Forgiveness | క్షమాగుణం.. మనం తగ్గితే పోయేదేమీ లేదు
Forgiveness: మనకు క్షమించగలిగే శక్తి ఉన్నా చాలా సార్లు అవతలి వ్యక్తి పెట్టిన బాధను జీర్ణించుకోలేక అందులోనే మునిగి తేలుతాం. దీని వల్ల అవతలి వ్యక్తి బాగానే ఉంటారు.. కానీ అసలు మీ బాధను కనీసం గుర్తించరు. కానీ మీలో మీరే కుమిలిపోతూ మీ విలువైన సమయం వృథా చేసుకుంటారు.
Forgiveness ఇతరులను క్షమించకుండా వదిలేయడం వల్ల నష్టపోయేది మనమే. ముఖ్యంగా రిలేషన్‌షిప్స్‌లో ఇలాంటి సమస్య ఎదురవుతుంటుంది. అలాగే ఆఫీసుల్లో ఉద్యోగుల మధ్య ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారితో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.
వీటి తీవ్రత వ్యక్తులను బట్టి, వారి మధ్య ఉన్న ఆత్మీయతలను బట్టి ఉంటుంది. ఒక్కోసారి జీవితాలనే వృథా చేసుకున్న వారు మనకు తారసపడుతుంటారు. మరి దీనికి క్షమాగుణంతో పరిష్కారం లభిస్తుందా?
పగతో నష్టాలేంటి?
తన కోపమే తనకు శత్రువు.. దయ చుట్టంబగు అన్న శతక సూక్తి గుర్తుందా? మీరు క్షమించకుండా ఉంటే మీ లోని కోపం తరచూ మిమ్మల్ని నష్టపరుస్తుంది. మీరు వర్తమానంలో జీవించకుండా గడిచిన సంఘటనలను నెమరువేసుకుంటూ వారి గురించే ఆలోచిస్తూ మీ సమయాన్ని నష్టపోతారు.
మీ జీవితానికి ఒక లక్ష్యం లేకుండా పోతుంది. అది మీ ఎదుగుదలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి.
ముందుగా మానసిక ప్రశాంతత కోల్పోతారు. స్ట్రెస్ పెరుగుతుంది. మీ కార్యకలాపాల్లో ఫోకస్ తగ్గుతుంది. క్రమంగా యాంగ్జైటీ పెరుగుతుంది. డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. రక్త పోటు పెరుగుతుంది. గుండెపై భారం పడుతుంది.
అవతలి వ్యక్తిపై పగ, ప్రతీకార భావాలు తగ్గితే క్రమంగా ఈ లక్షణాలన్నీ మాయమవుతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా మీ వ్యక్తిత్వంలో మార్పు కనిపిస్తుంది.
క్షమాగుణం అలవరచుకోవాలంటే ఏం చేయాలి?
క్షమాగుణం అనేది మనలో మార్పునకు ఒక మార్గం. బాధ పడడం నుంచి క్షమించే దిశగా పయనించాలంటే క్షమాగుణం విలువను మనం తెలుసుకోవాలి. దాని వల్ల మన జీవితం ఎలా మెరుగుపడుతుందో తెలుసుకోగలగాలి.
ఏది మీ బాధను మాన్పగలుగుతుందో, ఎవరిని మన్నించాలో, ఎందుకు మన్నించాలో గుర్తించాలి.
మీరు ఇకపై బాధితుడిగా అనుకోకుండా, మిమ్మల్ని బాధ పెట్టే అధికారం అవతలి వ్యక్తిలో లేదని గ్రహించాలి.
క్షమించి వదిలేయడం సులువేనా?
మిమ్మల్ని బాధకు గురి చేసిన వారు తమ తప్పులను అంగీకరించకపోవడం మరింత బాధకు గురిచేస్తుంది. ఇలాంటి సమయాల్లో క్షమించి వదిలేయడం చాలా కష్టమైన పని.
క్షమించకుండా వదిలేస్తే మీ జీవిత ప్రయాణాన్ని మీరే నిలిపివేసినట్టు అవుతుంది. అందువల్ల ఒకసారి అవతలి వ్యక్తి అలా ప్రవర్తించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? వారి కోణంలో నుంచి ఆలోచిస్తే సరైనదేనా?
అలాంటి ప్రవర్తన మన నుంచి ఎప్పుడైనా వచ్చిందా? అలా వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని క్షమించారా? ఇలాంటి విషయాలను ఒకసారి విశ్లేషించాలి.
ఇదే అంశంపై మీ స్నేహితుడిని సంప్రదించి సంఘటనను వివరించి ఇక ఆ వ్యక్తిని క్షమించడంపై చర్చించండి.
క్షమాగుణం.. నిరంతర అభ్యాసం
ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకు సంబంధించి కూడా మనసు పదే పదే గాయపడుతుంది. ఒకసారి క్షమించినా మళ్లీ మళ్లీ ఆ విషయం గుర్తుకు వస్తుంది. అలాంటపుడు క్షమాగుణాన్ని నిరంతరం అలవరచుకోవాలి.
మీరు క్షమించిన ఆ వ్యక్తి ప్రవర్తనలో మార్పు లేనిపక్షంలో అది మీపై ఎలాంటి ప్రభావం చూపదు. క్షమా గుణం వల్ల మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. మీ జీవితం మెరుగుపడుతుందని గమనించాలి.
మీకు మనశ్శాంతి లభిస్తుందని, మీ జీవితంలో ఆనందం నిండుతుందని గుర్తించాలి. క్షమాగుణం మిమ్మల్ని బాధించే వారి అధికారాన్ని లాగేసుకుంటుందని గ్రహించాలి.
సంబంధిత కథనం
టాపిక్