Boda kakarakaya fry: బోడకాకరకాయతో ఇలా ఫ్రై చేసి పెట్టారంటే.. ప్లేట్లు ఖాళీ చేసేస్తారు-how to cook boda kakarakaya fry recipe in tasty way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Boda Kakarakaya Fry: బోడకాకరకాయతో ఇలా ఫ్రై చేసి పెట్టారంటే.. ప్లేట్లు ఖాళీ చేసేస్తారు

Boda kakarakaya fry: బోడకాకరకాయతో ఇలా ఫ్రై చేసి పెట్టారంటే.. ప్లేట్లు ఖాళీ చేసేస్తారు

Koutik Pranaya Sree HT Telugu
Aug 05, 2024 11:30 AM IST

Bodakakarakaya fry: బోడకాకరకాయలతో ఒక్కసారి ఫ్రై చేసి చూడండి. ఎంతో రుచిగా ఉంటుంది. దాని తయారీ విధానమెలాగో చూసేయండి.

బోడకాకరకాయ ఫ్రై
బోడకాకరకాయ ఫ్రై

వర్షాకాలంలోనే దొరికే బోడ కాకరకాయల్లో చాలా పోషకాలుంటాయి. వీటినే కొన్నిచోట్ల అకాకరకాయలనీ అంటారు. ఆంగ్లంలో అయితే స్పైన్ గార్డ్ అనీ పిలుస్తారు. కేవలం వర్షాకాలంలోనే దొరికే వీటిలో అనేక విటమిన్లుంటాయి. ఇవి రోగ నిరోధక శక్తినీ పెంచుతాయి. వీటితో రుచికరమైన వేపుడు ఎలా చేయాలో తెల్సుకోండి.

బోడకాకరకాయ వేపుడుకు కావాల్సిన పదార్థాలు:

అరకిలో బోడకాకరకాయలు

1 టీస్పూన్ జీలకర్ర

2 ఉల్లిపాయలు, సన్నటి తరుగు

1 కరివేపాకు రెమ్మ

2 పచ్చిమిర్చి

టీస్పూన్ పసుపు

అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

2 చెంచాల కారం

రుచికి సరిపడా ఉప్పు

అరచెంచా జీలకర్ర పొడి

చెంచాడు నువ్వుల పొడి

అర టీస్పూన్ పంచదార

అరచెంచా ఎండుకొబ్బరి తురుము

గుప్పెడు కొత్తిమీర తరుగు

బోడ కాకరకాయ వేపుడు తయారీ విధానం:

1. ముందుగా బోడ కాకరకాయల్నీ శుభ్రంగా కడుక్కోవాలి. వాటికున్న తొడిమల్ని తీసేయాలి.

2. ఇప్పుడు ఒక పాత్రలో అవి మునిగేనన్ని నీళ్లు పోసి కనీసం పది నిమిషాలు నీళ్లలో ఉడికించుకోవాలి.

3. కాస్త రంగు మారినట్లు అవ్వగానే బయటకు తీసుకుని ఒక అయిదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

4. అవి చల్లబడ్డాక ఫోర్క్ సాయంతో మధ్యలో గాటు పెట్టి చూడాలి. తెల్లగా ఉంటే గింజల్ని కూడా అలాగే ఉంచేయొచ్చు. గింజలు ఎరుపెక్కితే వాటిని ఫోర్క్ తోనే తీసేయాలి.

5. ఉడికిన బోడ కాకరకాయల్ని సన్నటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో చెంచాడు నూనె వేసుకోవాలి.

7. నూనె వేడెక్కాక జీలకర్ర వేసుకుని చిటపటమన్నాక సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.

8. వాటి రంగు మారకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. వెంటనే కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.

9. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి.

10. మూత పెట్టుకుని ఒక అయిదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత మూత తీసి కారం, ఉప్పు, ధనియాల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి తురుము వేసుకుని బాగా కలపాలి.

11. చివరగా పంచదారా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మరో అయిదు నిమిషాల పాటూ మగ్గనిచ్చి చివరగా కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకుంటే చాలు. బోడ కాకరకాయ వేపుడు రెడీ.

టాపిక్