Makka Upma: పచ్చి మక్కలతో చేసే ఉప్మా తిన్నారా? రెండు మక్క కంకులుంటే మంచి అల్పాహారం-how to cook corn or makka upma for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Makka Upma: పచ్చి మక్కలతో చేసే ఉప్మా తిన్నారా? రెండు మక్క కంకులుంటే మంచి అల్పాహారం

Makka Upma: పచ్చి మక్కలతో చేసే ఉప్మా తిన్నారా? రెండు మక్క కంకులుంటే మంచి అల్పాహారం

Koutik Pranaya Sree HT Telugu
Sep 15, 2024 06:30 AM IST

Makka Upma: పచ్చి మొక్కజొన్న గింజలతో ఉప్మా ప్రయత్నించి చూడండి. పది నిమిషాల్లో రెడీ అయ్యే ఈ సింపుల్ రెసిపీకి కొత్త పదార్థాలేమీ అక్కర్లేదు. మక్క లేదా మొక్కజొన్న ఉప్మా తయారీ తెల్సుకుని ప్రయత్నించండి.

మక్క ఉప్మా
మక్క ఉప్మా

పచ్చి మొక్కజొన్నలతో ఉప్మా చేసి చూడండి. చాలా బాగుంటుంది. రెసిపీ చదివినంత సేపు కూడా ఈ ఉప్మా చేయడానికి పట్టదు. ఇంట్లో రెండు మొక్కజొన్న కంకులుంటే చాలు. అందరు కడుపునిండా ఈ మొక్కజొన్న ఉప్మా లేదా మక్క ఉప్మా తినేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ చూసేయండి.

మక్క ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు

3 కప్పుల మొక్కజొన్న గింజలు (తాజావి మాత్రమే వాడాలి)

1 ఉల్లిపాయ, సన్నటి ముక్కల తరుగు

1 కరివేపాకు రెమ్మ

గుప్పెడు కొత్తిమీర

పావు టీస్పూన్ ఆవాలు

పావు టీస్పూన్ జీలకర్ర

పావు టీస్పూన్ ధనియాలు

4 పచ్చిమిర్చి

2 చెంచాల నూనె

4 వెల్లుల్లి రెబ్బలు

సగం చెంచా ఉప్పు

మక్క ఉప్మా తయారీ విధానం:

  1. ముందుగా రోలు లేదా మిక్సీలో ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా ముద్ద చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి.
  2. అదే మిక్సీ జార్‌లో పచ్చి మొక్క జొన్న గింజలను వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోండి. దీనికోసం లేత మొక్కజొన్నల కన్నా కాస్త ముదిరినవే బాగుంటాయి. ఉప్మా రుచిగా వస్తుంది.
  3. ఇప్పుడు ఒక అడుగు మందం ఉన్న కడాయి పెట్టుకుని నూనె వేసుకోండి. వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించండి.
  4. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయండి. కాస్త రంగు మారగానే పచ్చిమిర్చి ముద్ద వేసి ఓ పది సెకన్లు వేయించండి. కరివేపాకు వేసి వేగనివ్వండి.
  5. అందులోనే మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న ముద్ద కూడా వేసుకోండి. ఉప్పు వేసి అన్నీ బాగా కలియబెట్టాలి.
  6. ఓ అయిదు నిమిషాలు అడుగంటకుండా దీన్ని కలుపుతూనూ ఉండాలి. కాసేపటికి ముద్ద కాస్త పొడిపొడిగా అవుతుంది. అప్పుడు కొత్తిమీర చల్లుకుని మూత పెట్టుకుని మరో అయిదు నిమిషాలు మగ్గించుకోవాలి.
  7. అడుగంటకుండా చూసుకుంటూ మొక్కజొన్న కాస్త రంగు మారి మెత్తగా, పొడిగా అయ్యిందంటే ఉడికిపోయినట్లే. మక్క ఉప్మా రెడీ అయింది. దీన్ని వేడిగానే తినేయాలని గుర్తుంచుకోండి.

మొక్కజొన్న వడలకన్నా ఇది చేయడం చాలా సులభం. నూనె కూడా ఎక్కువ పట్టదు కాబట్టి ఆరోగ్యకరం కూడా. ఒకసారి ప్రయత్నించి చూడండి.