Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు రోజుకు ఎన్ని సీతాఫలాలు తినవచ్చు?
Diabetes: సీతాఫలాల పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. ఇది సీజనల్ పండు. తీపిగా ఉండే ఈ పండును డయాబెటిస్ పేషెంట్లు తినవచ్చా లేదా అనే సందేహం ఉంది.
సీతాఫలాలు మార్కెట్లో అధికంగా లభిస్తున్నాయి. ఇదే సీజన్లో సీతాఫలాలు ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి సీజనల్‌గా దొరికే పండ్లను కచ్చితంగా తినాల్సిందే. ఈ పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. అయితే డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు తాము ఆ పండును తినవచ్చా లేదా అనే సందేహంలో ఉంటారు. అలాగే రోజుకు ఎన్ని పండ్లను తింటే సమస్య ఉండదో కూడా తెలుసుకోవాలనుకుంటారు.
సీతాఫలం తినవచ్చా?
డయాబెటిస్ పేషెంట్లు తాము తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువో, తక్కువో చూసుకొని తినాలి. అలాగే తినే ఆహారాలో సహజ చక్కెర అధికంగా ఉన్నా కూడా వాటిని తక్కువగా తినాల్సిన అవసరం ఉంది. పండ్లు ఆరోగ్యానికి మేలే చేసినా ఆ పండ్లలో కూడా సహజ చక్కెర అధికంగా ఉంటే వాటికి దూరంగా ఉండటమే మంచిది. సీతాఫలంలో కూడా చక్కెర శాతం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తినాలనిపిస్తే ఒక చిన్న సీతాఫల పండును తినాలి. అంతేకానీ రోజులో రెండు మూడు సీతాఫలాలు పండ్లు తింటే రక్తంలో ఎక్కువ చక్కెర చేరుకునే అవకాశం ఉంది.
ఈ పండ్లను డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి. కాబట్టి వీటిని మరీ తినాలన్న కోరిక పుడితే సీతాఫలంలో సగం ముక్క లేదా చిన్న సీతాఫలం పండు ఎంపిక చేసుకుని తింటే ఉత్తమం. అంతకుమించి డయాబెటిస్ రోగులు ఈ పండు జోలికి వెళ్లకపోవడమే మంచిది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
సాధారణ వ్యక్తులకు మాత్రం సీతాఫలాలు ఎంతో మంచిది. ఇందులో విటమిన్ ఏ, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవే. ఆకలితో ఉన్నప్పుడు ఈ పండును తింటే వెంటనే శక్తి అందుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సీతాఫలంలో విటమిన్ సి, విటమిన్ b6, డైటరీ ఫైబర్, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి. రోగనిరోధక శక్తిని పెంచేవే.
సీతాఫలం ఎవరు తినకూడదు?
ఈ పండును కేవలం డయాబెటిస్ పేషెంట్లు మాత్రమే కాదు, లివర్ వ్యాధులతో బాధపడేవారు, మూత్రపిండ సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా ఈ పండుకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే గర్భిణులు కూడా సీతాఫలాన్ని ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఎందుకంటే ఈ గింజలు పొరపాటున మింగేస్తే గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటారు. అలాగే ఈ పండ్లను అధికంగా తింటే కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటివి కూడా రావచ్చు. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. మిగతావారు రోజూ ఈ సీతాఫలం పండును తిన్నా మంచిదే. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడకుండా రక్షిస్తాయి.
కోతి తినని పండు
కోతులు దాదాపు అన్ని పండ్లను తింటాయి. కానీ సీతాఫలం పండ్ల జోలికి మాత్రం పోవు. దీనికి కారణం అందులో ఎక్కువ గింజలు ఉండడమే. ఆ గింజలు ఏరుకొని తినలేక కోతులు సీతాఫలం తినేందుకు ఇష్టపడవు. కానీ కొన్ని రకాల పక్షులు మాత్రం సీతాఫలాన్ని ముక్కులతో బాగా పొడిచి పొడిచి తింటాయి.
సీతాఫలం పండ్లను తినడం వల్ల అల్సర్ వంటి రోగాలు చాలా వరకు తగ్గుతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడే వారు కూడా సీతాఫలం తినడం వల్ల ఆ పని సులువు అయిపోతుంది. నరాల బలహీనత, కండరాల బలహీనత ఉన్నవారు కూడా సీతాఫలాన్ని తింటూ ఉండాలి. పండులో ఉండే సల్ఫర్ చర్మవ్యాధులను కూడా రాకుండా అడ్డుకుంటుంది.
టాపిక్