదపడుతుంది.
4. వారి సొంత వాణి కనుగొనడంలో వారికి సహాయపడండి
వారి ఆసక్తులు వారు కనుగొనేలా ప్రోత్సహించండి. రాతపూర్వకంగా, మౌఖికంగా వాటిని ఎక్స్‌ప్రెస్ చేసేలా ప్రోత్సహించండి. చిన్నతనంలోనే పబ్లిక్ స్పీకింగ్ అలవరచుకునేలా చేస్తే అది జీవితంలో సహజమైన నైపుణ్యంగా ఉండిపోతుంది. చాలా మంది పెద్దల్లో స్టేజ్ ఫియర్, పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ వెన్నాడుతుంది. చిన్నప్పుడే దీన్ని దూరం చేయడం సులువు. తరచుగా అలా మాట్లాడేందుకు ప్రోత్సహిస్తే చాలు.
5. వలంటీర్‌గా ఉండేలా చూడాలి
వాలంటీరింగ్ ద్వారా పిల్లలు చాలా నేర్చుకుంటారు. ఇలా చేయడానికి వారు ఇష్టపడతారు. సమాజంలోని అనేక అంశాల గురించి వారికి అవగాహన వస్తుంది. సమస్యలు అర్థమవుతాయి. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించడం ఈ స్వచ్ఛంద సేవ నేర్పుతుంది. సమస్యకు పరిష్కారం గురించి వెతికేలా ఆలోచింపజేస్తుంది. ఒకరికి సాయంగా ఉండడం నేర్పుతుంది. ఫలితంగా మీ పిల్లలు మంచి నాయకులుగా ఎదుగుతారు. ఒక కాజ్ కోసం ఎలా పనిచేయాలో వారికి నేర్పుతుంది.
పిల్లల సహజసిద్ధమైన నాయకత్వ సామర్థ్యాలు వారిని ప్రభావవంతమైన నాయకులుగా అభివృద్ధి చేయడంలో సహాయపడినప్పటికీ అనుభవం, బశిక్షణ దీర్ఘకాలిక విజయానికి కీలకం.
టాపిక్