Corn Rice: మక్కలు దొరికే సీజన్‌లో తప్పక తినాల్సిన కార్న్ రైస్ రెసిపీ-how to cook corn rice or pulao recipe for lunchbox and dinner ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Corn Rice: మక్కలు దొరికే సీజన్‌లో తప్పక తినాల్సిన కార్న్ రైస్ రెసిపీ

Corn Rice: మక్కలు దొరికే సీజన్‌లో తప్పక తినాల్సిన కార్న్ రైస్ రెసిపీ

Koutik Pranaya Sree HT Telugu
Sep 21, 2024 05:30 PM IST

Corn Rice: మొక్కజొన్నలతో రుచికరమైన రైస్ చేయొచ్చు. తక్కువ పదార్థాలతో సింపుల్‌గా చేసేయొచ్చు. లంచ్ బాక్స్ లోకి, డిన్నర్ లోకీ ఈ కార్న్ రైస్ బాగుంటుంది. తయారీ చూసేయండి.

కార్న్ రైస్
కార్న్ రైస్

మొక్కజొన్న రైస్ చేయడం చాలా సులభం. దీని తయారీకి సమయం కూడా తక్కువే పడుతుంది. ఈ సీజన్‌లో దొరికే తాజా మొక్కజొన్నలతో ఒకసారి ఇలా రైస్ చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది.

మొక్కజొన్న రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

ఒకటిన్నర కప్పుల మొక్కజొన్న గింజలు

1 కప్పు బాస్మతీ లేదా సన్నం బియ్యం

1 ఉల్లిపాయ, సన్నటి ముక్కలు

1 టమాటా, ముక్కలు

1 క్యాప్సికం, ముక్కలు

3 చెంచాల నూనె

1 బిర్యానీ ఆకు

2 యాలకులు

అంగుళం దాల్చిన చెక్క ముక్క

2 లవంగాలు

ఆరేడు వెల్లుల్లి రెబ్బలు

2 పచ్చిమిర్చి

అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

అరచెంచా గరం మసాలా

తగినంత ఉప్పు

1 చెంచా నిమ్మరసం

గుప్పెడు కొత్తిమీర తరుగు

మొక్కజొన్న రైస్ తయారీ విధానం:

  1. కడాయి పెట్టుకుని నూనె వేసుకుని వేడి అవ్వనివ్వాలి. అందులో మసాలా దినుసులన్నీ ఒక్కోటి వేసుకోవాలి.
  2. బిర్యానీ ఆకు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వాసన వచ్చేదాకా వేయించాలి.
  3. కాస్త కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకుని వేయించాలి.
  4. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని మగ్గించుకోవాలి. క్యాప్సికం, టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి.
  5. మొక్కజొన్న గింజలు కూడా వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి.
  6. ఉప్పు, గరం మసాలా వేసుకుని మూత పెట్టుకోవాలి.
  7. తర్వాత రెండుకప్పుల నీళ్లు పోసుకుని ఉడుకు రానివ్వాలి.
  8. అందులో బియ్యం, నిమ్మరసం వేసుకుని కూడా కలపుకుని మూత పెట్టి ఉడికిస్తే పావుగంటలో మొక్కజొన్న రైస్ రెడీ అవుతుంది. కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే చాలు.